14 ఏళ్ల బంధం.. నేను, సిద్ధాంత్‌ విడిపోతున్నాం: దర్శకుడు

3 Apr, 2021 18:33 IST|Sakshi
అపూర్వ అస్రానీ-సిద్ధాంత్‌ పిల్లై (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

సంచలన ప్రకటన చేసిన అపూర్వ అస్రానీ

బాలీవుడ్‌లో మొట్టమొదటి స్వలింగ సంపర్క జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు అపూర్వ అస్రానీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సిద్ధాంత్‌ పిల్లై. గత 14 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితమే సొంతంగా ఇళ్లు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అపూర్వ అస్రానీ శనివారం సంచలన ప్రకటన చేశాడు. తామిద్దరం విడిపోతున్నామని.. 14 ఏళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ‘‘మా ప్రయాణంలో కొన్ని తప్పులు చేశాం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ ప్రకటన చేశాడు అపూర్వ అస్రానీ.

దాంతో పాటు ఓ నోట్‌ని కూడా షేర్‌ చేశాడు. దీనిలో.. ‘‘నేను, సిద్ధాంత్‌ విడిపోతున్నట్లు ప్రకటించడానికి చాలా బాధపడుతున్నాను. దేశంలో చాలా మంది ఎల్‌జీబీటీక్యూ కపుల్స్‌కి మేం ఆదర్శంగా నిలిచాం. ఈ విషయం వారందరిని నిరాశపరుస్తుందని నాకు తెలుసు. కానీ ఈ 14 ఏళ్ల కాలంలో ప్రతి రోజు ఎంతో ముఖ్యమైనది.. విలువైనది. ఇన్నేళ్ల తర్వాత మేం స్నేహపూర్వకంగా విడిపోతున్నాం’’ అని తెలిపాడు

‘‘మన దేశంలో స్వలింగ సంపర్క జంటకు ఎలాంటి ప్రేరణలు, ఆదర్శాలు ఉండవు. మేం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేకమైన మార్గంలో కొన్ని తప్పులు చేశాం. స్వలింగ సంపర్కులమైనప్పటికి మా ప్రేమ గురించి ధైర్యంగా ప్రకటించాం.. అంతేకాక కలిసి ఉండాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తొలి తరం ఎల్‌జీబీటీక్యూ జంట మేమే. దీని గురించి చెప్పడానికి నాకు ఎలాంటి బాధ లేదు. కానీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మా ప్రయాణంలో కూడా ఆ మార్పులు వచ్చాయి. దాంతో మేం విడిపోక తప్పడం లేదు’’ అన్నాడు.

‘‘ఈ సందర్భంగా మీ అందరిని కోరిది ఒక్కటే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా గోప్యతని, మనోభావాలని గౌరవించాలని కోరుకుంటున్నాను. ఎలాంటి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ మెసేజ్‌లలో కూడా మమ్మల్ని ట్యాగ్‌ చేయవద్దు. భవిష్యత్తుపై నమ్మకం ఉందనే మాటతో దీన్ని ముగించాలనుకుంటున్నాను. సిద్‌, నేను అనే కాదు మాలో ప్రతి ఒక్కరం కోరుకునేది ప్రేమ, కమిట్‌మెంట్‌, సురక్షితమైన నివాసం. నమ్మకంపై ఆశలు వదులుకోకండి’’ అంటూ అపూర్వ అస్రానీ ఈ నోట్‌ని ముగించాడు.

A post shared by Apurva (@apurva_asrani)

ఇక కొద్ది రోజుల క్రితం అపూర్వ నటి సంధ్య మ్రిదులతో కలిసి ఉన్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీనిలో ఆమెని మ్యాచ్‌మేకర్‌ అని.. తనను మ్యాచ్‌ చేసింది అని తెలిపాడు. అపూర్వ అస్రానీ, సిద్ధాంత్‌ గతేడాది గోవాలో సొంతంగా ఇల్లు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘‘గత 13 ఏళ్లుగా మమ్మల్ని కజిన్స్‌గా చెప్పుకుంటూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా గురించి చుట్టుపక్కల వారికి తెలియకుండా ఉండటం కోసం గది తలుపులు మూసి ఉంచేవాళ్లం. కొద్ది రోజుల క్రితం మా సొంత ఇంటిని కొనగోలు చేశాం. మేం పార్ట్‌నర్స్‌మని ఇప్పుడు మా ఇరుగుపొరుగు వారికి మేమే స్వచ్ఛందంగా చెప్తున్నాం. ఎల్‌జీబీటీక్యూ కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి ఈ ప్రకటన చేస్తున్నాం’’ అంటూ ట్వీట్‌ అపూర్వ ట్వీట్‌ చేశాడు. ఇలా ప్రకటించిన ఏడాదిలోపే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చాడు. 
 

చదవండి: 
‘ప్రియురాలి’తో మహిళ.. తీసుకెళ్లిన పోలీసులు
'గే'ల కోసం మాట్లాడితే రూ.10 ల‌క్ష‌ల ఫైన్‌

మరిన్ని వార్తలు