సోహైల్‌, దివికి చిరు బంపర్‌ ఆఫర్‌!

21 Dec, 2020 09:16 IST|Sakshi

తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఆదివారంతో ముగిసింది. షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల తలరాతని మార్చేసింది. ముఖ్యంగా విన్నర్‌ అభిజిత్‌, రన్నరప్‌ అఖిల్‌, రెండో రన్నరప్‌ సోహైల్‌ ఎక్కువగా లాభపడ్డారు. అభిజిత్‌ రూ.25 లక్షలు గెలుచుకోగా.. సోహైల్‌ బిగ్‌బాస్‌ ఇచ్చిన రూ.25 లక్షల ఆఫర్‌ తీసుకుని తుది పోరు నుంచి తప్పుకున్నాడు. తనకు వచ్చే రూ.25 లక్షల్లో 5 లక్షలు అనాథ శరణాలయానికి, మరో 5 లక్షలు తన స్నేహితుడు మెహబూబ్‌కు ఇస్తానని చెప్పడంతో అతను అభిమానులు, హోస్ట్‌ నాగార్జున మనసులూ దోచుకున్నాడు.

దాంతో సోహైల్‌ దాతృత్వం తెలుసుకున్న నాగార్జున.. అతను అనాథ శరణాలయానికి, మెహబూబ్‌కు ఇద్దామనుకున్న మొత్తాన్ని తాను అందిస్తానని హామినిచ్చారు. ఇక విన్నర్‌ని ప్రకటించేందుకు వచ్చిన చీఫ్‌ గెస్ట్‌ మెగాస్టార్‌ చిరంజీవి సోహైల్‌ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున స్ఫూర్తితో తాను కూడా మెహబూబ్‌కు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆమేరకు చెక్కు కూడా వెంటనే అందించారు. దాంతో మెహబూబ్‌ కళ్లనీరు పెట్టుకుంటూ చిరుకు పాదాభివందనం చేశాడు. కళాకారులు కన్నీరు పెట్టొద్దని చిరు వ్యాఖ్యానించారు. 
(చదవండి: బిగ్‌బాస్‌ తీరుపై అభిమానుల ఆగ్రహం)

స్వయంగా బిర్యానీ
సోహైల్‌ మేనరిజం.. ‘కథ వేరే ఉంటది’  తన సినిమాల్లో వాడుకుంటానని చిరు చెప్పుకొచ్చారు. తన సతీమణి సురేఖ సోహైల్‌ కోసం ప్రత్యేకంగా మటన్‌ బిర్యానీ చేసి పంపించారని చెప్పారు. దాంతో సోహైల్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్‌ ఫ్యామిలీ నుంచి తనకు ఇంత మద్దతు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని అతను కంటతడి పెట్టాడు. అలాగే, చిరంజీవి ఎదుట తన మనసులో మాటను సోహైల్‌ బయటపెట్టాడు. ఎప్పటికైనా తానొక మంచి సినిమా చేస్తానని, ఆ సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ లేక ఆడియో ఫంక్షన్‌కి చిరు సర్‌ రావాలని కోరాడు. అతని అభ్యర్థనపై స్పందించిన చిరు తప్పకుండా.. సోహైల్‌ రెక్వెస్ట్‌ను గౌరవిస్తానని చెప్పారు. కుదిరితే అతని సినిమాలో తనకూ ఓ చిన్న క్యారెక్టర్‌ ఇవ్వాలని అన్నారు. మెగాస్టార్‌ నుంచి ఊహించని ఆఫర్‌తో సోహైల్‌ మరింత ఉప్పొంగిపోయాడు.
(చదవండి: బిగ్‌బాస్‌: ప‌ది ల‌క్ష‌లు వ‌దిలేసుకున్న అరియానా)


దివికి చిరు బంపర్‌ ఆఫర్‌
బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ దివి వైద్యకు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. దివితో స్టెప్పులు వేయాలని ఉందని అన్నారు. మరో ఐదారు నెలల్లో మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న తన సినిమాలో దివికి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఇవ్వనున్నట్టు చిరు ప్రకటించారు. కాగా, తమిళ్‌లో అజిత్‌ హీరోగా సూపర్‌హిట్‌గా నిలిచిన ‘వేలాయుధం’ సినిమాను తెలుగులో రిమేక్‌ చేయనున్నారు. చిరు హీరోగా మెహర్‌ రమేష్‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇదిలాఉండగా.. రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌కు కూడా బిగ్‌బాస్‌ కొంత మొత్తాన్ని ఇస్తాడని తెలిసింది. హౌజ్‌ నుంచి బయటికొచ్చిన కంటెస్టెంట్లు గంగవ్వకు హోస్ట్‌ నాగార్జున ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. బిగ్‌బాస్‌ పాపులారిటీతో చాలామంది కంటెస్టెంట్లు యూట్యూబ్‌ చానెల్స్‌ పెట్టి లక్షలాది వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు.
(చదవండి: బిగ్‌బాస్‌: రూ.25 లక్షలకు సోహైల్‌ టెంప్ట్)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు