Bheeshma Sujatha: పిఠాపురం జమీందారు నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆస్తులు పోవడంతో తిరిగి..

27 Jan, 2023 17:03 IST|Sakshi

అరవై దశకంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార సుజాత. భీష్మ సినిమాలో మత్స్యకన్యగా నటించి అందరికీ దగ్గరైన ఆమె భీష్మ సుజాతగా స్థిరపడారు. నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం.. ఇలా ఎన్టీఆర్‌తో అనేక సినిమాలు చేశారు. నాగేశ్వరరావుతో ఒకే ఒక్క సినిమా 'మహాత్ముడు' చేసినప్పటికీ చివరకు తన పాత్రను ఎడిటింగ్‌లో తీసేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చారు.

'మాది తెనాలి. స్కూలు ఫంక్షన్‌లో నాటకాలు వేసేవాళ్లం. అమ్మానాన్న నన్ను బాగా ప్రోత్సహించేవారు. వాళ్ల ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చాను. ఇకపోతే అప్పట్లో నా పెళ్లి పెద్ద సంచలనం. పిఠాపురం జమీందారును పెళ్లి చేసుకున్నా. అప్పుడే పెళ్లెందుకమ్మా, తర్వాత ఫీలవుతావు అని శోభన్‌బాబు చెప్పినా నేను వినిపించుకోలేదు. పైగా పిఠాపురం జమీందారుకు అప్పటికే పెళ్లయింది. ఆయన మొదటి భార్య ఒప్పుకున్న తర్వాతే నేను అతడిని పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో నేను నిశ్చింతగా సినిమాలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ తర్వాత మాత్రం సినిమాలే వద్దన్నారు. మా ఆయన దానధర్మాలు ఎక్కువగా చేసే వారు. అలా ఉన్న ఆస్తంతా పోయింది. మిగిలిన కొన్ని ఆస్తులు కోర్టు ఆధీనంలోకి పోయాయి. ఆర్థిక స్థితి బాగోలేకపోవడంతో తిరిగి మళ్లీ సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కానీ ఈసారి డ్రామాలు, సినిమాలు, డబ్బింగ్‌లు, కోరస్‌లు.. ఇలా అన్నీ చేయాల్సి వచ్చింది' అని పేర్కొన్నారు భీష్మ సుజాత.

చదవండి: షారుక్‌ ఖాన్‌ పని అయిపోయిందంటూ ఆర్జీవీ ట్వీట్‌
ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం

మరిన్ని వార్తలు