Bheemla Nayak Review: ‘భీమ్లా నాయక్‌’ మూవీ ఎలా ఉందంటే..?

25 Feb, 2022 14:10 IST|Sakshi

టైటిల్‌ : భీమ్లా నాయక్‌
నటీనటులు : పవన్‌ కల్యాణ్‌, రానా, నిత్యా మీనన్‌,సంయుక్త మీనన్‌, మురళీ శర్మ తదితరులు 
నిర్మాణ సంస్థ : సితార ఎంటర్టైన్మెంట్స్ 
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం :సాగర్‌ కె చంద్ర
సంగీతం : తమన్‌
సినిమాటోగ్రఫీ : రవి కె. చంద్రన్‌
ఎడిటర్‌: నవీన్‌ నూలి
విడుదల తేది : ఫిబ్రవరి 25, 2022

‘వకీల్‌ సాబ్‌’ మూవీ తర్వాత పవన్‌ కల్యాణ్‌ నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌’. మరో కీలక పాత్రలో యంగ్‌ హీరో రానా నటించారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే అందించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం.  

Bheemla Nayak Pawan Kalyan

భీమ్లా నాయక్‌ కథేంటంటే..?
భీమ్లా నాయక్‌(పవన్‌ కల్యాణ్‌).. కర్నూలు జిలా హఠకేశ్వర్‌ మండలం పోలీస్టేషన్‌లో నిజాయితిపరుడైన ఎస్సై. డేనియల్‌ శేఖర్‌ ఓ రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌. అతని తండ్రి(సముద్ర ఖని) వరంగల్‌  మాజీ ఎంపీ. రాజకీయ పలుకుబడి ఉన్న డేనియల్‌ శేఖర్‌ ఓ రోజు రాత్రి పీకల దాకా తాగి, అడవి గుండా వెళ్తూ మద్యం బాటిళ్లతో పోలీసులకు చిక్కుతాడు. ఈ సందర్భంగా డేనియల్‌కు, పోలీసుకు వాగ్వాదం జరుగుంది. పోలీసులపై దాడి చేసిన డేనియల్‌ను అక్కడే విధులు నిర్వహిస్తున్న భీమ్లా నాయక్‌ అరెస్ట్‌ చేస్తాడు. దీంతో డేనియల్‌ అహం దెబ్బతింటుంది. తనను అరెస్ట్‌ చేసిన భీమ్లా నాయక్‌ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావిస్తాడు. ఆయన చేసిన కుట్రలో భాగంగా భీమ్లా నాయక్‌ ఉద్యోగం పోతుంది. అంతేకాదు అతని భార్య సుగుణ(నిత్యా మీనన్‌) కూడా అరెస్ట్‌ కావాల్సి వస్తోంది. అసలు భీమ్లా నాయక్‌ ఉద్యోగం ఎందుకు పోయింది? తన ప్రతీకారం తీర్చుకునే క్రమంలో డేనియల్‌ శేఖర్‌ ఎలాంటి తప్పులు చేశాడు? సస్పెండ్‌ అయిన తర్వాత భీమ్లా నాయక్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అహంకారి అయిన మాజీ సైనికాధికారికి, ఆత్మ గౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన పోరులో ఎవరు విజయం సాధించారు? భీమ్లా నాయక్‌ నుంచి డేనియల్‌ శేఖర్‌ని ఆయన భార్య (సంయుక్త మీనన్‌)ఎలా రక్షించుకుంది? అనేదే మిగతా కథ.

Bheemla Nayak Movie Review In Telugu

ఎవరెలా చేశారంటే..?
నిజాయితీపరుడైన ఎస్సై భీమ్లా నాయక్‌ పాత్రలో పవన్‌ ఒదిగిపోయాడు. ఇక బాగా పొగరు ఉన్న రాజకీయ నేత, రిటైర్డ్‌ ఆర్మీ అధికారి డేనియల్‌ శేఖర్‌గా రానా అద్భుత నటనను కనబరిచాడు. రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తి ఏవిధంగా అయితే యాటిట్యూడ్‌ చూపిస్తాడో.. అచ్చం అలానే రానా తెరపై కనిపించాడు. ఈగో దెబ్బతింటే.. ఎంతకైనా తెగించే పాత్ర తనది. ప్రతి సీన్‌లో పవన్‌ కల్యాణ్‌తో పోటాపోటీగా నటించాడు. ఇక భీమ్లా నాయక్‌ భార్య సుగుణ పాత్రలో నిత్యా మీనన్‌ పరకాయ ప్రవేశం చేసింది. మాతృకతో పోలిస్తే.. ఇందులో సుగుణ పాత్రకు స్క్రీన్‌ స్పెస్‌ ఎక్కువ. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాలు కూడా ఆమె పాత్రకు అతికించారు. డేనియల్‌ శేకర్‌ భార్యగా సంయుక్త మీనన్‌ పర్వాలేదనిపించింది. సీఐ కోదండరాంగా మురళీ శర్మ, బార్‌ ఓనర్‌ నాగరాజుగా రావు రమేశ్‌, డేనియల్‌ శేఖర్‌ తండ్రి, మాజీ ఎంపీగా సముద్ర ఖని తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

Bheemla Nayak Review

ఎలా ఉందంటే..?
మలయాళం బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌’ రీమేక్‌ మూవీయే ‘భీమ్లా నాయక్‌’. ఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బ తింటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేదే ‘అయ్యప్పనుమ్‌ కొషియుమ్‌’మూవీ స్టోరీ. ఇదే కథను తీసుకొని, కొన్ని మార్పులు చేసి ‘భీమ్లా నాయక్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటిలో కొన్ని సినిమాకు అనుకూలంగా మారగా, కొన్ని ప్రతికూలంగా మారాయి. ముఖ్యంగా కొన్ని యాక్షన్స్‌ సీన్స్‌ అయితే అతిగా అనిపిస్తాయి. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ అతికించినట్లుగా అనిపిస్తుంది. మాతృకలో మాదిరే పవన్‌, రానా పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు.. వారి నేపథ్యాన్ని మాత్రం మరింత బలంగా చూపించారు. తండాకు సంబంధించిన సీన్స్‌, హీరో ప్లాష్‌బ్యాక్‌ సీన్స్‌..మాతృకలో ఉండవు.

Pawan Kalyan And Nithya Menon

రావు రమేశ్‌ కామెడీ పంచులు, నిత్యామీనన్‌ సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్‌ అంతా ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. భీమ్లా నాయక్‌ సస్పెండ్‌తో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో ఓరిజినల్‌ కథలో చాలా మార్పులు చేశారు. పవన్‌, రానాల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఇరువురి మధ్య వచ్చే డైలాగ్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. అదేసమయంలో కొన్ని యాక్షన్‌ సీన్స్‌లో డోస్‌ ఎక్కువైందనే ఫీలింగ్‌ కలుగుతోంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్‌ అయితే కాస్త సిల్లీగా అనిపించినా.. ట్విస్ట్‌ మాత్రం ఆకట్టుకుంటుంది. త్రివిక్రమ్‌ డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే బాగుంది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ సంగీతం. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. రవి కె. చంద్రన్‌ సినిమాటోగ్రఫి బాగుంది. అడవి అందాలను తెరపై చక్కగా చూపించాడు. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు