బిగ్‌బాస్‌– 4 విజేత అభిజిత్‌

21 Dec, 2020 01:32 IST|Sakshi
అభిజిత్‌కు ట్రోఫీని  అందజేస్తున్న చిరంజీవి. చిత్రంలో నాగార్జున

బిగ్‌బాస్‌–4 విజేతగా ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఫేం నటుడు

చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న అభిజిత్‌

రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌.. నాగార్జున ఇచ్చిన

రూ.25 లక్షల ఆఫర్‌తో టాప్‌–3 నుంచి వైదొలగిన సోహెల్‌

వేడుకగా గ్రాండ్‌ ఫినాలే.. ప్రత్యేక ఆకర్షణగా మెహ్రీన్, లక్ష్మీరాయ్, ప్రణీత

సాక్షి, హైదరాబాద్‌: బుల్లితెర వీక్షకులను 106 రోజులపాటు అలరించిన ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌–4 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం ముగిసింది. స్టార్‌ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా వర్ధమాన నటుడు, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ చిత్రం ఫేమ్‌ అభిజిత్‌ నిలిచాడు. పరిణతి చెందిన వ్యక్తిత్వంతో పెద్ద సంఖ్యలో మహిళాభిమానుల్ని, బిగ్‌బాస్‌ ప్రశంసల్ని కూడా దక్కించుకున్న అభిజిత్‌ను విజయం వరించింది. గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో కూడా అభిజిత్‌దే గెలుపు అంటూ పలువురు చెప్పిన జోస్యం, అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితం ఉండడం విశేషం. గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్‌ బిగ్‌బాస్‌–4 ట్రోఫీ అందుకున్నాడు. అఖిల్‌ రన్నరప్‌గా నిలిచాడు. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొనగా వారిలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్‌ అవుతూ వచ్చారు. చివరకు అఖిల్, అభిజిత్, సోహైల్, హారిక, అరియానాలు టాప్‌–5 ఫైనల్‌ కంటెస్టెంట్స్‌గా మిగిలారు. అయితే చివరి ముగ్గురిలో వెళ్లిపోవడానికి ఇష్టపడిన వారు రూ. 25 లక్షలు తీసుకొని వెళ్లిపోవచ్చన్న వ్యాఖ్యాత నాగార్జున ఆఫర్‌ను సోహైల్‌ అంగీకరించడంతో అభిజిత్‌ ప్రైజ్‌ మనీలో సగానికి కోత పడింది.

అలరించిన ముగింపు.. 
బిగ్‌బాస్‌ సీజన్‌ 4 చివరి రోజున మెగాస్టార్‌ చిరంజీవి ఈ షో కంటెస్టెంట్స్‌తో సాగించిన ముచ్చట్లు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షోలో పాల్గొన్న పోటీదారులంతా ఫినాలే సందర్భంగా హాజరై తమ అనుభవాలు పంచుకున్నారు. మెగాస్టార్‌తో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. సోషల్‌ మీడియా స్టార్‌ మెహబూబ్‌కు చిరంజీవి ఆర్థిక సాయం అందించడంతో ఆహూతులు అంతా హర్షధ్వానాలు చేశారు. హీరోయిన్లు ప్రణీత, లక్ష్మీరాయ్, మెహ్రీన్, దర్శకుడు అనిల్‌ రావిపూడి గ్రాండ్‌ ఫినాలేలో పాల్గొని స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. సంగీత దర్శకుడు తమన్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్‌తో అలరించారు. గత బిగ్‌ బాస్‌ సీజన్‌–3కు 8 కోట్ల మంది ఓట్లు వేయగా 4వ సీజన్‌కు మొత్తం 15 కోట్ల 65 లక్షల ఓట్లు వచ్చాయని హోస్ట్‌ నాగార్జున చెప్పారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు