Avatar: ‘అవతార్‌ 2’ చూడబోతున్నారా?.. అయితే ‘అవతార్‌’ స్టోరీపై ఓ లుక్కేయండి!

16 Dec, 2022 08:46 IST|Sakshi

ఎట్టకేలకు అవతార్‌ సినిమా సీక్వెల్‌ ‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్' థియేటర్స్‌లో వచ్చేసింది. భారత్‌లో నేడు(డిసెంబర్‌ 16) ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే లక్షలాది మంది ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకొని పండోరా ప్రపంచానికి చూడడానికి వెళ్లారు. అవతార్‌ 2009 డిసెంబర్‌ 18న విడుదలైంది. 13 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్‌ విడుదలైంది. పార్ట్‌ 2 చూసే ముందు.. ఒక్కసారి అవతార్‌ కథేంటో మరోసారి గుర్తు చేసుకుందాం.

ఈ చిత్రం కోసం పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించాడు జేమ్స్‌ కామెరూన్‌. ఆ గ్రహం మీద ‘నావి’ అనే తెగ జీవిస్తుంటుంది. అక్కడ ఉండే సహజవనరులపై మానవుల కన్ను పడుతుంది. అమెరికా సైన్యం అక్కడకు వెళ్లగా.. నావీ తెగ వారిని ఎదుర్కొంటుంది. దీంతో ఏలియన్‌ను పోలి ఉన్న నావీ తెగ మనుషులను తాము తయారు చేయలనుకుంటారు. నేటివ్స్‌ డీఎన్‌ఏతో  మానవ డీఎన్‌ఏను జోడించి,రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే అవతార్‌లను రెడీ చేస్తారు. అలాంటి అవతార్‌లలో జేక్‌ సల్లీ(సామ్‌ వర్తింగ్‌టన్‌) ఒకరు. మనిషిగా ఉన్నప్పుడు జేక్‌ సల్లీ నడవలేడు. నావికా దళంలో ఉన్నప్పుడు ఆయన ప్రమాదానికి గురై కాళ్లు పోగోట్టుకుంటాడు. అయితే అవతార్‌గా మారిన తర్వాత జేక్‌ సల్లీ పరుగెత్తగలగుతాడు.

పండోరా గ్రహంలో ఉన్న ఓ విలువైన చెట్టు రహస్యాన్ని చెబితే.. కాళ్లు వచ్చేలా చేస్తానని జేక్‌కు ఓ అధికారి ఆఫర్‌ ఇస్తాడు. దీంతో జేక్‌ ఆ గ్రహంపైకి వెళ్తాడు. అక్కడ క్రూర మృగాలు దాడి చేయడంతో జేక్‌ సల్లీతో వచ్చిన మిగిలిన సభ్యులంతా పారిపోతారు. ఆయన ఒక్కడే పండోరాలో ఉండిపోతాడు. ఇక చావడం ఖాయం అనుకున్న సమయంలో నావీ తెగకు చెందిన నేత్రి అతన్ని రక్షిస్తుంది. నావీతెగ పెట్టిన ఓ పరీక్షలో విజయం సాధించి జేక్ వారిలో ఒక సభ్యునిగా చేరిపోతాడు. వారిలో ఒకడిగా ఉండేందుకు శిక్షణ తీసుకునే క్రమంలో జేక్‌ సల్లీ నేత్రీతో ప్రేమలో పడిపోతాడు. నావీ తెగ మంచితనం చూసి వారికి రక్షణగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.

అయితే ఓ రోజు ఆర్‌డీఏ ఆఫీసర్లు పండోరా గ్రహంపై ఉన్న విలువైన చెట్టును తొలగించేందుకు ప్రయత్నిస్తారు. జేక్‌ వారిని అడ్డుకుంటారు. తాము తయారు చేసిన అవతార్‌..తమకే వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆర్‌డీఏ అధికారులు షాకవుతారు. తమను మోసం చేశాడని అతని శరీరంలోని అవతార్‌ను తొలగించే ప్రయత్నం చేస్తారు. తాను నావీ తెగతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లేలా చేస్తానని జేక్‌ పండోరా గ్రహం మీదకు వస్తాడు. జరిగిన విషయం చెప్పబోతుండగా..వారు వినిపించుకోరు. ప్రేమ పేరుతో మోసం చేశాడని నేత్రి భావిస్తుంది. ఒకవైపు జేక్‌ సల్లీ నావి తెగను ఒప్పించే ప్రయత్నం చేస్తుండగానే.. మరోవైపు ఆర్‌డీఏ అధికారులు పండోరాపై యుద్ధానికి వస్తారు.

ఈ క్రమంలో జేక్‌ సల్లీ నావీ తెగకు అండగా నిలబడతాడు. మానవులతో యుద్దం చేసి వారిని తిగిరి భూమ్మీదకు పంపిస్తాడు. అంతేకాదు తాను శాశ్వతంగా అవతార్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అవతార్‌ కథ ముగుస్తుంది. మానవులు, ఏలియన్‌ ల మధ్య యుద్దంతో పాటు అంతకు మించిన ప్రేమ కథను ‘అవతార్‌’లో చూపించాడు జేమ్స్‌ కామెరూన్‌. అవతార్‌ 2లో కూడా జేక్ సల్లీ, నేత్రి తమ ప్రపంచమైన పండోరాను కాపాడుకునే పోరాటం చేస్తారని తెలుస్తోంది. . అయితే ఇది నీటి అడుగున జరిగే కథ. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, అక్కడి మనుషుల అమోఘమైన సాహసాలతో అవతార్-2 అద్భుతంగా రూపొందించినట్లు టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమవుతంది.

మరిన్ని వార్తలు