James Cameron: ఆర్ఆర్ఆర్ సినిమా రెండుసార్లు చూశా: జేమ్స్ కామెరూన్

21 Jan, 2023 16:40 IST|Sakshi

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, హాలీవుడ్ దిగ్గజం, అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వారిద్దరు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో టాలీవుడ్‌ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు కామెరూన్. ఆర్ఆర్ఆర్‌ను రెండుసార్లు చూసినట్లు రాజమౌళితో చెప్పారు. దీంతో జక్కన్న వల్లే తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. 

కామెరూన్‌తో రాజమౌళి మాట్లాడుతూ.. మీ సినిమాలు టైటానిక్‌, టర్మినేటర్‌తో పాటు అవతార్‌-2 చూశానని తెలిపారు. మీరే నాకు ఆదర్శమని కామెరూన్‌ను కొనియాడారు. మీ ప్రశంసలు అవార్డ్ కంటే గొప్పవని రాజమౌళి అన్నారు. మీరు సినిమా చూశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని కామెరూన్‌తో ముచ్చటించారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మీరు అనలైజ్‌ చేయడం బాగుందన్నారు. 

దీనికి కామెరూన్ స్పందిస్తూ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. మీ సినిమా చూసినప్పుడు అద్భుతంగా అనిపించిందన్నారు. ఈ స్టోరీ తెరకెక్కించిన విధానం చాలా బాగుందన్నారు. సినిమాలోని ట్విస్టులు, స్నేహితుల పాత్రలు మలిచిన విధానం అద్భుతమని కొనియాడారు. అక్కడే ఉన్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సైతం ప్రశంసలతో ముంచెత్తారు. మీరు అందించిన మ్యూజిక్ అద్భుతమన్నారు.  

ఆర్ఆర్ఆర్ గతేడాది థియేటర్లలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్.. తాజాగా  ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు గెలుచుకున్న తర్వాత జేమ్స్ కామెరూన్ ఏకంగా రాజమౌళిని మెచ్చుకోవడం చిత్రబృందానికి దక్కిన మరో గౌరవంగా టాలీవుడ్ అభిమానులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు