Bandla Ganesh On Puri Jagannadh: కొడుకు ఫంక్షన్‌కు వచ్చే టైం లేదా.. పూరీపై బండ్ల గణేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

23 Jun, 2022 10:49 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు పూరీ​ జగన్నాథ్‌పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మందిని స్టార్‌ హీరోలుగా చేసిన పూరి జగన్నాథ్‌.. కన్నకొడుకు(ఆకాశ్‌ పూరీ) సినిమా ఫంక్షన్‌కి రాకపోవడం బాధగా ఉందన్నారు. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేశ్‌ పూరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓ సామెత ఉంటుంది.. దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదనే  పూరీని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది.ఎంతో మందిని స్టార్స్‌గా తయారు చేశాడు. డైలాగ్‌లు చెప్పడం రాని వాళ్లకి డైలాగ్‌లు నేర్పాడు. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు.

కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేదు. అదే నేనైతే నేను లండన్‌లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం.. నా భార్య కోసం.. నా పిల్లల కోసం.. మా అన్న(పూరి జగన్నాథ్‌) ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో.. ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయమాకు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సింది వాళ్లే. మనం సంపాదిస్తే ఆస్తులు వాళ్లకే.. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే.

ఆకాశ్‌ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్.. . ఎవర్నెవర్నో స్టార్లని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావ్.. ఇదెక్కడి న్యాయం అన్నా?.నువ్ నీ కొడుకుని స్టార్‌ని చేసినా చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు.. చోర్ బజార్ పెద్ద హిట్ అవుతుంది. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా రాస్కో.. నువ్ బ్యాంకాక్‌ పోయి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. అలా జరక్కపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆరోజు వచ్చినరోజు.. ఆకాశ్‌ నువ్ డేట్‌లు ఇవ్వొద్దని చెప్తా’ అని బండ్ల గణేశ్‌ చెప్పుకొచ్చాడు. 
 

మరిన్ని వార్తలు