పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది.. ఆ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం

18 Jan, 2023 07:09 IST|Sakshi
సంగీత దర్శకురాలు, గాయని ఇశ్రత్‌ కాత్రి

పులి కడుపున పులిబిడ్డే పుడుతుంది అనేది సామెత కావొచ్చు. ఏఆర్‌.రెహ్మాన్‌ కుటుంబం విషయంలో ఇది అక్షరసత్యం. ఆ కుటుంబానికి సంగీతం ఒక వరం. ఏఆర్‌.రెహ్మాన్‌ తండ్రి శేఖర్‌ సంగీత కళాకారుడు. దీంతో ఆయన కుటుంబం సంగీత ఆనందనిలయంగా మారింది. ఏఆర్‌.రెహ్మాన్‌ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. భరతమాత ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన ఆస్కార్‌ నాయకుడు ఆయన. రెహ్మాన్‌ సోదరీమణులు, పిల్లలు సంగీత సేవకులే.

ఏఆర్‌.రెహ్మాన్‌ రూపొందించిన వందేమాతరం ఆల్బమ్‌ జాతీయ గీతంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోదరి ఇశ్రత్‌ కాత్రి కూడా ఆయన అడుగు జాడల్లోనే సంగీత పయనం చేస్తున్నారు. అన్నయ్య సంగీత దర్శకత్వంలో ఇప్పటికే పాడుతున్న ఇశ్రత్‌ కాత్రి సంగీత దర్శకులుగానూ అవతారం ఎత్తారు. చిత్రాలతో పాటు ప్రైవేట్‌ ఆల్బమ్‌లకు సంగీతాన్ని అందిస్తున్నారు. అలా తాజాగా ఎందయుమ్‌ చారుమతి మగిళ్‌ందు కులావి అనే కవి భారతీయార్‌ కవితా పదాలతో వందేమాతరం అనే ఆల్బమ్‌ను తనదైన శైలిలో రూపొందించారు.

ఈ పాటకు స్వరాలు సమకూర్చడమే కాకుండా పాడి, నటించి స్వయంగా రూపొందించడం విశేషం. ఇది మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భారతదేశం ఖ్యాతిని కీర్తించే ఆల్బమ్‌గా ఉంటుందని ఇశ్రత్‌ కాత్రి తెలిపారు. ప్రముఖ దర్శకుడు మాదేశ్‌ దర్శకత్వం వహించిన ఈ ఆల్బమ్‌కు గురుదేవ్‌ చాయాగ్రహణం, దినేష్‌ పొన్‌రాజ్‌ ఎడిటింగ్‌ బాధ్యతలను నిర్వహించారు. దీన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆల్బమ్‌ను దేశానికి అందించడం తన కృతజ్ఞతతో కూడిన బాధ్యత అని సంగీత దర్శకులు ఇశ్రత్‌ కాత్రి పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు