Avatar 2: కొత్త వింతలు, విశేషాలతో అవతార్‌-2.. పండోరా ప్రపంచాన్ని చూశారా?

29 May, 2022 12:06 IST|Sakshi

చందమామ కావాలని మారాం చేసిన బిడ్డను తల్లి ఎలా సముదాయిస్తుంది? చందమామను అద్దంలో బంధించి.. ఆ అద్దాన్ని బిడ్డ చేతికిస్తుంది. ఇది అప్పటి తల్లుల చాతుర్యం. ఇప్పటి మల్టీటాస్కింగ్‌ మదర్స్‌కి ఆ ప్రెషర్‌ అవసరం లేదు. ఆ పని హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌  చేసిపెట్టాడు. అద్దంలో కాదు ఏకంగా వెండి తెర మీదే! ఒక్క చందమామ రూపాన్నే కాదు.. చందమామ మీదున్న ప్రపంచాన్నంతా తెచ్చిపెట్టాడు. అదే.. పండోరా లోకం. అవతార్‌కి సీక్వెల్‌.. అవతార్‌ –2! ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సందర్భంగా మనం కూడా ఓసారి ఆ లోకంలో విహరించొద్దాం. 

ఫ్యూచర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కే కథలన్నిట్లో పెద్ద పెద్ద భవంతులు.. వాటి చుట్టూ ఆధునిక సాంకేతిక వలయాలు.. గాల్లో తేలే వాహనాలు. ఎట్‌సెట్రా దర్శనమిస్తుంటాయి ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా.  కానీ, కామెరూన్‌ ఆ చట్రాన్ని ఛేదించాడు. ఆ ప్యాటర్న్‌ను మార్చేశాడు.  

2154 సంవత్సరంలో నడిచే అవతార్‌–2 కథలో.. భూమి ఎప్పటిలాగే ఉంటుంది. మనుషులు కూడా అట్లానే ఉంటారు. కానీ, డొల్లగా మారిన భూమి ఎనర్జీ కొరత తీర్చేందుకు.. ఇతర గ్రహాల మీద ఉన్న సహజ సంపదలపై కార్పొరేట్‌ కంపెనీల కన్నుపడుతుంది. అందులో భాగంగా అంతరిక్షంలో ఎక్కడో దూరంగా ఉన్న ‘పండోరా’ గురించి సైంటిస్టులకి తెలుస్తుంది. అదే అవతార్‌–2 కథకు వేదికైంది.

ఏలియన్స్‌  అనగానే.. కోడిగుడ్డు ఆకారంలో తల, మెరిసే కనుగుడ్లు, పొట్టికాళ్లతో ఉంటుందని ఊహించేసుకుంటారు చాలామంది. ఆ మూస ఆలోచనలు, ఊహలకు బ్రేక్‌ వేసి  మనిషి తరహా ఏలియన్లకు పురుడుపోశాడు క్రియేటివ్‌ జీనియస్‌ జేమ్స్‌ కామెరూన్‌ . పది అడుగుల ఎత్తుండే నీలంరంగు బక్కపల్చని ఏలియన్లు.. పొడవుగా ఉండే తోక, ఆ తోక వాళ్ల బ్రెయిన్‌కి ముడిపడి ఉండడం, ఆ తోక ద్వారానే అడవుల్లోని జంతువుల మెదళ్లను కంట్రోల్‌ చేయడం వంటి  ప్రత్యేకతలను పెట్టాడు ఆ ఏలియన్స్‌కి. అలాగే ఆ అత్యంత ఆధునిక సాంకేతికతో ఏ మాత్రం సంబంధంలేని, ప్రకృతిని నమ్ముకుని బతికే  అమాయకపు ఆదివాసీ జాతులుగా చూపించాడు.

అన్నింటినీ మించి నావి తెగ భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. మరి ఆ ఏలియన్ల చుట్టూ ఉండే జీవజాలం సంగతి ఏంటి? అందుకోసం బయాలజిస్టులతో స్టడీ చేయించి కొత్త జాతుల్ని సృష్టించాడు. విచిత్రమైన చెట్ల జాతులు, ఆరు కాళ్ల రైనోలు, భయంకరమైన థానోటర్‌ మృగాలు, రెక్కల గుర్రాలు, ఎగిరే డ్రాగాన్స్‌ లాంటి టోరక్‌లు.. మరి వీటి ఆవాసం? అందుకే ‘పండోరా’ను ఏర్పాటు చేశాడు. అవతార్‌లో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. చెట్లు, జంతువులతో సహా. హోమ్‌ ట్రీ, ట్రీ ఆఫ్‌ సోల్స్‌తో పాటు రకరకాల చెట్లు అవతార్‌కి ప్రత్యేక ఆకర్షణ. పండోరా మీద బతికే జీవుల్ని.. అక్కడి క్రూరమృగాలు నిబంధనలు పెట్టుకుని మరీ వేటాడుకుని తింటాయి.  కానీ, ఆఖరుకు మనుషుల దాడుల్లో నావి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న వేళ.. అడవి తల్లిని కాపాడుకునేందుకు ఆ క్రూరమృగాలే నావిల తరపున నిలబడి మనుషులతో పోరాడుతాయి. ఇప్పటికే అవతార్‌లో కనిపించిన ఈ అంశాలతో పాటు మరిన్ని కొత్త వింతలు, విశేషాలతో కనువిందు చేయబోతోంది అవతార్‌–2. 

పండోరా నిజంగానే ఉంది
శనిగ్రహం కక్ష్య లోపలి భాగంలో ఉన్న ఉపగ్రహాల్లో ‘శాటరన్‌ సెవెన్‌’ ఒకటి. ఇది సహజం ఉపగ్రహం. 1980లో వోయేజ–1 వ్యోమనౌక దీనిని గుర్తించి.. ఫొటోలు తీసి భూమ్మీదకి పంపింది. గ్రీకు పురాణాల ప్రకారం.. దీనికి ‘పండోరా’ అనే పేరు పెట్టారు. అయితే దీని  వాతావరణం ఎలాంటిది? జీవం.. జీవనం ఉందా? లేదా? అనే విషయంలోనే స్పష్టత లేదు.  ఈ ఉపగ్రహాన్ని ‘అవతార్‌’ కోసం వాడుకున్నారు. కామెరూన్‌  ప్రతిసృష్టిలో పండోరా నక్షత్ర వ్యవస్థలో ఆల్ఫా సెంచూరీన్‌ ఏ సిస్టమ్‌లో ఉంటుంది. భూమి నుంచి దీని దూరం 4.37 కాంతి సంవత్సరాలు.  ఇది కాంతివంతంగా ఉండే ఒక ఉపగ్రహం.  అందుకే దీనిని మరో చందమామ అంటారు.  కామెరూన్‌  కల్పిత ప్రపంచం స్ఫూర్తితో ఫ్లోరిడాలోని బే లేక్‌ దగ్గర ఉన్న వాల్ట్‌ డిస్నీ వరల్డ్‌ రిసార్ట్‌ ‘పండోరా ది వరల్డ్‌ ఆఫ్‌ అవతార్‌’ పేరుతో 2017లో 12 ఎకరాలున్న ఒక పార్క్‌ను ప్రారంభించింది. ఇంతలా ప్రభావం  చూపించింది కాబట్టే అవతార్‌ సీక్వెల్స్‌లో పండోరాను మరింత అందంగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు కామెరూన్‌. 
- భాస్కర్‌ శ్రీపతి 

మరిన్ని వార్తలు