బెల్లంకొండ గణేష్‌ కంటే బాల మురళీగానే తృప్తి కలిగింది : హీరో

8 Oct, 2022 10:18 IST|Sakshi

బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్‌ కె. కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజైంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో బెల్లంకొండ గణేష్‌ మాట్లాడుతూ – ‘‘తెరపై గణేష్‌ కాదు.. బాలమురళీయే (సినిమాలో గణేష్‌ పాత్ర) కనిపిస్తున్నాడన్నప్పుడు నటుడిగా ఓ పది మార్కులు సాధించాననే తృప్తి కలిగింది.

ఈ కథను నా దగ్గరకు తీసుకు వచ్చి, నా నుంచి నటనను రాబట్టుకున్న లక్ష్మణ్‌కు థ్యాంక్స్‌. ఈ కథను ఎక్కువగా నమ్మి, నిర్మించిన నాగవంశీగారికి రుణపడి ఉంటాను’’ అని అన్నారు. ‘‘ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వారు ఏ విధంగా స్పందిస్తారు? అనే అంశం ఆధారంగా ఈ సినిమా చేశాం. కథ చెప్పగానే అంగీకరించిన గణేష్‌కు, కథను నమ్మి.. అదే నమ్మకాన్ని మా అందరిపై ఉంచిన నాగవంశీగారికి ధన్యవాదాలు’’ అన్నారు లక్ష్మణ్‌ కె. కృష్ణ.

‘‘స్వాతిముత్యం’ రిలీజ్‌కు ముందు చిరంజీవిగారు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు చిరంజీవిగారి ‘గాడ్‌ఫాదర్‌’, ‘స్వాతిముత్యం’ చిత్రాలు విజయాలు సాధించి నందుకు హ్యాపీగా ఉంది. ‘స్వాతిముత్యం’ సినిమాకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది’’ అన్నారు నాగవంశీ. దివ్య శ్రీపాద, సురేఖా వాణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు