Sunita Shirole: ఆర్థిక సమస్యల్లో సల్మాన్‌ ఖాన్‌ సహ నటి..

18 Aug, 2021 19:39 IST|Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో 2015లో విడుదలైన చిత్రం బజరంగీ బాయిజాన్‌. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఓ సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీలో సల్మాన్‌తో కలిసి నటించిన ప్రముఖ నటి సునీత శిరోల్‌(85) అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సీనియర్‌ నటిని తాజాగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. 85 ఏళ్ల ఈ నటి కిడ్నీ ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సినిమాలతోపాటు టెలివిజన్‌లోనూ పనిచేసిన ఆమె ప్రస్తుతం బతకడమే కష్టంగా ఉందని, ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
చదవండి: Crazy Uncles: వివాదంలో శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’!

కాగా మూడు దశాబ్దాలుగా అటు బుల్లితెర, ఇటు వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్నారు సునీత శిరోల్‌. కోవిడ్‌ ముందు వరకు తాను పనిచేశానని, అయితే అనేక ఆరోగ్య సమస్యల కారణంగా ఇకపై సినీ పరిశ్రమలో తన పనిని కొనసాగించలేనని సునీత వెల్లడించారు. ప్రస్తుతం ముంబైలోని నటి నూపూర్ అలంకార్ ఇంట్లో సునీత నివసిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కరోనా వచ్చే ముందు వరకు నేను సినిమాలు, టీవీల్లో నటించానని, ఇప్పటి వరకు దాచుకున్న మొత్తాన్ని కోవిడ్‌ సమయంలో ఖర్చు చేశానన్నారు. దురదృష్టవశాత్తు, అదే సమయంలో తనకు మూత్రపిండాల ఇన్ఫెక్షన్,  తీవ్రమైన మోకాలి నొప్పితో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు. 
చదవండి: లవ్‌ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం

‘ఇదే కాకుండా రెండు ఆసుపత్రిలో పడిపోయాను. నా ఎడమకాలు విరిగింది. ఇకపై వంగలేను. గతంలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నాను. ఇంకా అనేక ఇతరర వ్యాధులతో కూడా పోరాడుతున్నాను. నేను ప్రస్తుతం ఒక ఫ్లాట్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేనందున వారికి మూడు నెలలగా అద్దె చెల్లించలేకపోయాను. ఆ సమయంలో నాకు సహాయం చేయడానికి సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. నాకు సాయపడటానికి నటి నూపుర్‌ అలంకర్‌ను పంపారు. వారికి నేను కృతజ్ఙురాలిని. తను నన్ను ముంబైలోని వాళ్ల ఇంటికి తీసుకువచ్చింది. నా కోసం ఒక నర్సును కూడా నియమించింది.’ అని వెల్లడించారు.
చదవండి: టక్‌ జగదీష్‌ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్‌

తనకున్న ఇతర ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ.. ‘నేను నా పనిని మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు డబ్బులు అవసరం. కానీ నా కాలు పరిస్థితి క్షీణిస్తోంది. నేను మళ్లీ నడవగలనో లేదో నాకు తెలియదు. నేను నా కాళ్లపై నేను నిలబడే వరకు నాకు ఆర్థిక సహాయం కావాలి. నా సంపాదనలో ఎక్కువగా నా భర్తతో కలిసి ఏర్పాటు చేసిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అయితే గిడ్డంగిలో మంటలు చెలరేగడంతో అన్నీ కోల్పోయాము. అతనూ 2003లో తుదిశ్వాస విడిచాడు. కష్ట సమయం కోసం డబ్బు ఆదా చేయలేనందుకు, ముంబైలో సొంత ఇల్లు లేనందుకు ఎంతో బాధపడుతున్నాను’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా సునీల్ శిరోల్.. బజరంగీ బాయిజాన్, షాపిట్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, మేడ్ ఇన్ చైనా, కిస్ దేస్ మే హాయ్ మేరా దిల్, శ్రీమతి కౌశిక్‌కి పాంచ్ బహుయిన్ వంటి అనేక సినిమాలతోపాటు టీవీ షోలలో పనిచేశారు.

మరిన్ని వార్తలు