దేశీ లిక్కర్‌ తాగారా? అంటే.. అమితాబ్‌ రిప్లై ఇది!

16 May, 2022 15:25 IST|Sakshi

ముంబై: సెలబ్రిటీలకు విమర్శలు, ఇంటర్నెట్‌ ట్రోలింగ్‌ కొత్తేం కాదు. అయితే ట్రోలింగ్‌కు అంతే దీటుగా బదులివ్వడం బచ్చన్‌ ఫ్యామిలీ బ్లడ్‌లోనే ఉంది. తాజాగా సీనియర్‌ బచ్చన్‌కు సోషల్‌ మీడియాలో ఊహించని అనుభవం ఎదురైంది. ముసలోడు.. తాగుబోతు అంటూ నోటికొచ్చినట్లు ఆయన ఫేస్‌బుక్‌ వాల్‌పై కామెంట్లు చేశారు కొందరు. అయితే పెద్దాయన మాత్రం ఓపికగా ఆ విమర్శలకు చాలా చాలా హుందాగా కౌంటర్లు ఇస్తూ వెళ్లారు. 

విషయం ఏంటంటే.. రోజూలాగే ఆదివారం ఉదయం కూడా బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తన సోషల్‌ మీడియాలో(ఫేస్‌బుక్‌లో) గుడ్‌మార్నింగ్‌ పోస్ట్‌ చేశారు. కాకపోతే అది కాస్త ఆలస్యం అయ్యింది. ఉదయం 11.26కి ఆయన గుడ్‌ మార్నింగ్‌ పోస్ట్‌ పెట్టారు. ఇదే విమర్శలకు కారణమైంది. దీంతో చాలావరకు కామెంట్లకు అంతే ఓపికగా సమాధానం ఇస్తూ వెళ్లారు ఆయన.

బహుశా దేశీ లిక్కర్‌ తాగి ఉంటాడేమో అందుకే.. ఈ టైంకి గుడ్‌ మార్నింగ్‌ పెట్టాడంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దీనికి అమితాబ్‌ స్పందిస్తూ.. తాను అసలు తాగనని చెబుతూ.. తన తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ రాసిన మధుశాలలోని ఓ లైన్‌ పోస్ట్‌ చేశారు.  

మరి ఈ టైంలో గుడ్‌ మార్నింగ్‌ఏంటని మరో వ్యక్తి ప్రశ్నించగా.. లేట్‌ నైట్‌ షూటింగ్‌తో ఆలస్యం అయ్యిందని, అది పూర్తయ్యే సరికి ఉదయం అయ్యిందని, ఆలస్యంగా లేచినందుకే పోస్ట్‌ చేశానంటూ బదులిచ్చారాయన. ఇక అగౌరవంగా కామెంట్లు చేసిన వాళ్లకు సైతం  అంతే ఘాటుగా బదులిచ్చారు. 

‘ఇది మధ్యాహ్నాం రా ముసలోడా..’ అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘‘దీర్ఘకాలం నువ్వు జీవించాలంటూ ఆశీర్వదించిన అమితాబ్‌.. నిన్ను మాత్రం ఎవరూ ముసలోడా అంటూ పిలిచి అవమానించకూడదంటూ కోరుకుంటున్నట్లు’’ కౌంటర్‌ ఇచ్చారు బిగ్‌ బీ. ఇలా ఎవరైతే తనపై సెటైర్లు వేసేందుకు ప్రయత్నించారో.. వాళ్లందరిపైనా ఆయన తన వాక్‌ చాతుర్యం ప్రదర్శించారు. 

విలువలేని సూపర్‌స్టార్‌ అంటూ ఓ వ్యక్తి కామెంట్‌ చేయగా.. పని వల్ల లేచేసరికి ఆలస్యం అయ్యింది ‘విలువైన మనిషి’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఇలా.. చాలావరకు ఓపికగా ట్రోలింగ్‌కు కౌంటర్లు వేస్తూ వెళ్లారు 79 ఏళ్ల అమితాబ్‌ బచ్చన్‌. ప్రస్తుతం ఆయన రణ్‌బీర్‌ కపూర్‌-అలియాభట్‌ ‘బ్రహ్మస్త్ర’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: తండ్రి అమిర్‌ ఖాన్‌ ముందే బికినీలో కేక్‌ కటింగ్‌.. ట్రోలింగ్‌పై కౌంటర్‌

మరిన్ని వార్తలు