సోనమ్‌ వల్ల గొడవ, చివరికి తన్నులు తిన్నా: హీరో

2 Jun, 2021 18:15 IST|Sakshi

గొడవలకు దూరంగా ఉండే బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ బాల్యంలో మాత్రం ఓ విద్యార్థిని చెడుగుడు ఆడేశాడట. తన కజిన్‌ సోనమ్‌ కపూర్‌ను ఏడిపించిన వ్యక్తిని నిందిస్తూ పట్టపగలే చుక్కలు చూపించబోయాడట! కానీ అతడు పెద్ద బాక్సర్‌ కావడంతో అర్జున్‌ వాచిపోయిన కన్నుతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో వివరంగా తెలియాలంటే ఇది చదివేయండి.. 

అర్జున్‌ కపూర్‌, అతడి కజిన్‌ సోనమ్‌ కపూర్‌ ఆర్య విద్యా మందిర్‌ పాఠశాలలో చదివేవారు. ఇద్దరికీ బాస్కెట్‌బాల్‌ ఆడటం అంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఓసారి సోనమ్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో బాస్కెట్‌బాల్‌ ఆడుకుంటుండగా సీనియర్లు వచ్చి ఆమె దగ్గరున్న బాల్‌ను లాక్కున్నారు. ఆడింది చాలు, ఇప్పుడు మేం ఆడుకుంటామని దురుసుగా సమాధానమిచ్చారు. దీంతో సోనమ్‌ గుక్క పెట్టి ఏడ్చుకుంటూ అర్జున్‌ దగ్గరకు వెళ్లి ఓ అబ్బాయి నాతో చెడుగా ప్రవర్తించాడు అని ఫిర్యాదు చేసింది. నిజానికి అర్జున్‌ గొడవలకు దూరంగా ఉండే మనిషి. కానీ తన సోదరిని ఏడిపించారని తెలియగానే అతడి కోపం కట్టలు తెంచుకుంది.

వెంటనే అర్జున్‌ తన కజిన్‌ను ఏడిపించిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. అతడు అలానే కాసేపటి వరకు చూసీచూసీ చివరకు అర్జున్‌ ముఖం మీద గట్టిగా ఒక పంచ్‌ ఇచ్చాడట. దీంతో కమిలిపోయిన ముఖంతో అర్జున్‌ ఇంటికి వెళ్లగా.. అంతా తన వల్లే జరిగిందని బాధపడిన సోనమ్‌ క్షమాపణ కూడా చెప్పింది. అయితే అతడో బాక్సర్‌ అని తెలియక గొడవ పెట్టుకున్నానని, కానీ అతడిచ్చిన పంచ్‌కు ఆస్పత్రికి కూడా వెళ్లాల్సి వచ్చిందని అర్జున్‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పైగా ఈ గొడవకు అంతటికీ తనే కారణమంటూ తనను సస్పెండ్‌ చేశారని తెలిపాడు. తనకు ఇంతటి ఘోర అవమానం జరిగినందుకు గానూ ఇకపై ఏం జరిగినా స్కూల్‌లో నీ గురించి నువ్వే చూసుకో అని సోనమ్‌కు గట్టిగా చెప్పానని పేర్కొన్నాడు.

కాగా అర్జున్‌ చివరిసారిగా 'సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌' చిత్రంలో కనిపించాడు. ఇందులో జాన్‌ అబ్రహాం, నీనా గుప్తా, అదితిరావు హైదరీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించారు. అర్జున్‌ ప్రస్తుతం 'ఏక్‌ విలన్‌ 2', 'భూత్‌ పోలీస్‌' చిత్రాలు చేస్తున్నాడు.

చదవండి: మలైకా ఇంటి దగ్గర్లో బాలీవుడ్‌ నటుడి కొత్త విల్లా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు