బిగ్‌బాస్ 5 ప్రారంభం అప్పటి నుంచే..

3 Apr, 2021 15:21 IST|Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో మొదలైందంటే చాలు.. అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి.  ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్‌ షోకు సీజన్‌ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గగతేడాది డిసెంబర్‌ 20న గ్రాండ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్‌ ఇచ్చింది. ఆ సీజన్‌లో ఎక్కువగా కొత్త ముఖాలే ఉన్నప్పటికీ నాగార్జున తన అనుభవంతో షోని రక్తి కట్టించాడు.

దీంతో నాల్గో సీజన్‌ కూడా విజయవంతంగా ముగిసింది. దీంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఐదో సీజన్‌ పనులు మొదలెట్టారు. నాల్గో సీజన్‌ ముగిసి నెల రోజులకే స్టార్ మా ఐదో సీజన్‌ కోసం పనులు ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏప్రిల్‌లో షో మొదలవుతుందని వార్తాలు వినిపించాయి. కానీ ఈ నెలలో మొదలయ్యే అవకాశాలుల్లేవు. తాజా సమాచారం ప్రకారం జులై మొదటి వారంలో ఐదో సీజన్‌ని ప్రారంభించబోతున్నారట.  ఈ సారి మరింత కొత్తగా షోని నడిపించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. పాపులర్‌ అయిన నటీనటులను మాత్రమే షోలోకి తీసుకోబోతున్నారట. . అందులో భాగంగా ఇప్పటికే కొందరిని బుక్ చేసుకున్నారని.. వారికి భారీగా డబ్బులు ముట్టజెప్పుతున్నారని తెలుస్తోంది.

 ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశాడు. ఇక మూడు నాలుగు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేసింది తెలిసిందే. ఐదో సీజన్‌కి నాగార్జుననే హోస్ట్‌గా తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారట. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి యూట్యూబ్‌ స్టార్‌  షణ్ముఖ్‌ జశ్వంత్‌ యాంక‌ర్ ర‌వి, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది పేర్లను నిర్వాహ‌కులు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇందులో నిజ‌మెంత‌? ఐదో సీజన్‌లో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు