బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌కు నాగ్ హెచ్చ‌రిక‌

23 Nov, 2020 20:17 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభానికి ముందు నుంచే ఈ షోకు లీకుల బెడ‌ద ప్రారంభ‌మైంది. సీజ‌న్ ప్రీమియ‌ర్ ఎపిసోడ్‌కు ముందే ఎవ‌రెవ‌రు పాల్గొంటున్నారు? అన్న లిస్టు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. అలా మొద‌లైన లీకులు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది ఎవ‌రు? హౌస్‌లో ఏమేం టాస్కులు పెడుతున్నారు? ఎవ‌రు కెప్టెన్ అవుతారు?, నామినేష‌న్‌లోకి వ‌చ్చేది ఎవ‌రు? ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు? అంటూ ప్ర‌తి విష‌యాన్ని పూసగుచ్చిన‌ట్టుగా నెట్టింట్లో ట‌ముకు వేసి మ‌రీ చెప్తున్నారు. దీంతో ఎపిసోడ్ టెలికాస్ట్ అవ‌డానికి ఒక‌రోజు ముందే ఏం జ‌ర‌గ‌నుందనేది అంతా తెలిసిపోవ‌డంతో ప్రేక్ష‌కుల‌కు షోపై ఆస‌క్తి స‌న్న‌గిల్లుతోంది. ఎలాంటి మ‌జా లేకుండా షో చ‌ప్ప‌గా సాగుతోంది అయితే బ‌లంగా వేళ్లూనుకుపోయిన ఈ లీకుల బెడ‌ద‌ను నివారించ‌డం నిర్వాహ‌కుల‌కు అగ్నిప‌రీక్ష‌గా మారింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఏంటేంటి? అత‌డు టైటిల్ ఎగ‌రేసుకుపోతాడా?)

ఇదే విష‌యంలో నాగార్జున కూడా బిగ్‌బాస్ టీమ్‌పై మండిప‌డ్డార‌ట‌. సీక్రెట్ రూమ్‌, ఎలిమినేష‌న్ స‌హా అన్నీ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ‌డానికి ముందే లీక‌వ‌డం ప‌ట్ల అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌. ఇది ఇలాగే కొనసాగితే ఇక‌పై హోస్టింగ్ చేయ‌న‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటూ తాజాగా ఓ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. లీకుల‌కు చెక్ పెట్టేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే షో నుంచి త‌ప్పుకునేందుకు సైతం ఏమాత్రం వెన‌క‌డాన‌ని మ‌రీమ‌రీ చెప్పార‌ట‌‌. కాగా సీజ‌న్‌ను విజ‌య‌వంతంగా న‌డిపించ‌డంలో వ్యాఖ్యాత‌ల‌ది ప్ర‌త్యేక పాత్ర‌. అందులోనూ ఈ సీజ‌న్ మొద‌టి ఎపిసోడ్‌కు 18కి పైగా రేటింగ్ తీసుకొచ్చిన‌ నాగార్జున వంటి స్టార్ హీరోను వ‌దులుకోవ‌డానికి బిగ్‌బాస్ టీమ్ స‌సేమీరా అంగీక‌రించ‌దు. ఫ‌లితంగా ఆయ‌న చెప్పిన‌ట్టు లీకుల‌ను ఏరేసేందుకు బిగ్‌బాస్ టీమ్‌ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌దు. మ‌రి వారి ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృత‌మ‌వుతాయో? లేదో? చూడాలి. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: హారిక ఇమేజీ డ్యామేజీ కానుందా?)

మరిన్ని వార్తలు