Ashok Selvan: ప్రియురాలిని పెళ్లాడిన యంగ్‌ హీరో.. ఫోటోలు వైరల్‌

13 Sep, 2023 10:13 IST|Sakshi

రీల్‌ లైఫ్‌లో జంటగా కనిపించి మురిపించిన కొందరు హీరోహీరోయిన్లు నిజ జీవితంలోనూ జోడీ కట్టిన సంగతి తెలిసిందే! తాజాగా అదే బాటలో పయనించాడు కోలీవుడ్‌ హీరో అశోక్‌ సెల్వన్‌. హీరోయిన్‌ కీర్తి పాండియన్‌తో ఏడడుగులు వేశాడు. బ్లూ స్లార్‌ మూవీలో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 13న తమిళనాడులోని తిరునల్వేలిలో ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కీర్తి పాండియన్‌ కజిన్‌ రమ్య పాండియన్‌ ఈ కొత్త జంట ఫోటోలను నెట్టింట షేర్‌ చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపింది. 'ప్రియమైన కన్మని(కీర్తి) హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌.. ప్రియాతిప్రియమైన మాపిలై(అశోక్‌ సెల్వన్‌).. మా కుటుంబంలోకి స్వాగతం' అని రాసుకొచ్చింది. కాగా అశోక్‌, కీర్తి పాండియన్‌ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగినా వీరి దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడన్‌గా పెళ్లి చేసుకోవడంతో అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. జంటగా కొత్త జీవితం ఆరంభించబోతున్న దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఇకపోతే అశోక్‌ సెల్వన్‌ పిజ్జా 2, భద్రమ్‌ లాంటి డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. తమిళంలో ఓ మై కడవులే సినిమాతో సెన్సేషన్‌ హిట్‌ కొట్టిన అతడు వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవలే పోర్‌ తొళిల్‌ అనే థ్రిల్లర్‌ మూవీతో మరో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ప్రస్తుతం అతడు బ్లూ స్టార్‌ సినిమా చేస్తున్నాడు. దీన్ని పా రంజిత్‌ నిర్మిస్తున్నాడు.

చదవండి: స్నేహకు క్రేజీ ఆఫర్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్‌ హీరోకి జోడిగా

మరిన్ని వార్తలు