గణేష్‌కు ఆ అదృష్టం దక్కింది

11 Oct, 2022 06:11 IST|Sakshi

– నిర్మాత బెల్లంకొండ సురేష్‌

‘‘నా చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా పరిచయమైన ‘స్వాతిముత్యం’తోనే ప్రేక్షకులు తనను నటుడిగా అంగీకరించడం నాకు హ్యాపీగా ఉంది. దర్శకుడు లక్ష్మణ్‌ను కూడా ప్రేక్షకులు అంగీకరించారు. తొలి సినిమాతోనే ప్రేక్షకాదరణ పొందాలంటే అదృష్టం ఉండాలి. అది ‘స్వాతిముత్యం’తో గణేష్‌కు దక్కడం హ్యాపీ’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్‌. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన  చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్‌ కె. కృష్ణ దర్శకత్వంలో  సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజైంది.

సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ– ‘‘స్వాతిముత్యం’ రిలీజైన తొలి రోజు, రెండో రోజు కలెక్షన్స్‌ చూసి భయపడ్డాం. కానీ మూడో రోజు నుంచి వసూళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు చిరంజీవిగారి ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఉన్నా ‘స్వాతిముత్యం’కూ ప్రేక్షకాదరణ లభించింది. ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌లో చిరంజీవిగారు ‘స్వాతిముత్యం’ సినిమాను కూడా ఆదరించాలని చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు. గణేష్‌ను హీరోగా లాంచ్‌ చేసిన నాగవంశీ, చినబాబులకు రుణపడి ఉంటాను.

ఓ నిర్మాతగా నేను కూడా ఇలాంటి లాంచింగ్‌ను గణేష్‌కు ఇచ్చి ఉండేవాడిని కాదేమో! ఇక బాలకృష్ణగారి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను రీ రిలీజ్‌ చేయడం వల్ల వచ్చిన ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలను బసవతారకం ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వనున్నాం. ఎన్టీఆర్‌గారి ‘ఆది’ సినిమాను కూడా రీ రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నాం. ఇక ‘జగదేకవీరుని కథ’ సినిమాను మళ్లీ తీయాలన్నది నాకున్న లక్ష్యాల్లో ఒకటి. ఎప్పటికైనా తీస్తా’’ అన్నారు. ‘‘తొలి సినిమాతోనే నటుడిగా నాకు ఇంత మంచి పేరు వస్తుందని ఊహించలేదు’’ అన్నారు గణేష్‌. ‘‘రిపీట్‌ ఆడియన్స్‌ ఉన్న చిత్రం ‘స్వాతిముత్యం’. నన్ను నమ్మి, ప్రోత్సహించిన నాగవంశీ, చినబాబు, బెల్లంకొండ గణేష్‌గార్లకు ధన్యవాదాలు. దర్శకుడిగా నా రెండో సినిమా కూడా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లోనే ఉంటుంది’’ అన్నారు లక్ష్మణ్‌ కె. కృష్ణ.  

మరిన్ని వార్తలు