కూరగాయలమ్ముతున్న ప్రముఖ డైరెక్టర్‌

28 Sep, 2020 14:22 IST|Sakshi

కూరగాయలు అమ్ముతున్న చిన్నారి పెళ్లి కూతురు డైరెక్టర్‌

కలర్స్‌ టీవీలో ప్రసారం అయిన ‘బాలికా వధు’ సీరియల్‌కి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఈ సీరియల్‌ మంచి జనాదరణ పొందింది. తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేర డబ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంత పేరు తెచ్చుకున్న సీరియల్‌ డైరక్టర్‌ ప్రస్తుతం ఓ తోపుడు బండి మీద కూరగాయలమ్ముకుంటున్నాడు. వినడానికి కాస్త బాధగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. కరోనా వైరస్‌ తెచ్చిన కష్టాలు ఇవి. వివరాలు.. బాలికా వధు సీరియల్‌ దర్శకుల్లో ఒకరైన రామ్‌ వ్రిక్ష గౌర్‌ ప్రస్తుతం అజంగఢ్‌ జిల్లాలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఓ సినిమా కోసం రెక్కి నిర్వహించడానికి నేను అంజగఢ్‌ వచ్చాను. ఇంతలో లాక్‌డౌన్‌ విధించారు. నేను తిరిగి వెళ్లలేకపోయాను. ఇక సినిమా కూడా ఆగిపోయింది. నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడానికి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయమే పడుతుందని తెలిపాడు. దాంతో నేను నా తండ్రి వ్యాపారాన్ని నిర్వహించాలనుకున్నాను. అందుకే ఇలా తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతున్నాను. దీని గురించి నేను సిగ్గుపడటం లేదు’ అన్నారు రామ్‌ వ్రిక్ష. (చదవండి: రాఖీలు అమ్ముకుంటున్న సీరియ‌ల్ న‌టి)

రామ్‌ వ్రిక్ష తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ‘2002లో నా స్నేహితుడు, రచయిత షహనాజ్‌ ఖాన్‌ సాయంతో ముంబై వెళ్లాను. తొలుత లైట్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాను. తర్వాత సీరియల్‌ ప్రొడక్షన్‌ శాఖలో పనికి కుదిరాను. అలా ఒక్కొ మెట్టు ఎక్కుతూ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయ్యాను. ఆ తర్వాత ‘బాలికా వధు’ సీరియల్‌కి ఎపిసోడ్‌ అండ్‌ యూనిట్‌ డైరెక్టర్‌గా పని చేశాను’ అని తెలిపారు. రామ్‌ వ్రిక్ష.. యశ్‌పాల్ శర్మ, మిలింద్ గునాజీ, రాజ్‌పాల్ యాదవ్, రణదీప్ హుడా, సునీల్ శెట్టి వంటి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కరోనా తగ్గిన తర్వాత అతడు ఓ భోజ్‌పురి చిత్రానికి, హిందీ చిత్రానికి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాక ముంబైలో తనకు సొంత ఇళ్లు ఉందని.. తప్పకుండా తిరిగి వెళ్తానని అప్పటివరకు తనకు చేతనైన కష్టం చేసి పొట్టపోసుకుంటానని తెలిపారు రామ్‌ వ్రిక్ష. 

మరిన్ని వార్తలు