Art Director RK Vijay Murugan: నాకు డబ్బు కంటే సంతృప్తే ముఖ్యం

19 Jul, 2022 13:17 IST|Sakshi

డబ్బు కంటే తనకు సంతృప్తే ముఖ్యం అని ప్రముఖ కళా దర్శకుడు విజయ్‌ మురుగన్‌ పేర్కొన్నారు. ఇరవిన్‌ నిళల్‌ చిత్ర కళా దర్శకుడు ఈయన. నటుడు పార్తీబన్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడుగా నటించిన చిత్రం ఇది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మూడు అంతర్జాతీయ అవార్డులను అంతేకాకుండా సింగిల్‌ షాట్‌ తెరకెక్కించిన ఈ చిత్రం గిన్నిస్‌ రికార్డు కెక్కింది. సినీ ప్రసంశలను అందుకున్న ఈ నెల 15వ తేదీన విడుదలైంది.

పార్తీబన్‌ ప్రయోగాన్ని అందరూ ప్రసంశిస్తున్న తరుణంలో ఈ చిత్ర కళా దర్శకుడూ తన కళా దర్శకత్వ ప్రతిభకు అభినందనలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. తాను సినీరంగంలోకి 17వ ఏటనే ప్రవేశించినట్లు చెప్పారు. ప్రముఖ కళా శిల్పకారుడు శ్రీనివాసన్‌ తన మామ అని, ఆయన నుంచే తనకు ఈ కళపై ఆసక్తి కలిగిందని చెప్పారు. కళా దర్శకుడుగా చార్లీ చాప్లిన్‌ తన తొలి చిత్రం అని తెలిపారు. ఇరవిన్‌ నిళల్‌ తన 50వ చిత్రం అని తెలిపారు.

పార్తీబన్‌తో తనకు 20 ఏళ్ల అనుబంధం అని పేర్కొన్నారు. ఇరవన్‌ నిళల్‌ రెండేళ్ల పయనం అని చెప్పారు. పార్తీబన్‌ కథ చెప్పినప్పుడు ఆయన భావాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని చేయగలనా అనే సందేహం కలిగిందన్నారు. ఒక సమయంలో ఈ చిత్రం నుంచి వైదొలిగానని, అయితే ఆయన సినిమా ప్రయోగం చేస్తున్నప్పుడు తానెందుకు ఆయనకు అనుగుణంగా పని చేయకూడదనే భావన కలగడంతో తిరిగి వచ్చానన్నారు. ఈ చిత్రం కోసం 95 రోజులు రిహార్సల్స్‌ చేశామని తెలిపారు. అదే విధంగా 23 రోజులు షూటింగ్‌ చేశామన్నారు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం 72 ప్రాంతాల్లో 59 సెట్స్‌ వేసినట్లు విజయ్‌ మురుగన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు