అనుకోకుండా వచ్చిన అవకాశం.. 'అయాలీ'తో అలరిస్తోంది

12 Mar, 2023 16:26 IST|Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమై.. తర్వాత హీరో, హీరోయిన్‌ అయిన నటీనటులు చాలా మందే ఉన్నారు.  ఆ జాబితాలో అభి నక్షత్ర పేరు ముందు వరుసలో ఉంటుంది.  ‘అయాలీ’ వెబ్ సిరీస్‌లో తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించింది. 

తమిళనాడులోని రాజపాలాయం గ్రామంలో పుట్టి పెరిగిన అభి నక్షత్ర .. అసలు పేరు  అభినయ నక్షత్ర. ప్రశంసలు, అభిమాన గణం అభికి ఇప్పుడు కొత్తేం కాదు. స్కూల్లో ఉన్నప్పటి నుంచీ పరిచయమే. అమ్మాయి.. చదువుతోపాటు ఆటపాటల్లోనూ చురుకే. బడిలో జరిగే ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటూ తన ప్రతిభతో అందరినీ మెప్పించేది. అందరి ప్రశంసలు అందుకునేది.    

అలా అనుకోకుండా ఒకరోజు సినిమా అవకాశం అభిని పలకరించింది. ఇక సినిమా అనగానే ఆమె సరదా పడటంతో తల్లిదండ్రులూ కాదనలేకపోయారు. చదువుపై నుంచి దృష్టి మళ్లకూడదని.. షూటింగ్‌ నుంచి తిరిగొచ్చాక అభినయని స్కూలుకు పంపేవారు. ఆమె మొదటి సినిమా ‘అమ్మోరు తల్లి’ విడుదల వరకు అభి స్నేహితులకు తను సినిమాల్లో నటించిందన్న విషయం తెలియదట. 

‘అమ్మోరు తల్లి’(మూక్కుత్తి అమ్మన్) విజయం సాధించడం.. అందులోని తన అభినయ కళ అందరినీ ఆకట్టుకోవడంతో మరిన్ని సినిమా ఛాన్స్‌లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథాంశాలతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం  నిర్మించిన  ‘నవరస’ అనే ఆంథాలజీలోనూ అభినయ నటించింది.  ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘అయాలి’ సిరీస్‌లో లీడ్‌ రోల్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. 

డాక్టర్‌ అవాలన్నది నా చిన్నప్పటి కల.  కానీ, ఇప్పుడు ఇంజనీరింగ్‌ చదవాలనుకుంటున్నా. సినిమాలు చేస్తూనే చదువు కూడా పూర్తి చేస్తా! – అభి నక్షత్ర.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు