Friendship Day 2021: మా స్నేహానికి రేంజ్‌ అడ్డు కాదు!

1 Aug, 2021 00:46 IST|Sakshi

ఫ్రెండ్‌షిప్‌ డే స్పెషల్‌

ఒకరితో స్నేహం చేయడం అంటే ఓకే. ఇద్దరు ముగ్గురు స్నేహితులున్నా ఓకే. అభిప్రాయభేదాలు ఉన్నా సర్దుకుపోవచ్చు. కానీ పదమూడు మంది స్నేహితులంటే సర్దుబాట్లు చాలా ఉంటాయి. శ్రీనివాస్‌ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్, ‘చిత్రం’ శ్రీను, ‘సత్యం’ రాజేశ్, తాగుబోతు రమేశ్, ధన్‌రాజ్, సప్తగిరి, సత్య, ప్రవీణ్, వేణు, నవీన్‌ నేని, నందు, రఘు... వీరంతా మంచి స్నేహితులు. స్నేహానికి విలువ ఇచ్చే ఈ 13 మంది ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇచ్చుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఆ స్నేహబంధం గురించి అడిగిన ‘సాక్షి’తో నటుడు శ్రీనివాస్‌ రెడ్డి చెప్పిన విశేషాలు.

మా పదమూడు మందికి ఒక వాట్సప్‌ గ్రూప్‌ ఉంది. పేరు ‘ఫ్లయింగ్‌ కలర్స్‌’. మేమంతా ఆర్టిస్టులుగా రంగుల ప్రపంచంలో ఉంటాం కాబట్టి, ఒక మంచి క్యారెక్టర్‌ చేసినప్పుడు ఫ్లై అవుతుంటాం కాబట్టి మా గ్రూప్‌కి ‘ఫ్లయింగ్‌ కలర్స్‌’ అని పెట్టుకున్నాం.

మా గ్రూపులో ఉన్నవారందరం ఒకరికొకరం పరుగెత్తి పోటీపడే ఆర్టిస్టులమే. అయినా కానీ అదంతా ప్రొఫెషనల్‌ లైఫ్‌. ఫ్రెండ్‌షిప్‌ విషయంలో రేంజ్‌ని పట్టించుకోం. పోటీని దూరంగా ఉంచుతాం. ‘వెన్నెల’ కిశోర్‌ అయినా ఒకటే.. నవీన్, శ్రీనివాస్‌ రెడ్డి అయినా ఒకటే. అందరం సరదాగా ఒకరికొకరం అన్నట్లుగా ఉంటాం.

అవకాశాల పరంగా ఎవరికి వారిమే అన్నట్లు ఉంటాం. ఒకరికొకరు చాన్సులు చెప్పుకునే అవసరం ఉండదు. గ్రూప్‌లో ఇలాంటి విషయాలను కలపం. మా గ్రూప్‌లోని సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా మీట్‌ అవుతుంటాం. ముఖ్యంగా ఏవైనా పండగలు, శుభకార్యాలప్పుడు కలుస్తుంటాం.

మేం తీసిన ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత మరో సినిమా అనుకున్నాం. కానీ ఆర్టిస్టులుగా మేమందరం బిజీగా ఉన్నాం. అయితే మళ్లీ ఓ సినిమా ప్లాన్‌ చేసే అవకాశం ఉంది. 

ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో మాటా మాటా అనుకున్నా, ఆ తర్వాత ఎవరికి వారు కంట్రోల్‌ కాగలిగినవాళ్లమే. సో... మా మధ్య పెద్దగా సమస్యలు రాలేదు. అందరూ సరదాగా ఉంటాం. రిలాక్సేషన్‌ కోసం ఫన్నీ కౌంటర్స్‌ వేస్తుంటాం. ∙మాలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఒకరికొకరం హెల్ప్‌ చేసుకుంటాం. అలాగే మేం అందరం కలిసి కోవిడ్‌ టైమ్‌లో కొందరికి హెల్ప్‌ చేశాం.

మామూలుగా నెలకోసారి కలవడం మా అలవాటు. అప్పుడు డ్రెస్‌ కోడ్‌ అనుకుంటాం. ఉదాహరణకు చిల్డ్రన్స్‌ డే అంటే స్కూల్‌ డ్రెస్సులు, పండగలప్పుడు అందుకు తగ్గ డ్రెస్సులు. కరోనా వల్ల మా మీటింగ్స్‌ కట్‌ అయ్యాయి. ఈ ఫ్రెండ్‌షిప్‌ డేకి కలుద్దామనుకున్నాం కానీ కరోనా టైమ్‌ కాబట్టి వద్దనుకున్నాం. 

మరిన్ని వార్తలు