మంచి పాత్రలు వస్తున్నాయి కానీ..!

23 Dec, 2021 05:41 IST|Sakshi

‘‘ఇప్పటివరకూ నాకు సంప్రదాయమైన పాత్రలే వచ్చాయి. మంచి పాత్రలొస్తున్నాయి కానీ, నేనేంటో నిరూపించుకునే సవాల్‌తో కూడిన పాత్రలు ఇంకా రాలేదు’’ అని హీరోయిన్‌ అమృతా అయ్యర్‌ అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్‌ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అమృతా అయ్యర్‌ మాట్లాడుతూ– ‘‘స్నేహం నేపథ్యంలో ‘అర్జున ఫల్గుణ’ ఉంటుంది. ఆపదలో ఉన్న ఓ స్నేహితురాలికి ఐదుగురు స్నేహితురాళ్లు ఎలా సాయపడ్డారన్నది ఆసక్తిగా ఉంటుంది.

ఈ సినిమా షూటింగ్‌ 50 శాతం అడవుల్లో జరిగింది. సల్వార్‌ వేసుకుని అడవుల్లో పరిగెత్తడం కష్టంగా అనిపించింది. కొండలపై షూటింగ్‌ కోసం రాను పోను మూడు గంటలు నడిచేవాళ్లం. ‘నువ్వు ఏదైనా చేయగలవు’ అంటూ తేజ మార్నిగారు స్పూర్తి నింపారు. ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌గారి సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. ‘రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాల్లో నా పాత్రల పరంగా సంతృప్తిగా ఉన్నాను. నాకు గ్లామర్‌ పాత్రలు సౌకర్యంగా అనిపించవు.. ప్రస్తుతానికి చేయాలనుకోవడం లేదు కూడా. ప్రస్తుతం చేస్తున్న ‘హనుమాన్‌’ 70 శాతం పూర్తయింది. వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన లేదు’’ అన్నారు.

మరిన్ని వార్తలు