Oscar Awards 2023: ఐదుగురిలో ఆస్కార్ ఎవరికీ దక్కినా స్పెషలే.. ఎందుకో తెలుసా?

12 Mar, 2023 12:41 IST|Sakshi

ఆస్కార్ ఆ పేరు వింటేనే అదో గొప్ప. అవార్డ్ రాకపోయినా సరే.. కనీసం నామినేట్ అయినా ఆ ఫీలింగే వేరు. ప్రపంచ వేదికపై మన పేరు వినిపించాలని ఎవరికీ మాత్రం కోరిక ఉండదు. ఈ ఏడాది జరగునున్న 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి.  ఎందుకంటే ప్రతి కేటగిరీలో ఐదుగురు పోటీ పడుతున్నారు. కాగా.. ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్న ఐదుగురు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఈ ఐదుగురు తొలిసారి ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. దీంతో ఎవరినీ అవార్డ్ వరించినా అది తొలిసారి దక్కించుకున్న ఘనత వారికి సొంతమవుతుంది.. 

ఉత్తమ నటుడి రేసులో తొలిసారి పోటీలో నిలిచిన ఐదుగురు వీరే

ఆస్టిన్‌ రాబర్ట్‌ బట్లర్‌

అమెరికన్‌ సింగర్ ఎల్వీస్‌ ప్రెస్లీ జీవిత కథలో అద్భుతంగా నటించారు ఆస్టిన్‌ రాబర్ట్‌ బట్లర్‌. ఆయన నటనే 95వ ఆస్కార్‌ రేసులో నిలిచేలా చేసింది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును కూడా గెలుచుకున్నారు. బట్లర్‌ యుక్త వయస్సులోనే టెలివిజన్‌ ధారావాహికలు ‘ది క్యారీ డైరీస్‌’, ది షన్నారా క్రానికల్స్‌’ లో నటనకు పేరు సంపాదించారు. ఏలియన్స్‌ ఇన్‌ ది అట్టిక్‌(2009) చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చికాగో ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌లో మోస్ట్‌ ప్రామిసింగ్‌ పెర్ఫార్మర్‌ అవార్డును కైవసం చేసుకున్నారు. 

కోలిన్‌ జేమ్స్‌ ఫారెల్‌

ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌’ చిత్రంలో పాడ్రాయిక్‌ పాత్రతో నామినేషన్‌ దక్కించుకున్నారు కోలిన్‌ జేమ్స్‌ ఫారెల్‌(46).  ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. ఫారెల్‌ ది వార్‌ జోర్‌ సినిమాతో కెరీర్‌ మొదలెట్టిన కోలిన్ జేమ్స్  ‘టైగర్‌ ల్యాండ్‌, మైనారిటీ రిపోర్ట్‌ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు.  బ్లాక్‌ కామెడీ చిత్రం ఇన్‌ బ్రూగెస్‌లో ఆయన పాత్రకి ఉత్తమ నటుడిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్నారు.


బ్రెండన్‌ జేమ్స్‌ ఫ్రేజర్‌

కామెడీ సినిమాలతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు బ్రెండన్‌ జేమ్స్‌ ఫ్రేజర్‌. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి యుక్త వయస్సులో ఉన్న తన కూతురితో బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నించే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది వేల్‌’. ఈ చిత్రంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన ‘డాగ్‌ ఫైట్‌’, ‘ఎన్సినో మ్యాన్‌, స్కూల్‌ టైస్‌, జార్జ్‌ ఆఫ్‌ ది జంగిల్‌’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ‘ది వేల్‌’ చిత్రంలోని నటనకు ఫ్రేజర్‌ ఉత్తమ నటుడిగా 12 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 

చిన్న వయస్సులో పాల్‌ మెస్కల్‌

ఆస్కార్ ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ పొందిన అతి చిన్న వయస్సు కలిగిన నటుడు పాల్‌ మెస్కల్‌(27). ‘ఆఫ్టర్‌ సన్‌’ ఈ చిత్రంలో 11 ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నార్మల్‌ పీపుల్‌ అనే మినీ సిరీస్‌తో మెస్కల్ గుర్తింపు పొందారు.  బ్రిటీష్‌ అకాడమీ టెలివిజన్‌ అవార్డ్స్‌లో కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. 

అత్యధిక వయసులో బిల్‌ నైజీ

అత్యధిక వయసులోనూ ‘లివింగ్‌’ అనే చిత్ర నటుడు బిల్‌ నైజీ 73 ఏళ్ల వయసులో బరిలో నిలిచాడు.  ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్నారు. ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి పాత్రలో నటించి మెప్పించారు. ‘గిడియాన్స్‌ డాటర్‌ చిత్రానికి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్ దక్కింది. లవ్‌ యాక్చువల్లీ అనే చిత్రానికి బ్రిటీష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు.

మరిన్ని వార్తలు