‘బిగ్‌బాస్‌’లపై చర్యలు తీసుకోరా?: ఏపీ హైకోర్టు

30 Sep, 2022 12:44 IST|Sakshi

ఇలాంటి షోలను కట్టడిచేసేందుకు చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా, లేదా?

సామాజిక సమస్యలపై స్పందించరా?

కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. పలు శాఖలకు నోటీసులు

కుటుంబ సభ్యులంతా కలిసిచూసేలా ఉంటున్నాయా?

బూతులు, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఏముంటున్నాయి?

హైకోర్టు ధర్మాసనం ఆవేదన.. విచారణ అక్టోబర్‌ 11కి వాయిదా 

సాక్షి, అమరావతి: ఎలాంటి సెన్సార్‌షిప్‌ లేకుండా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ వంటి షోల విషయంలో ఏం చర్యలు తీసుకోరా? అంటూ ఏపీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలాంటి షోలను కట్టడి చేసేందుకు ఏదైనా చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా.. సామాజిక సమస్యలపై స్పందించే ఉద్దేశం మీకుందా? అంటూ నిలదీసింది. ప్రజలు చైతన్యవంతంగా లేరని భావించవద్దని, ఈ రోజు చైతన్యంగా లేకపోయినా, రేపు ఓ రోజు ప్రజలు తమ చైతన్యాన్ని కచ్చితంగా చూపుతారని పేర్కొంది. ఈ విషయాన్ని విస్మరించవద్దని సూచించింది. బిగ్‌బాస్‌ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌ 2019లోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసినా ఇప్పటివరకు ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయలేదని ప్రశ్నించింది.

బిగ్‌బాస్‌ వంటి షోల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ప్రసార, సమాచారశాఖ కార్యదర్శి, కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. బిగ్‌బాస్‌ వంటి షోల ద్వారా వాటి నిర్వాహకులు ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. 

బిగ్‌బాస్‌ షోను నిలిపేసేలా ఆదేశాలివ్వండి.. 
అశ్లీల, అసభ్య, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహించడంతోపాటు యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్‌ షో ప్రసారాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ శేషసాయి ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్‌బాస్‌ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహిస్తోందన్నారు. సెన్సార్‌షిప్‌ లేకుండానే ఈ షోను ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ 6వ సీజన్‌ జరుగుతోందని, ఇలాంటి షోల విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని  చెప్పారు.  

మంచి సందేశాలిచ్చే కార్యక్రమం ఒక్కటైనా ఉంటుందా? 
ధర్మాసనం స్పందిస్తూ.. ‘సమాజంలో ఏం జరుగుతోంది? టీవీల్లో గతంలో దేశభక్తుల చరిత్రలు ప్రసారం చేసేవారు. ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. ప్రజలకు మంచి సందేశాలిచ్చే కార్యక్రమం ఒక్కటైనా ఉంటోందా? ఏ కార్యక్రమంలో కూడా సృజనాత్మకత ఉండటం లేదు. ఇలాంటి షోల విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి..’ అంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. శివప్రసాద్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేవారు జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి షోల విషయంలో ఎలా వ్యవహరించాలో ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయంటూ వాటిని చదివి వినిపించారు.

ఈ మార్గదర్శకాలను పరిశీలించిన ధర్మాసనం.. ‘పాతకాలంలో గొప్ప సినిమాలొచ్చేవి. సందేశాత్మక చిత్రాలొచ్చేవి. ఇప్పుడు కుటుంబసభ్యులంతా కలిసి చూసేలా సినిమాలు, టీవీ కార్యక్రమాలు ఉంటున్నాయా? ఇప్పుడు బూతులు తప్ప ఏముంటున్నాయి? కొట్టుకోవడం, తిట్టుకోవడం, విద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప సినిమాల్లో ఏముంటోంది? ఇలాంటివాటికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజంలో ఉన్నతవర్గం మౌనంగా ఉంటోంది. సమస్యల విషయంలో వారేమీ మాట్లాడటం లేదు. ఏం జరిగినా స్పందించడం లేదు. మేము, మా కుటుంబాలు బాగుంటే చాలు అనుకుంటున్నారు. ఇది సరైన వైఖరి కాదు..’ అని వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్‌ షో విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని కేంద్ర ప్రభుతాన్ని ధర్మాసనం ఆదేశించింది.  
చదవండి: బిగ్‌బాస్‌ 16కు రూ. 1000 కోట్ల పారితోషికం! సల్మాన్‌ ఖాన్‌ క్లారిటీ

మరిన్ని వార్తలు