టైటిల్: అష్టదిగ్భంధనం
నటీనటుటు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల తదితరులు
నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్
దర్శకత్వం: బాబా పి.ఆర్
సంగీతం:జాక్సన్ విజయన్
సినిమాటోగ్రఫీ:బాబు కొల్లబత్తుల
ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి బొంతల
విడుదల తేది: సెప్టెంబర్ 22, 2023
థ్రిల్లర్ కథలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలను ఇష్టపడతారు. వరుస ట్విస్టులతో కథనం ఆసక్తికరంగా సాగితే చాలు ఆ సినిమాని హిట్ చేస్తారు. అందుకే కొత్త దర్శకులు థ్రిల్లర్ జానర్‌లో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతారు. యువ దర్శకుడు బాబా పీ.ఆర్ కూడా ఈ సారి థ్రిల్లర్ చిత్రం ‘అష్ట దిగ్భంధనం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘సైదులు’ సినిమాతో డైరెక్టర్‌గా మారిన బాబా పీ.ఆర్ తెరకెక్కించిన రెండో చిత్రమిది. సూర్య భరత్ చంద్ర , విషిక కోట హీరో హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(సెప్టెంబర్ 22) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ప్రజా సంక్షేమ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు అలియాస్ రాములన్న దగ్గర రౌడీ షీటర్లు శంకర్, నర్సింగ్‌ల పని చేస్తుంటారు. రాబోతున్న ఎన్నికల్లో పార్టీ తరపున ఎమ్మెల్యేగా నర్సింగ్ పోటీ చేస్తాడని రాములన్న ప్రకటిస్తాడు. తోటి రౌడీ షీటర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో శంకర్ ఇగో దెబ్బతింటుంది. తాను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటాడు. ఆ విషయం రాములన్నతో చెప్పగా.. రూ. 50 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని చెబుతాడు. దీంతో శంకర్ డబ్బు కోసం బ్యాంకు దోపిడీ చేయాలనుకుంటాడు.
తన మనుషులతో కలిసి పక్కా ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? శంకర్ వేసిన స్కెచ్‌లో హీరో హీరోయిన్లు(సూర్య భరత్ చంద్ర, విషిక కోట)ఎలా ఇరుక్కున్నారు? గౌతమ్(సూర్య భరత్ చంద్ర) నేపథ్యం ఏంటి? ఎలక్షన్ ఫండ్ అని రాములన్న ఇచ్చిన రూ. 100 కోట్లను శంకర్ ఎక్కడ దాచాడు? ఆ డబ్బును ఎవరు, ఎలా కొట్టేశారు? అసలు ‘అష్టదిగ్భంధనం’ ప్లాన్ వేసిందెవరు? చివరకు రూ. 150 కోట్లు ఎవరికి దక్కాయి? అనేది తెలియాలంటే థియేటర్లో అష్టదిగ్భంధనం సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
‘యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది.. ఈ యుద్ధం రాజ్యం కోసమే, రాణి కోసమో, అధికార కోసమో కాదు.. అహం కోసం. అహంతో మొదలైన యుద్ధం .. ఆ అహం దేహాన్ని వీడినప్పుడు ముగుస్తుంది’ ట్రైలర్‌లో చెప్పిన ఈ ఒక్క డైలాగ్ చాలు అష్ట దిగ్భందనం కథ ఏంటి? ఎలా ముగుస్తుంది అని చెప్పడానికి. దర్శకుడు బాబా పి.ఆర్ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌ని కథగా మలచుకున్నాడు.
ఇగోతో ఓ వ్యక్తి చేసే పని ఎక్కడికి దారి తీస్తుంది? అనేది ఈ సినిమాలో చూపించాడు. ఫస్టాఫ్‌లో కథ సాదా సీదా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మాత్రం మాత్రం వరుస ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని సిల్లీ సన్నివేశాలకు సెకండాఫ్‌లో ఆన్సర్ దొరుకుతుంది. వరుస ట్విస్టులు కథపై ఆసక్తిని పెంచుతుంది. కొన్ని చోట్ల లాజిక్కులు మిస్ అయినా.. ఓవరాల్‌గా సినిమా పర్వాలేదు. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
గౌతమ్ పాత్రలో నటించిన భరత్ చంద్ర యాక్టింగ్ బాగుంది.హీరోయిన్ విషిక తెరపై అందాలను ప్రదర్శిస్తూ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్వీస్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక శంకర్ పాత్రలో నటించిన వ్యక్తి విలనిజం బాగా పండించాడు. యాక్షన్ సీన్స్‌లో చక్కగా నటించాడు. రాములన్న పాత్రలో నటించిన వ్యక్తి తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. మిలిగిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. సంగీతం ఓకే. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.