తెరపైకి ఆమె డ్యాన్స్‌ కహానీ

4 Jul, 2021 00:25 IST|Sakshi

బాలీవుడ్‌ దివంగత ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ జీవితం వెండితెరపైకి రానుంది. సరోజ్‌ ఖాన్‌ బయోపిక్‌ను నిర్మించనున్నట్లు నిర్మాత భూషణ్‌ కుమార్‌ శనివారం వెల్లడించారు. సరోజ్‌ఖాన్‌ తొలి వర్ధంతి (జూలై 3) సందర్భంగా ఈ బయోపిక్‌ని ప్రకటించారు. ‘‘సరోజ్‌ఖాన్‌ తన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో హిందీ సినిమాలో ఓ విప్లవాన్నే తీసుకువచ్చారు. ఆమె కంపోజ్‌ చేసిన స్టెప్స్‌లో తమ అభిమాన తారల డ్యాన్స్‌ను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. సరోజ్‌ బయోపిక్‌కు ఆమె కుమారుడు రాజు ఖాన్, సుఖైనా ఖాన్‌ సహకరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత భూషణ్‌ కుమార్‌.

‘‘మా అమ్మగారి బాటలోనే నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. చిన్నతనం నుంచే అమ్మ ఎన్ని కష్టాలు పడి, ఇండస్ట్రీలో ఎంత ఉన్నత స్థానం సంపాదించిందో నాకు తెలుసు. అమ్మ బయోపిక్‌ తెరపైకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రాజు ఖాన్‌. ‘‘ఈ బయోపిక్‌లో అమ్మ వ్యక్తిగత జీవితానికి  సంబంధించిన విషయాలను కూడా చూపించనున్నాం’’ అన్నారు సుఖైనా ఖాన్‌. సరోజ్‌ ఖాన్‌ పాత్రను ఎవరు చేస్తారనేది త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు భూషణ్‌ కుమార్‌. దాదాపు 3 వేల పాటలకు పైగా కొరియోగ్రఫీ చేసిన సరోజ్‌ ఖాన్‌ మూడు సార్లు జాతీయ అవార్డు సాధించారు. 2020 జూలై 3న గుండెపోటుతో ఆమె మరణించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు