వ్యూ టైమ్ – ‘బట్టల రామస్వామి బయోపిక్కు’

15 May, 2021 22:49 IST|Sakshi

చిత్రం: ‘బట్టల రామస్వామి బయోపిక్కు
తారాగణం: అల్తాఫ్ హసన్‌, శాంతీరావు, లావణ్యారెడ్డి, సాత్విక, భద్రం, ధన్ రాజ్
మాటలు - పాటలు: వాసుదేవమూర్తి శ్రీపతి;
కళ: ఉపేంద్రరెడ్డి;
కెమేరా: పి.ఎస్.కె. మణి;
ఎడిటింగ్ – వి.ఎఫ్.ఎక్స్: సాగర్ దాడి
నిర్మాతలు: వి. రామకృష్ణ వీరపనేని (‘మ్యాంగో’ రామ్), ఐ. సతీశ్ కుమార్
సంగీతం - దర్శకత్వం: రామ్ నారాయణ్
నిడివి: 137 నిమిషాలు
రిలీజ్: 2021 మే 14
ఓటీటీ వేదిక: జీ 5

ప్రతి మనిషికీ ఒక కథ ఉంటుంది. జీవితంలో ఏదో ఒక వ్యధ ఉంటుంది. కాకపోతే, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల మీద తప్ప సామాన్యుల జీవితాలు ఎవరికీ పెద్దగా పట్టవు. పట్టినా, తెరకెక్కవు. అవి ఎవరికి, ఏమంత ఆసక్తిగా ఉంటాయనేది వాళ్ళ లాజిక్. కానీ, రకరకాల ట్విస్టులున్న బట్టల రామస్వామి అనే ఓ సామాన్యుడి జీవితకథ అంటూ అతని జీవితాన్ని తెర కెక్కిస్తే? అలా దర్శక, రచయితలు అల్లుకున్న ఓ కాల్పనిక కథ – ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ఎప్పుడో వంశీ ‘లేడీస్ టైలర్’ సినిమా నాటి సీన్లతో, బిగువైన స్క్రిప్టు లేకుండా, సరదా అనుకొంటూ సరసం పాలు ఎక్కువైన సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇది చూసి తెలుసుకోవచ్చు. 

కథేమిటంటే..:  
రామస్వామి (అల్తాఫ్ హసన్)ది చిన్నప్పటి నుంచి ఒకటే మాట – తన ఇష్టదైవం శ్రీరాముడిలా ఏకపత్నీ వ్రతంతో ఉండాలి. అలాగే, చీరల వ్యాపారం చేయాలి. అలాంటి పల్లెటూరి రామస్వామి తండ్రిపోయిన క్షణంలోనే పూసలమ్మే జయప్రద (శాంతీరావు)తో ప్రేమలో పడతాడు. కులాలు వేరైనా, మిత్రుడు (కమెడియన్ భద్రం) సాయంతో పెళ్ళి చేసుకుంటాడు. భార్య సొమ్ముతో చీరల వ్యాపారమూ పెడతాడు. కానీ, అనుకోని పరిస్థితుల్లో భార్య మాట కాదనలేక, ఆమె పిచ్చి చెల్లెలు జయసుధ (లావణ్యారెడ్డి)నీ పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఓ గూడెంలో జరిగిన మోసంలో... ‘చీరలు కొనడానికి పిలిచిన పిల్లనే చెరిచాడు’ అనే చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. గూడెం పిల్ల సిరి (సాత్వికా జై)ని పెళ్ళి చేసుకుంటాడు. సవతుల మధ్య పోరాటం మొదలవుతుంది. ఇంటి గుట్టు రచ్చకెక్కుతుంది. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడిగా రామస్వామి ఎలాంటి చిక్కులను ఎదుర్కొన్నాడు, చివరకు ఏమైందన్నది మిగతా కథ. హీరో పాత్రకు పక్కనే అతని స్నేహితుడి సంసార గాథ ఓ సైడ్ ట్రాక్ గా సాగుతుంది. 

ఎలా చేశారంటే..:  
బట్టల రామస్వామి పాత్రలో అల్తాఫ్ హసన్ బాగున్నారు. సహజంగా నటించారు. థియేటర్ ఆర్ట్స్ లో పిహెచ్.డి. చేసి, సినిమా నటనలో పలువురికి శిక్షణనిచ్చిన అల్తాఫ్ ఈ సినిమాకు ఆయువుపట్టు. ఇక, అతను పెళ్ళాడిన ముగ్గురు స్త్రీలుగా పూసలమ్మే జయప్రదగా శాంతీ రావు, ఆమె చెల్లెలైన పిచ్చిపిల్ల జయసుధగా లావణ్యారెడ్డి, గూడెం అమ్మాయి సిరి పాత్రలో సాత్వికా జై కనిపిస్తారు. వాళ్ళు తమకిచ్చిన పాత్రలకు ఉన్నంతలో న్యాయం చేశారు. కథానాయకుడి ఫ్రెండ్ అయిన ఆర్.ఎం.పి. డాక్టర్ పాత్రలో భద్రం కాసేపు కామెడీ చేస్తారు. కైలాసం నుంచి వచ్చిన భృంగిని అంటూ కమెడియన్ ధన్ రాజ్ కాసేపు తెరపై దర్శనమిస్తారు. చాలామంది రంగస్థల నటులు ఈ సినిమాతో వెండితెరకెక్కారు. 

ఎలా తీశారంటే..: 
మనమొకటి అనుకుంటే దేవుడొకటి ఇస్తాడు. ఏది ఇచ్చినా జీవితాన్ని ఫిర్యాదులు లేకుండా హాయిగా సాగించాలనే కాన్సెప్టును బట్టల రామస్వామి కథ ద్వారా  చెప్పాలనుకున్నట్టున్నారు దర్శకుడు రామ్ నారాయణ్. తీసేవాడుండాలే కానీ... ప్రతి ఒక్కడి జీవితం ఓ బయోపిక్కు అని సినిమా ప్రారంభంలోనే ఓ పాత్రతో అనిపిస్తారు – దర్శక, రచయితలు. ఆ రకంగా తాము చూపించనున్న బట్టల రామస్వామి అనే వ్యక్తి తాలూకు జీవితానికి ఓ ప్రాతిపదిక వేస్తారు. అయితే, అనేక ట్విస్టులున్న రామస్వామి కథను తెరపై చూపించడంలోనే రకరకాల పిల్లిమొగ్గలు వేశారు. ఒకే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ముగ్గురిని పెళ్ళాడాల్సిన సందర్భం వస్తే – ఎలా ఉంటుందనే అంశాన్ని బయోపిక్కు అనే జనానికి తెలిసిన టైటిల్ తో బాగానే మార్కెట్ చేసుకున్నారు. అయితే, భార్యాభర్తలు  - వాళ్ళ మధ్య శారీరక సంబంధాల మీద కాస్తంత ఎక్కువగానే ఫోకస్ చేయడంతో... కథలో కాస్తంత శృంగారం పాలు హెచ్చింది. ‘ఒక రోజు నీళ్ళయితే తోడచ్చు... రెండు రోజుల నీళ్ళయితే తోడచ్చు... నెల రోజుల నీళ్ళు ఎలా తోడాలి’ (హీరోతో కమెడియన్ భద్రం) అంటూ సభ్యత దాటిన డైలాగులూ పెట్టారు. 

ఒకరికి ముగ్గురిని పెళ్ళాడిన ఈ కథానాయకుడి కథ... ఒకేసారి ముగ్గురితో సంసారం లాంటి ఎడల్ట్ కామెడీ సీన్లతో కొంతసేపయ్యాక పిల్లలతో సహా ఇంట్లో అందరితో కలసి చూడడం కొద్దిగా ఇబ్బందే. రెండో పెళ్ళి తరువాత నుంచి కథలో, కథనంలో పట్టుసడలింది. స్లో నేరేషన్ సరేసరి. దానికి తోడు నిజాయతీగా చెప్పాల్సిన కథలో కొంత అనవసరమైన సినిమాటిక్ అంశాలు కూడా జొప్పించారు. గూడెంలో హీరో మూడో పెళ్ళిలో జానపద గీతంలా ‘లాయి లాయి లబ్జనకా...’ అంటూ ఐటమ్ సాంగ్ లాంటి పాట, డ్యాన్సు పెట్టడం అందుకు ఓ ఉదాహరణ. పెళ్ళికీ, శోభనానికీ కూడా తుపాకీలతో అడవిలో అన్నల సందడి ఓ ఫార్సు. ఒకరకంగా అది కొందరి ఉద్యమ సిద్ధాంతాలను పలచన చేసిన చూపిన అతి సినిమాటిక్ కల్పన. 

అలాగే, ఆర్.ఎం.పి. డాక్టర్ (కమెడియన్ భద్రం) కాస్తా అనార్కలీ బాబాగా అవతారమెత్తే ట్రాక్ ఓ పిట్టకథ. అది కూడా అసలు కథకు అనుకోని అడ్డంకే. ఇలాంటివి సహజంగానే ప్రధాన కథనూ, పట్టుగా సాగాల్సిన కథనాన్నీ పలచనచేస్తాయి. అందుకే, ఒకరకంగా మంచి టేకాఫ్ తీసుకున్న ‘బట్టల రామస్వామి బయోపిక్కు’... కాసేపయ్యాక క్రమంగా జావ కారిపోయింది. ఆ లోటుపాట్లు లేకుండా చూసుకొని, అనవసరపు హాస్యం కోసం పాకులాడకుండా ఉంటే బాగుండేదనీ అనిపిస్తుంది. ఒక దశ దాటాక సినిమా బోరనిపించడానికీ అదే కారణం. 

ఫీల్ గుడ్ సినిమా అన్నట్టుగా మొదలై... ఎడల్ట్ కామెడీ లోగి జారి... చివరకు పాప్ సాంగ్ తరహా మేకింగ్ వీడియోతో ముగిసిపోయే ఈ సినిమా ఏ ఫీల్ నూ మిగల్చదు. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగున్నాయి. దర్శకుడు రామ్ నారాయణే సంగీత దర్శకత్వం, ఒకటి రెండు పాటల్లో గానం కూడా చేశారు. సినిమా మొదట్లో వచ్చే ‘ఏలోరి ఏలిక...’, అలాగే సినిమా చివరలో వచ్చే ‘సామీ సంద్రంలో దూకరా నీకు ఈతొస్తే బతుకుతావురా... సంసారంలో దూకితే నువ్వు చేపవైన ఈదలేవురా’ అనే రెండు పాటలు తాత్త్విక ధోరణిలో కొంత బాగున్నాయి. అపరిచిత ముఖాలతో తీసిన ఈ చిన్న సినిమాను సరసం మీద ఆధారపడకుండా, సరైన కథ, కథనంతో ఫీల్ గుడ్ సినిమాగా తీర్చిదిద్ది ఉంటే వేరేలే ఉండేదేమో! భావోద్వేగాలూ ఉండి ఉంటే, ఈ బట్టల రామస్వామి జీవితం ప్రేక్షకుల మనసుకు మరింత హత్తుకొనేదేమో! 
 
బలాలు 
టైటిల్ పాత్రధారి సహజ నటన, కామిక్ టైమింగ్ 
కొన్ని సరదా సన్నివేశాలు, కొన్ని చోట్ల డైలాగులు
తత్త్వం చెప్పే రెండు పాటలు, 
సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం

బలహీనతలు 
అనవసర సినిమాటిక్ అంశాలు 
స్లో నేరేషన్, సెకండాఫ్
కొన్నిచోట్ల పరిమితి దాటిన అసభ్యత
మనసుకు పట్టే ఎమోషన్స్ లేకపోవడం

కొసమెరుపు:  దశ – దిశ తప్పిన ఎడల్ట్ కామెడీ ‘భయో’పిక్కు!
-  రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు