Pratyusha Paul: 30 సార్లు బ్లాక్‌ చేశా, అయినా నీచమైన సందేశాలు..

11 Jul, 2021 20:49 IST|Sakshi

బెంగాలీ బుల్లితెర నటి ప్రత్యూష పాల్‌కు సైబర్‌ వేధింపులు ఎదురయ్యాయి. తనను అత్యాచారం చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. గత కొంతకాలంగా ఈ వేధింపులు తీవ్రతరం కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోల్‌కతా సైబర్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన గురించి ప్రత్యూష మాట్లాడుతూ.. "గతేడాది జూలై నుంచి ఈ వేధింపులు మొదలయ్యాయి. ఒక అనామక అకౌంట్‌ నుంచి నాకు అదే పనిగా అసభ్య సందేశాలు వచ్చాయి. అయితే ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదని మొదట్లో లైట్‌ తీసుకున్నా. కానీ రానురానూ ఆ ఖాతా నుంచి మితిమీరిన మెసేజ్‌లు వచ్చాయి. నాపై అత్యాచారం చేస్తానంటూ ఏకంగా నా మార్ఫింగ్‌ ఫొటోలు పంపాడు. అతడిని 30 సార్లు బ్లాక్‌ చేశాను. కానీ ఎప్పటిలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త అకౌంట్‌ తెరిచి మళ్లీ ఇలా నీచమైన బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో ఈసారి పోలీసులను ఆశ్రయించాను" అని నటి చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు