అప్పటి నుంచి నాన్నతో అయినా సరే ఒంటరిగా ఉండాలంటే భయం: నటి

17 Jul, 2021 12:03 IST|Sakshi

ముంబై: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘మీటూ’ ఉద్యమం తర్వాత చాలా మంది మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడిస్తున్నారు. పలు రంగాల్లో పెద్ద మనుషులుగా చెలామణీ అయ్యే ‘మేక వన్నె పులుల’ అసలు బండారం బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా తనూ శ్రీ దత్తా మొదలు పలువురు బాలీవుడ్‌ భామలు, దక్షిణాది సెలబ్రిటీలు కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిర్గతం చేస్తున్నారు. హిందీ టీవీ నటి, స్ప్లిట్స్‌విల్లా ఫేం ఆరాధన శర్మ తాజాగా ఈ జాబితాలో చేరారు. 

ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ‘‘ఆ భయానక ఘటన గురించి నా జీవితంలో మర్చిపోలేను. నాలుగైదేళ్ల క్రితం అనుకుంటా.. అప్పుడు నేను పుణెలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నా. నాకప్పుడు 19 ఏళ్లు ఉంటాయి. ఒకరోజు స్వస్థలం రాంచికి వెళ్లినపుడు ఓ వ్యక్తిని కలిశాను. అతడు ముంబైలో కాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. అప్పటికే నేను పుణెలో పలు మోడలింగ్‌ అసైన్‌మెంట్స్‌ చేసి ఉన్నందున తన గురించి తెలుసు.

రాంచీకి వెళ్లినపుడు తను నన్ను కలిశాడు. ఒక మంచి కారెక్టర్‌ ఉంది. అడిషన్‌ ఇమ్మన్నాడు. నేను సరే అన్నాను. ఇద్దరం కలిసి స్క్రిప్టు చదువుతున్నాం. ఇంతలో అతడు నెమ్మదిగా నన్ను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. తొలుత నాకేం అర్థంకాలేదు. కానీ, విషయం అర్థమైన వెంటనే.. అతడిని తోసేసి గది నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చాను’’ అని తనకు ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

అదే విధంగా... ‘‘ఆ ఘటన తర్వాత నాకు పురుషులపై నమ్మకం పోయింది. నా మనసులో చెరగని ముద్ర పడింది. అప్పటి నుంచి.. ఏదైనా సందర్భంలో.. నా తండ్రితో అయినా సరే గదిలో ఒంటరిగా ఉండాలంటే నాకు భయం వేస్తుంది. ఎవరైనా సరే నన్ను తాకితే కంపరంగా ఉంటుంది. నాపై ఇంతటి చెడు ప్రభావం చూపిన ఆ ఘటనకు కారణమైన వ్యక్తిని అప్పుడే నిలదీయాలని మా అమ్మ నిర్ణయించుకుంది. కానీ మా కుటుంబ సభ్యులు గొడవలు వద్దంటూ సర్దిచెప్పారు’’ అని ఆరాధన శర్మ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాగా స్ప్లిట్స్‌విల్లా షోలో పాల్గొన్న ఆరాధన... తారక్‌ మెహతా కా ఉల్టా చష్మా షోతో పాపులర్‌ అయ్యారు. అదే విధంగా.. అల్లావుద్దీన్‌- ‘నామ్‌ తో సునా హై హోగా’లో సుల్తానా తమన్నా పాత్ర పోషించారు.


 

A post shared by Aradhana Sharma (@aradhanasharmaofficial)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు