Aryan Khan: షారుఖ్‌ను చూసి బోరుమని ఏడ్చేసిన ఆర్యన్‌ ఖాన్‌

5 Oct, 2021 22:01 IST|Sakshi

Aryan Khan Cried: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే! శనివారం రాత్రి ముంబై తీరంలోని ఓ క్రూయిజ్‌ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు మెరుపుదాడి జరిపి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌తోపాటు ఆర్యన్‌ ఖాన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ముంబై కోర్టు ఈ నెల 7వ తేదీ వరకు అతడిని ఎన్‌సీబీ కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది.

ఇదిలా వుంటే తన కొడుకును కలవడానికి షారుఖ్‌ కొద్దిరోజుల క్రితం అధికారుల అనుమతి కోరగా ఇందుకు ఎన్‌సీబీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లాకప్‌లో ఉన్న కొడుకును చూడటానికి వెళ్లాడు షారుఖ్‌. అయితే తండ్రిని చూడగానే ఆర్యన్‌ బోరుమని ఏడ్చినట్లు మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. కొడుకును అలాంటి దుస్థితిలో చూసి షారుఖ్‌ సైతం తల్లడిల్లిపోయినట్లు సమాచారం. అధికారులు రైడ్‌ చేసిన సమయంలో తన కొడుకు దగ్గర ఎలాంటి డ్రగ్స్‌ దొరక్కపోయినప్పటికీ అతడిని ఇలా లాకప్‌లో పెట్టడాన్ని చూసి ఎంతగానో బాధపడ్డాడట షారుఖ్‌.

కాగా క్రూయిజ్‌ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు చేసిన మెరుపుదాడిలో 13 గ్రాముల కొకైన్‌, 21 గ్రాముల చరాస్‌, 5 గ్రాముల మెఫెడ్రోన్‌తో పాటు కొన్ని పిల్స్‌ను అలాగే రూ.1,33,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్‌తో సహా మున్మున్‌ ధమేచా, అర్బాజ్‌ మర్చంట్‌, ఇస్మీత్‌ సింగ్‌, గోమిత్‌ చోప్రా, నూపుర్‌ సారిక, విక్రాంత్‌ చోకర్‌, మొహక్‌ జైస్వాల్‌ తదితరులను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు