జాన్వీ అలా పిలిస్తే విచిత్రంగా, కొత్తగా అనిపిస్తుంది: అర్జున్‌

12 Jul, 2021 14:32 IST|Sakshi

ముంబై: ‘‘అన్షులా మాత్రమే.. నన్ను ‘భాయ్‌’ అని పిలుస్తుంది. కానీ జాన్వీ ‘అర్జున్‌ భయ్యా’ అంటుంది. ఎందుకో జాన్వీ అలా పిలిస్తే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. చాలా కొత్తగా కూడా ఉంటుంది’’ అన్నాడు బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌. నిజానికి తనను అలా పిలవమని, ఎప్పుడూ చెప్పలేదని.. జాన్వీకి ఎలా నచ్చితే అలాగే పిలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ తమది పరిపూర్ణ కుటుంబం కాదని, ఒకరితో ఒకరం కలిసి పోయేందుకు ఇంకాస్త సమయం పడుతుందని పేర్కొన్నాడు. తామంతా కలిసినపుడు ఎంతో ఆహ్లాదంగా గడుపుతామని, అయితే అంతమాత్రాన ఇప్పుడే ఒక్క కుటుంబంగా మారిపోయామని చెప్పడం అబద్ధమే అవుతుందన్నాడు.

కాగా శ్రీదేవి మరణించిన సమయంలో జాన్వీ, ఖుషీకి దగ్గరయ్యారు బోనీ కపూర్‌ మాజీ భార్య మోనా శౌరీ పిల్లలు అర్జున్‌, అన్షులాలు. అప్పటి నుంచి చెల్లెళ్లద్దరికీ అన్న ప్రేమను పంచుతున్నాడు అర్జున్‌ కపూర్‌. ఈ విషయం పట్ల బోనీ కపూర్‌ సైతం సంతోషంగా ఉన్నాడు. అయితే, జాన్వీ, ఖుషీలతో తన అనుబంధం గురించి అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘కేవలం అభిప్రాయాలు వేరుగా ఉన్నంత మాత్రాన మేం ఇంకా కలిసిపోలేదని చెప్పడం లేదు. రెండు వేర్వేరు కుటుంబాలు ఒక్కటి కావడానికి చాలా సమయం పడుతుంది. అంతేగానీ.. ఇప్పుడే అంతా కలిసిపోయాం.. మేమంతా ఒక్కటే అనే అబద్ధపు ప్రచారాలు చేయడం నాకిష్టం ఉండదు. దేనికైనా సమయం పడుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మోనాకు విడాకులు ఇచ్చి, బోనీ కపూర్‌ శ్రీదేవిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన మోనా 2012లో మరణించింది. ఆమె చనిపోయిన 6 సంవత్సరాలకు శ్రీదేవి కన్నుమూసింది. 
 

మరిన్ని వార్తలు