మెహ్రీన్‌తో పెళ్లి క్యాన్సిల్‌, స్పందించిన భవ్య బిష్ణోయ్‌

4 Jul, 2021 20:22 IST|Sakshi

పంజాబీ ముద్దుగుమ్మ, హీరోయిన్‌ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హరియాణా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకుని అందరికి షాక్‌ ఇచ్చింది.  భవ్యతో తన ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నానని, ఇక నుంచి భవ్యతో కానీ అతడి కుటుంబ సభ్యలతో తనకు ఎలాంటి సంబంధం ఉండదని తన పోస్టులో స్పష్టం చేసింది. అయితే దీనికి కారణంగా మాత్రం మెహ్రీన్‌ వెల్లడించలేదు. అది తెలిసి ఆమె ఫాలోవర్స్‌, ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి గురైనా.. ఎదో పెద్ద కారణంగా వల్లే మెహ్రీన్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని తనకు మద్దుతుగా నిలుస్తారు. అంతేగాక సోషల్‌ మీడియాలో భవ్య బిష్ణోయ్‌, అతని కటుంబానికి వ్యతిరేకంగా  ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వారిని నిందిస్తు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కాస్తా భవ్య బిష్ణోయ్‌ కంటపడ్డాయి. వీటిపై అతడు స్పందిస్తూ.. తను, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డాడు. ‘పెళ్లి క్యాన్సిల్‌పై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలా అని  ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నాపై, నా కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇంతటితో అవి ఆపేయండి. ఎవరైతే తప్పుడు పోస్టులు పెడుతున్నారో వారందరి అకౌంట్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించాడు. కాగా గత మార్చి 13న హీరోయిన్‌ మెహ్రీన్‌, భవ్య బిష్ణోయ్‌ల నిశ్చితార్థం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ విల్లా ప్యాలెస్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య జరిగిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు