Bigg Boss Telugu 5: అదే ప్రియాంక సింగ్‌ కొంప ముంచింది!

9 Dec, 2021 16:39 IST|Sakshi

Bigg Boss 5 Telugu Priyanka Singh Elimination Reasons: బిగ్‌బాస్‌ హౌస్‌లో తన అందచందాలతో అందరినీ బుట్టలో వేసుకుంది ప్రియాంక సింగ్‌. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందు వరుసలో ఉండే పింకీ బిగ్‌బాస్‌ షో చివరి రోజుల్లో మాత్రం తన సొంతవైద్యంతో శ్రీరామ్‌ను లేవలేని స్థితికి తీసుకొచ్చింది. ఇది పింకీ కావాలని చేయకపోయినప్పటికీ నాగ్‌ ఆ విషయాన్ని గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో ఆమె బాధపడిపోయింది. ఇక హౌస్‌లో తనకు అందరూ జస్ట్‌ ఫ్రెండ్స్‌ అయితే మానస్‌ మాత్రం అంతకుమించి అంటూ అతడితో కొన్ని స్వీట్‌ మొమోరీస్‌ కూడగట్టుకోవాలనుకుంది పింకీ. కానీ కేవలం అతడి మీదే ఫోకస్‌ చేసి గేమ్‌ను పక్కనపెట్టేయడంతో 13 వారాల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చింది. మరి పింకీ ఎలిమినేట్‌ అవడానికి ముఖ్య కారణాలేంటో చదివేయండి..

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రియాంకను అందరూ ముద్దుగా పింకీ అని పిలుస్తుంటారు. తనకు నచ్చినవారి కోసం ఏమైనా చేసే స్వభావం పింకీది. షోలో పాల్గొన్న 18 మంది కంటెస్టెంట్లలో మానస్‌ అంటే చాలు పడిచచ్చేది. అతడిపై ఎక్కడలేని ప్రేమ కురిపించేది. అతడు తిననని బెట్టు చేస్తే బతిమాలి బుజ్జగించి మరీ తినిపించేది. అతడు మాట్లాడకపోతే ఒడ్డున పడ్డ చేపపిల్లలా విలవిల్లాడిపోయేది. ఏమీ తినకుండా ఒకరకంగా నిరాహార దీక్ష చేసేది.

మొదట్లో అది కొంత సరదాగానే ఉన్నప్పటికీ రానురానూ అది విపరీత చేష్టలుగా మారింది. అతడు తిట్టినా, ఈసడించుకున్నా మానస్‌ మానస్‌ అంటూ అతడి జపమే చేసింది. అదే ఆమె కొంప ముంచింది. పైకి తనకు గేమ్‌ ముఖ్యం అని చెబుతున్నా తన ప్రవర్తన మాత్రం మానసే ముఖ్యం అన్నట్లుగా ఉండేది. దీనికితోడు గతవారం మానస్‌తో జరిగిన గొడవలు కూడా పింకీకి మరింత మైనస్‌గా మారాయి.

అందరికీ వండిపెట్టడం మంచిదే! కానీ కిచెన్‌లోనే ఉంటూ టాస్కుల్లో వెనకబడిపోయింది పింకీ. ఏవో కొన్ని టాస్కులు మినహా మిగతావాటిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో పింకీ హౌస్‌లో ఉండటం అవసరమా? అన్న ప్రశ్నకు తనే అంకురార్పణ చేసినట్లైంది.

► హౌస్‌లో దాదాపు అందరు కంటెస్టెంట్లు ఆమెకు సపోర్ట్‌గా ఉన్నప్పటికీ దాన్ని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయింది పింకీ. పైగా తను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేక ప్రతిదానికి తన స్నేహితులపై ఆధారపడుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి.

13వ వారం ప్రియాంకతో పాటు శ్రీరామ్‌, సిరి, కాజల్‌, మానస్‌ కూడా నామినేషన్‌లో ఉన్నారు. అయితే షణ్ముఖ్‌ నామినేషన్‌లో లేకపోవడంతో అతడి ఓట్లు సిరికి, సన్నీ కూడా పై లిస్టులో లేకపోవడంతో అతడి ఓట్లు మానస్‌, కాజల్‌కు పడ్డట్లు తెలుస్తోంది. దీంతో పింకీకి దెబ్బ పడింది. ఒకవేళ మానస్‌ నామినేషన్‌లో లేకుంటే అతడి ఓట్లు పింకీకి పడే అవకాశముండి ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకునే ఆస్కారం ఉండేది. కానీ అతడు కూడా పింకీతో సహా నామినేషన్లో ఉండటంతో ఆమెకు ఓట్లు తక్కువగా వచ్చి ఎలిమినేట్‌ అయింది.

► హౌస్‌లో పెద్దగా ఎవరితోనూ గొడవపడకుండా, ఏ విషయంలోనూ తలదూర్చకుండా సేఫ్‌గా ఆడటం వల్లే ఆమె ఇన్నిరోజులు హౌస్‌లో ఉండగలిగిందన్నది మరో వాదన. కానీ బిగ్‌బాస్‌ జర్నీ చివరి మజిలీకి చేరుకుంది. ఇప్పుడు సేఫ్‌గా ఆడినా ప్రయోజనం ఉండదు. ఉన్నవారిలో ఎవరు బెస్ట్‌? ఎవరు వరస్ట్‌ అని చూస్తారు. అలా ఇప్పుడు హౌస్‌లో ఉన్నవారిలో పెద్దగా పర్ఫామ్‌ చేయకుండా టాస్కుల్లో వెనకబడిపోయింది పింకీయే అంటున్నారు.

► అందరి కోసం ఆరాటపడే పింకీ బిగ్‌బాస్‌ వద్దంటున్నా సొంత వైద్యం చేసింది. ఐస్‌ క్యూబ్స్‌లో ఎక్కువసేపు నిలబడి స్పర్శ కోల్పోయిన శ్రీరామ్‌ పాదాలకు బామ్‌ రాసి వేడినీళ్లు పోసింది. అసలు వేడినీళ్లు పోయకూడదని బిగ్‌బాస్‌ చెప్పినప్పటికీ పింకీ అలా చేయడంతో శ్రీరామ్‌ నరకం అనుభవించాడు. కొద్ది రోజులపాటు కాలు కిందపెట్టలేకపోయాడు. కాళ్లకు కట్టు కట్టుకుని మంచానికే పరిమితమయ్యాడు. అటు సిరికి కూడా ఏదో అస్వస్థతగా ఉందంటే పింకీ సలహా ఇవ్వగా బిగ్‌బాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. సొంత వైద్యం అక్కర్లేదని హెచ్చరించాడు. అయితే పింకీ ఇదంతా కావాలనే చేసిందా? అని కొందరు నెటిజన్లు అనుమానించారు. మంచి ఉద్దేశంతో సాయం చేయబోతే చేతులు కాల్చుకుంది పింకీ.

► ఏదేమైనా ఒక ట్రాన్స్‌జెండర్‌ 90 రోజులపాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో తన జర్నీని కొనసాగించడం మామూలు విషయం కాదు! భారత్‌లోని ఏ ఇతర భాషల్లో కూడా ట్రాన్స్‌వుమెన్‌ మూడు, నాలుగు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయింది. కానీ ప్రియాంక తొలిసారిగా ఆ రికార్డును తిరగరాసింది. ఏకంగా 13 వారాలు హౌస్‌లో ఉండి సూపర్‌ 7 లిస్టులో చోటు దక్కించుకుంది. బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలవలేకపోయినా ఎందరో మనసులను గెలుచుకుని బయటకు వచ్చింది.

మరిన్ని వార్తలు