అక్కడ పార్టీకి వెళ్లింది నిజమే కానీ.. : తనీష్‌

13 Mar, 2021 10:12 IST|Sakshi

డ్రగ్స్‌ కేసులో హీరో తనీష్‌కు నోటీసులు

న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్న తనీష్‌

బెంగుళూరు : టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇటీవలె సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో విచారణకు రావాలంటూ హీరో తనీష్‌కు బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు జరిగే విచారణకు హాజరు కావాలంటూ తనిష్‌తో పాటు మరో ఐదుగురికి పోలీసులు సమన్లు జారీ చేశారు. వీరిలో ప్రముఖ నిర్మాత శంకర్‌ గౌడతో పాటు ఓ వ్యాపార వేత్త కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత శంకర్‌ గౌడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్న పలువురు సెలబట్రీలకు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు ధృవీకరించారు. తాజగా ఈ విషయంపై హీరో తనీష్‌ స్పందిచారు. తనకు బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని,  కానీ డ్రగ్స్‌ తీసుకున్నందుకు నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. 

2017లో బెంగుళూరులో నిర్మాత శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీకి తాను వెళ్లింది నిజమేనని, కానీ అక్కడ ఎటువంటి డ్రగ్స్‌ తీసుకోలేదని వివరించాడు. 67 ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద తనకు నోటీసులు వచ్చాయని, ఇది కేవలం ఆ కేసుకి సంబంధించి విట్నెస్‌గా మాత్రమే బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపాడు. విచారణకు హాజరు కావల్సిందిగా సమన్లు జారీ అయిన  నేపథ్యంలో ప్రస్తుతం తనీష్‌ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఈ కేసులో మొదట ఇద్దరు విదేశీయులను అరెస్ట్‌ చేసి విచారించగా మొత్తం వ్యవహారం బయటపడింది. ఇక గతంలోనూ టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనీష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు.

చదవండి : (శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కలకలం)
(రాగిణి, సంజనల ఫోన్ల గుట్టు వీడింది)

మరిన్ని వార్తలు