గుండె తల్లడిల్లిపోతోంది తాతా: ఎన్టీఆర్‌ ఎమోషనల్‌

28 May, 2021 12:04 IST|Sakshi

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు బాలకృష్ణ. తండ్రి ప్రతిభను, కీర్తిని చాటిచెప్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారని వారి ప్రస్తావనే ప్రపంచాన్ని ప్రకంపింపజేస్తుందన్నాడు. వారి ఆలోచనలే అనంతమైన ఆనందాన్ని అనుభూతిలోకి తెస్తుందని చెప్పాడు. వారి విజయగాథలు వేరొక లోకంలోకి వెంట తీసుకెళ్తాయని, అలాంటి అరుదైన కోవకు చెందిన మహానుభావుడు మన తారకరాముడు అని నొక్కి చెప్పాడు.

"గల్లీల్లో తిరిగి పాలు పోసినవాడు ఢిల్లీకి దడ పుట్టించడం.. రంగులేసుకునేవాడు రాజ్యాలు ఏలటం.. గ్రీకు శిల్పంలాంటి రూపంతో పురాణ పాత్రల్లో జీవించడం.. అన్నా అన్నా అని ఆర్తిగా కోట్లమందితో పిలిపించుకోవడం.. తరాలు మారుతున్నా తరగని కీర్తిని ఆర్జించడం.. తోట రాముడిగా మొదలయ్యి కోట రాముడిగా ఎదగడం.. కలలోనే సాధ్యమయ్యే పనులను ఇలలో చేసి చూపించడం.. ఒక్క తారకరాముడికే చెల్లింది. ఆ చరిత్రకారుడు, యుగపురుషుడు నందమూరి తారకరాముని 98వ జయంతి రోజున వారి దివ్య స్మృతిలో అనుక్షణం స్మరిస్తూనే ఉంటాము' అని బాలయ్య రాసుకొచ్చాడు. ఇక తండ్రి జయంతిని పురస్కరించుకుని బాలకృష్ణ శ్రీరామ దండకం చదివాడు. 

మరోవైపు తాతకు తగ్గ మనవడుగా సినిమాల్లో రాణిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందన్నాడు. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, మా గుండెలను మరొక్కసారి తాకిపో తాతా అని రాసుకొచ్చాడు. ఎంతోమంది మనసులను హత్తుకుంటున్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చదవండి: ప్రముఖ తెలుగు యాంకర్‌పై సోనూసూద్‌ ప్రశంసలు.. కారణమిదే..

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే తెలుగువారికే గౌరవం: చిరంజీవి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు