అపర్ణ సినీ ప్రపూర్ణ

21 Oct, 2021 00:45 IST|Sakshi

తండ్రి సినిమా క్రిటిక్, తల్లి కాస్ట్యూమ్‌ డిజైనర్‌. ఈ దంపతుల పదేళ్ల కూతురు..ఓ రోజూ ఉదయాన్నే బ్రష్‌ చేసుకుంటూ..‘‘అమ్మా నేను భవిష్యత్‌లో మంచి నటిని కాబోతున్నాను’ అని చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరూ సినీపరిశ్రమతో సంబంధాలు ఉన్నవారే అయినప్పటికీ తమ చిన్నారి చెప్పిన బుజ్జిబుజ్జి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అ చిన్నారి పదహారేళ్లకే సత్యజీత్‌ రే సినిమాలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

అప్పుడు ఆరంభమైన అపర్ణాసేన్‌ ప్రయాణం నటిగా, దర్శకురాలిగా, స్క్రీన్‌ రైటర్‌గా... ఎడిటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్‌ వ్యక్తుల జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ‘ద రేపిస్ట్‌’ సినిమా తీసి ప్రతిష్టాత్మక ‘కిమ్‌ జిసెక్‌’ పురస్కారాన్ని అపర్ణ గెలుచుకున్నారు. అనేక అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడి ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డును దక్కించుకోవడం విశేషం.

కుమార్తె కొంకణసేన్‌ శర్మతో అపర్ణాసేన్‌

అప్పటి కలకత్తాలోని బెంగాలీ దంపతులు చిదానంద్‌ దాస్‌గుప్తా, సుప్రియ దాస్‌గుప్తాలకు 1945లో అక్టోబర్‌ 25న అపర్ణ జని్మంచింది. ఆమె బాల్యం అంతా కలకత్తాలోనే గడిచింది.  బిఏ(ఇంగ్లిష్‌) డిగ్రీ పూర్తిచేసింది. 1961లో మ్యాగ్నమ్‌ ఫోటోగ్రాఫర్‌ బ్రేయిన్‌ బ్రాకేను కలిసిన అపర్ణ అతను తీస్తోన్న మాన్‌సూన్‌ సీరిస్‌లో నటించింది. పదహారేళ్లకే మోడల్‌గా మారిన అపర్ణ ..ఈ అనుభవంతో సత్యజీత్‌రే నిర్మించిన తీన్‌ కన్యలో మూడో భాగం ‘సమాప్తి’ లో నటించింది. ఈ సినిమాలో అపర్ణాకు మంచి గుర్తింపు లభించింది. మరోపక్క తన చదువును కొనసాగిస్తూనే కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ బిఏ(ఇంగ్లిష్‌) చదివింది. సమాప్తి తర్వాత ‘బక్సాబాదరల్‌’, ‘ఆకాశ్‌ కుసుమ్‌’లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేదు. తరువాత నటించిన ‘అపరాజితో’ మంచి కమర్షియల్‌ హిట్‌ను అందించింది. ఒక పక్క సినిమా, మరోపక్క థియేటర్లలో నటిస్తూ సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తరువాత సత్యజీత్‌ రే నిర్మించిన అనేక సినిమాల్లో నటించింది.
 
రేకు వారసురాలిగా..
అపర్ణ తండ్రి సత్యజిత్‌ రేలు మంచి స్నేహితులు కావడం, వల్ల రేకు సన్నిహితంగా పెరిగిన అపర్ణ ...తన మొదటి సినిమా కూడా రే దర్శకత్వం వహించడంతో..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనలా విభిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. రాజకీయాలు, వివిధ రకాల మానవ సంబంధాలపై అపర్ణా అనేక సినిమాలు నిర్మించారు. 1981లో విడుదలైన ‘36 చౌరంగీ లేన్‌’ అనే ఇంగ్లిష్‌ సినిమాతో అపర్ణాకు రచయితగా, డైరెక్టర్‌గా గుర్తింపు లభించింది. అపర్ణ సిని పరిశ్రమకు చేసిన కృషికి గాను 1986లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బెస్ట్‌ డైరెక్టర్‌ నేషనల్‌ అవార్డులను అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో జ్యూరీగా వ్యవహరించడమేగాక అనేక లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులను అందుకున్నారు. 2009లో ‘అంతహీన్‌’ లో నటించగా ..ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి.

 బెస్ట్‌ లుకింగ్‌ ఉమెన్‌..
బెస్ట్‌ లుకింగ్‌ ఇండియన్‌ ఉమెన్‌ జాబితాలో నిలిచిన అపర్ణ..నటిగా, దర్శకురాలిగా ఎదిగినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు. అయినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు, మనవ సంతానంతో ఆమె ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్‌లో బాగా పాపులర్‌ అయిన మహిళా మ్యాగజీన్‌ ‘సనంద’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాగజీన్‌ లో సామాజిక సమస్యలపై ఆమె ఎడిటోరియల్స్‌ రాస్తున్నారు.   

ద రేపిస్ట్‌..
ఈ సినిమాను పదిహేనేళ్ల క్రితమే తియ్యాలని అపర్ణాసేన్‌ అనుకుంది. ఆ తరువాత భారత్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను గమనిస్తూ ఉండేది. ఎవరూ కూడా పుట్టుకతో రేపిస్ట్‌ కారు. చిన్నప్పుడు అమాయకంగా ఉండే అబ్బాయిలు యవ్వనంలోకి వచ్చాక వారిలో ఎందుకు అత్యాచార మనస్తత్వం ఏర్పడుతుంది? రేపిస్ట్‌గా ఎలా మారుతున్నారు? ఇది కేవలం సమాజంలో ఉన్న అసమానతలు, లేదా జన్యువుల వల్ల జరుగుతోందా? ఇటువంటి ప్రశ్నలు అపర్ణ మనసులో మెదిలాయి. కానీ వేటికీ జవాబు దొరకలేదు. వీటన్నింటికి జవాబులు అన్వేషించే క్రమంలోనే ‘ద రేపిస్ట్‌’ సినిమా తీశారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివారు, అనేక మంది లాయర్లు, ఫెమినిస్టులు, స్నేహితులతో కలిసి చర్చించి తన కూతురు, ప్రముఖ నటి కొంకణా సేన్‌ శర్మ ప్రధాన పాత్రధారిగా సినిమాను తీశారు. ఇప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా తీయడం, దానికి అంతర్జాతీయ అవార్డు వరించడంతో..75 ఏళ్ల వయసులోనూ తన ప్రతిభను నిరూపించుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు