Bigg Boss Telugu 5: ప్లాన్‌ బెడిసికొట్టింది, రవికి కలిసొచ్చింది, ప్రియ గెలిచి చూపించింది!

7 Oct, 2021 23:41 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 33: ట్రాన్స్‌జెండర్‌ ప్రియాంక సింగ్‌కు జీవితంలోనే మర్చిపోలేని కానుకను అందించాడు బిగ్‌బాస్‌. ఆమె ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయాన్ని తండ్రి స్వాగతించిన వీడియోను ప్లే చేసి చూపించాడు. 'అబ్బాయైనా, అమ్మాయైనా సర్వం నువ్వే నాకు. నువ్వు అనుకుంది సాధించాకే ఇంటికి రావాలి. నువ్వు అమ్మాయిగా మారావని ఆదరించడం మానేస్తాం అని ఎప్పుడూ అనుకోకు' అంటూ తల్లిదండ్రులు మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె తెగ ఎమోషనల్‌ అయింది. ఆమెను మరింత సంతోషపెడుతూ బిగ్‌బాస్‌ ఆమెకు చీర, పూలు, గాజులు, స్వీట్లు పంపించాడు.

నాన్నను పట్టుకుని ఏడవాలనుంది: పింకీ
ఈ సందర్భంగా తను పడ్డ కష్టాలను గుక్కపెట్టి చెప్పుకుంటూ ఏడ్చేసింది పింకీ. పండగకు ఇంటికి వెళ్లినా కూడా దొంగచాటుగా వెళ్లేదాన్నని, అలాంటిది మా నాన్న నన్ను యాక్సెప్ట్‌ చేశాడంటే నమ్మలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకుంది. ఇక తను బిగ్‌బాస్‌ నుంచి ఏ వారం వెళ్లిపోయినా సరే, కానీ వెళ్లగానే నాన్నను పట్టుకుని గట్టిగా ఏడవాలనుందని మనసులోని మాటను బయటపెట్టింది. అనంతరం పింకీ అందంగా ముస్తాబవగా.. ఆమె యానీ మాస్టర్‌, సన్నీ, మానస్‌ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇంతలో హమీదా తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడవడంతో శ్రీరామ్‌ ఆమెను హత్తుకుని ఓదార్చాడు.

ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌
ఇక కంటెస్టెంట్లు ఏ రాజుకు సపోర్ట్‌ చేయాలన్న విషయంపై మల్లగుల్లాలు పడ్డారు. ఇంతలో బిగ్‌బాస్‌ ఫైనల్‌గా రాజుల దగ్గరున్న నాణాల సంఖ్యను వెల్లడించమని ఆదేశించాడు. సన్నీ దగ్గర 30, ఆయన రాజ్యంలోని మానస్‌ దగ్గర 240, షణ్ముఖ్‌ దగ్గర 220, జెస్సీ దగ్గర 209 నాణాలున్నాయి. రవి రాజు దగ్గర 50, అతడి రాజ్యంలోని యానీ మాస్టర్‌ దగ్గర 176, హమీదా దగ్గర 60, విశ్వ దగ్గర 10, శ్రీరామచంద్ర దగ్గర 52 నాణాలున్నాయని తెలిపారు. నాణాల లెక్కింపు తర్వాత బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు.

వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరు..
ఇప్పటికీ కంటెస్టెంట్లు వారి యువరాజుకు సపోర్ట్‌ ఉపసంహరించుకోవచ్చని, లేదా వేరే రాజుకు మద్దతు తెలపవచ్చని ఛాన్స్‌ ఇచ్చాడు. మొత్తంగా టాస్క్‌ ముగిసే సమయానికి రాకుమారుడు సన్నీ దగ్గర ఆరుగురు, రవి దగ్గర ఏడుగురు ప్రజలు ఉన్నట్లు కెప్టెన్‌ శ్రీరామ్‌ బిగ్‌బాస్‌కు విన్నవించాడు. దీంతో ఎక్కువ ప్రజలు కలిగి ఉన్నందున యువరాజు రవి నేరుగా కెప్టెన్సీకి పోటీపడతాడని ప్రకటించగా.. ఇంటిసభ్యులు అతడికి పట్టాభిషేకం జరిపించారు. అంతేకాకుండా ఓడిపోయిన రాకుమారుడితోపాటు అతడి ప్రజల ధనాన్ని స్వాధీనం చేసుకునే ప్రత్యేక అవకాశాన్ని రవికి కల్పించాడు బిగ్‌బాస్‌. దీంతో జెస్సీ, షణ్మఖ్‌, సిరి, కాజల్‌లు కష్టపడి దొంగిలిచిన నాణాలు కూడా రవి వశమయ్యాయి.

షణ్ముఖ్‌ను ప్రాధేయపడ్డ రవి.. అయినా పట్టించుకోలే
అయితే షణ్ముఖ్‌ సరిగా మాట్లాడట్లేదని తెగ ఫీలయ్యాడు రవి. మనసులోనుంచి మాట్లాడురా అని నోరు తెరిచి అడిగినప్పటికీ అతడు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇక రాజైన రవి.. ఆయన వెన్నంటే ఉండి రాజుగా గెలిపించిన ముగ్గురిని సమానంగా ధనాన్ని పంచి కెప్టెన్సీ పోటీదారులుగా ప్రకటించమని ఆదేశించాడు బిగ్‌బాస్‌. దీంతో రవి.. యానీ మాస్టర్‌, హమీదా, శ్వేతను పోటీదారులుగా పేర్కొన్నాడు. ఇంతలో బిగ్‌బాస్‌ మరో ట్విస్ట్‌ ఇచ్చాడు.

ప్రియ కోసం వెనక్కు తగ్గిన హమీదా
ఈ సీజన్‌ మొత్తానికి కెప్టెన్‌ అయ్యే అర్హతను కోల్పోయిన ప్రియకు కెప్టెన్‌ అయ్యే అవకాశాన్ని కల్పించాడు. అంతేకాకుండా ఆమె కెప్టెన్‌గా గెలిస్తే ఈ సీజన్‌లో అందరిలాగే కెప్టెన్‌గా పోటీచేసే అర్హత తిరిగి లభిస్తుందని చెప్పాడు. దీంతో కెప్టెన్సీ కంటెండర్స్‌ పోటీ నుంచి వెనక్కు తగ్గిన హమీదా.. తన స్థానాన్ని ప్రియకు ఇచ్చింది. అనంతరం బిగ్‌బాస్‌ 'పదివేలు సరిపోవు సోదరా' అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా కొన్ని రంధ్రాలున్న వాటర్‌ ట్యాంకులను గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేశాడు. టాస్క్‌ ముగిసే సమయానికి ఎవరి దగ్గరున్న వాటర​ ట్యాంకులో ఎక్కువ నీళ్లుంటాయో వారే గెలిచినట్లు లెక్క! అని క్లారిటీ ఇచ్చాడు. ఈ టాస్కులో రవి, యానీ మాస్టర్‌, శ్వేత, ప్రియ పోటీపడగా... ఫైనల్‌గా ప్రియ గెలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అదెంతవరకు నిజమనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు