Bellamkonda Sai Sreenivas: ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి లోనయ్యా.. ఏడాదిన్నర ఇంట్లోనే ఉన్నా..

6 May, 2023 14:53 IST|Sakshi

అల్లుడు శీను సినిమాతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఈ సినిమా హిట్‌ అయినప్పటికీ దాదాపు రెండేళ్ల తర్వాతే మళ్లీ వెండితెరపై కనిపించాడు. తెలుగులో అల్లుడు అదుర్స్‌ సినిమాలో చివరగా నటించిన బెల్లంకొండ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన ఛత్రపతి హిందీ రీమేక్‌ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హీరో.

'నా తండ్రి నిర్మాత కావడం వల్లే నేను సినిమాల్లోకి చాలా సులభంగా రాగలిగానని అందరూ అనుకుంటారు. అది నిజమే, కానీ నేను హార్డ్‌ వర్క్‌ చేయడం వల్లే ఇక్కడ ఉన్నాను. నా తొలి సినిమా అల్లుడు శీను బ్లాక్‌బస్టర్‌ హిట్‌. ఆ సినిమాకు నాన్న నిర్మాత. ఆయన ఎంతగానో సపోర్ట్‌ చేశారు. మరి నా తొలి సినిమాలో నటించేందుకు సమంత, తమన్నా ఎందుకు ఒప్పుకున్నారు? నేను వారికి 5 నిమిషాల డ్యాన్స్‌, 5 నిమిషాల యాక్టింగ్‌, 5 నిమిషాల యాక్షన్‌ వీడియోలన్నింటినీ కలిసి ఒక డెమో వీడియో క్రియేట్‌ చేసి వారికి పంపించాను.

అది చూసిన తర్వాతే వాళ్లు సినిమా ఓకే చేశారు. ఆ సినిమా సక్సెస్‌ అయింది. కానీ అప్పటికే మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నాన్న డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన 8 సినిమాలన్నీ నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ సమయంలో నాపై ఒత్తిడి పెరిగింది. ఫస్ట్‌ సినిమా హిట్‌ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి, కానీ తిరస్కరించాను. అలా ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చుండిపోయాను. ఆ తర్వాత తక్కువ బడ్జెట్‌లో రెండో సినిమా చేశాను.  బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేసిన జయ జానకీ నాయక చిత్రంతో అన్ని విధాలుగా నిలదొక్కుకున్నాను' అని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్‌.

చదవండి: ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోంది

మరిన్ని వార్తలు