తిండి లేక భార్య చ‌నిపోయింది: మొగుల‌య్య‌ క‌న్నీటి క‌ష్టాలు

27 Jan, 2022 14:11 IST|Sakshi

మొగుల‌య్య‌.. 12 మెట్ల కిన్నెర‌ను వాయిస్తుంటే అంద‌రూ మైమ‌రచిపోవాల్సిందే.. ప్రాచీన సంగీత వాయిద్యం కిన్నెర‌నే బ‌తుకుదెరువుగా మ‌లుచుకున్న క‌ళాకారుడు మొగుల‌య్య‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌రించింది. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకోబోతున్న ఆయ‌న జీవితం పూల‌పాన్పు కాదు.. ముళ్ల దారి. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. జీవితంలో చ‌విచూసిన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు.

'నేను చాలా బీద‌వాడిని. వెయ్యి రూపాయ‌లు లేక నా భార్య చ‌నిపోయింది. ఆమెను హైద‌రాబాద్ తీసుకువ‌చ్చి నేను ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆమె బ‌స్టాండ్ల‌ల్ల డ‌బ్బులు అడుక్కుంటూ స‌రిగా తిండి లేక చివ‌రాఖ‌రికి చేనిపోయింది. ఆమె చ‌నిపోయాక కూడా శ‌వాన్ని ఊరు తీసుకెళ్లేందుకు రూపాయి గ‌తి లేదు. విష‌యం తెలుసుకుని కేవీ ర‌మ‌ణాచారి గారు 10 వేల రూపాయ‌లు ఇస్తే అప్పుడు బండి కిరాయి క‌ట్టుకుని ఇంటికి తీసుకెళ్లాను. స‌రిగా తిండి లేక‌ మూడేండ్ల కింద‌ట చ‌నిపోయింది. నాకు తొమ్మిది మంది పిల్ల‌లు. మొన్న మా కొడుకు గుండెలో నీరొచ్చింది. హైద‌రాబాద్ తీసుకెళ్ల‌మ‌న్నారు. కానీ రూ.500 లేక అత‌డు చ‌నిపోయాడు. నాకు ఇల్లు లేదు, ఆధారం లేదు. ఎక్క‌డికైనా వెళ్లాలంటే కూడా ఎవ‌రో ఒక‌రు డ‌బ్బులిచ్చి సాయం చేసేవారు. ఈ క‌ళ‌ను బ‌తికించాల‌న్న‌దే నా కోరిక‌' అని మొగుల‌య్య‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు