బిగ్‌బాస్‌కు నో ఆప్ష‌న్‌: మోనాల్‌ను పంపించాల్సిందే

23 Oct, 2020 18:47 IST|Sakshi

బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో మాత్ర‌మే కాదు ప్రేక్ష‌కుల ఓట్ల‌తో కూడా ఆట‌లాడుతున్నాడు. అత్య‌ధికంగా ఓట్లు వేస్తున్న కంటెస్టెంట్ల‌ను కాద‌ని త‌మ‌కు న‌చ్చిన‌వారిని ఎలిమినేట్ చేస్తున్నాడ‌ని చాలామంది వీక్ష‌కులు బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌పై గుర్రుగా ఉన్నారు. దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, కుమార్ సాయిని కావాల‌నే పంపిచేశార‌ని ఇప్ప‌టికే ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. ఈ క్ర‌మంలో ఏడో వారం ముగింపుకు వ‌చ్చింది. మ‌ళ్లీ ఒక కంటెస్టెంటు బిగ్‌బాస్ గ‌డ‌ప దాటాల్సిన స‌మ‌యం ఆసన్న‌మైంది. అయితే ఈసారికైనా త‌క్కువ ఓట్లు వ‌చ్చిన‌వారినే పంపించేస్తారా?  లేదా వారిని కాపాడుకునేందుకు మిగ‌తావాళ్ల‌ను బ‌లి చేస్తారా? అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి.

అభిజిత్ క‌న్నా అవినాష్‌కు ఎక్కువ ఓట్లు
ఇక ఈ వారం మోనాల్‌, అవినాష్‌, అభిజిత్‌, దివి, అరియానా, నోయ‌ల్ నామినేష‌న్‌లో ఉన్నారు. ఎప్ప‌టిలాగే అభిజిత్‌కు ఎక్కువ ఓట్లు రావ‌డంతో అత‌డు సేఫ్ అయ్యాడు. కానీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌కు అభి క‌న్నా ఎక్కువ ఓట్లు కుర‌వ‌డం విశేషం. అవినాష్‌ అంద‌రితో క‌లిసిపోతూనే 100 శాతం ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు. ఎవ‌రితోనూ పెద్ద‌గా గొడ‌వ‌లు లేకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నాడు. నోయ‌ల్‌కు ఆల్‌రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌టంతో ఎలిమినేష‌న్ నుంచి గ‌ట్టెక్క‌నున్నాడు. ఇక అరియానా ఆట తీరుతో త‌న‌ గ్రాఫ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అంద‌రూ చ‌ప్ప‌ట్లు కొట్టి మెచ్చుకునేవాళ్లే త‌ప్ప ఓట్లు వేసి మ‌ద్ద‌తు ఇచ్చేవాళ్లే క‌రువ‌య్యారు. అయినా స‌రే త‌న టాలెంట్‌తో అభిమానుల‌ను కూడ‌గ‌ట్టుకుంటూ ప్ర‌తివారం త‌న‌కు వ‌చ్చే ఓట్ల సంఖ్య‌ను కాస్తో కూస్తో పెంచుకుంటూ పోతోంది. (కుమార్ స్క్రిప్ట్ వినేందుకు ఓకే చెప్పిన నాగ్‌)

మాస్ట‌ర్ అడుగుజాడ‌ల్లో దివి
ఇక‌ దివి నోరు విప్పిన‌రోజు ఆమె ఇంటిస‌భ్యుల గురించి ఒక్కోమాట చెప్తూ ఉంటే జ‌నాలు ఫిదా అయ్యారు. కానీ అంత‌లోనే ఆమె ఇత‌ర ఇంటిస‌భ్యుల‌పై నోరు జార‌డం, మాస్ట‌ర్ చాటు కంటెస్టెంటులా మారిపోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే దివి మాస్ట‌ర్ చేతిలో కీలుబొమ్మ‌గా మారిపోయింద‌ని ఆమె అభిమానులు సైతం అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈసారి ఆమెకు ప‌డే ఓట్ల సంఖ్య‌లో గండి ప‌డింది. మిగిలిన ఏకైక కంటెస్టెంటు మోనాల్‌.. నిజానికి గ‌త వార‌మే వెళ్లిపోవాల్సిన ఆమె వేట‌గాడి చేతిలో నుంచి త‌ప్పించుకున్న జింక‌పిల్ల‌లా హౌస్‌లోనే ఉండిపోయింది. (బిగ్‌బాస్‌: మామ స్థానంలో కోడ‌లు సామ్‌?)

మోనాల్‌ను కాపాడి కుమార్‌ను బ‌లి చేశారు
అంద‌రిక‌న్నా త‌క్కువ ఓట్లు వ‌చ్చినా స‌రే బిగ్‌బాస్ నిర్వాహ‌కులే కావాల‌ని ఆమెను కాపాడి అన‌వ‌స‌రంగా కుమార్‌ను బ‌లి చేశార‌ని చాలామంది ఆక్రోశం వెల్ల‌గ‌క్కారు. దీంతో ఈసారి సాధార‌ణ‌స్థాయిలో కూడా ఓట్లు రాల‌డం లేదు. పైగా అఖిల్ నామినేష‌న్‌లో లేన‌ప్పుడు అత‌ని ఓట్లైనా మోనాల్‌కు ప‌డ‌తాయ‌నుకున్నారు, కానీ అలా జ‌ర‌గ‌లేదు. చివ‌రి సారే ఆమెను కాపాడ‌టం కోసం అన్యాయంగా ఒక‌రు బ‌ల‌య్యార‌ని, ఈసారి అది జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఓట్ల‌లో సుమారు 70 శాతం మంది మోనాల్ ఎలిమినేట్ అవ్వాల‌ని కోరుకుంటున్నారు. (అరియానాతో డేట్‌కు వెళ్తా: అభిజిత్‌)

అలా చేస్తే షోకు అప్ర‌తిష్ట ఖాయం
ఇలా ఒక కంటెస్టెంటుపై ఇంత వ్య‌తిరేక‌త రావ‌డం ఈ సీజ‌న్‌లో ఇదే తొలిసారి. త‌ర్వాతి స్థానంలో దివి ఉన్న‌ప్ప‌టికీ వీరిద్ద‌రి మ‌ధ్య ఓటింగ్ వ్య‌త్యాసం 50 శాతానికి పైగా ఉంది. దీంతో మోనాల్‌ను కాద‌ని దివిని, లేదా ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్న అరియానా, నోయ‌ల్‌ల‌ను ఎలిమినేట్ చేయ‌డం బిగ్‌బాస్ యాజమాన్యానికి క‌త్తిమీద సాము వంటిది. మోనాల్‌ను కాకుండా ఏ ఒక్క‌రిని వెళ్ల‌గొట్టినా బిగ్‌బాస్ షో మ‌రింత అప్ర‌తిష్ట మూట‌గట్టుకోక త‌ప్ప‌దు. కాబ‌ట్టి వారి ద‌గ్గ‌ర ఉన్న ఒకే ఒక ఆప్ష‌న్‌. మోనాల్‌ను ఎలిమినేట్ చేయ‌డం లేదా నో ఎలిమినేష‌న్ ప్ర‌క‌టించి చేతులు దులుపుకోవ‌డం. మ‌రి బిగ్‌బాస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌నేది తెలియాలంటే సండేవ‌ర‌కు ఓపిక ప‌ట్టాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు