Bigg Boss 6: అర్జున్‌కి శ్రీసత్య గోరు ముద్దలు.. చంటికి ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌ ఇదే

28 Sep, 2022 13:25 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్స్‌ ప్రక్రియ పూర్తికాగానే కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక ప్రక్రియను మొదలు పెడతాడు బిగ్‌బాస్‌. దీని కోసం హౌస్‌మేట్స్‌కు రకరకాల టాస్కులు ఇస్తాడు. ఈ వారం కంటెస్టెంట్స్‌కి హోటల్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌ ఎంటంటే.. బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను రెండు భాగాలుగా విభజించారు. వారిలో కొందరు బిగ్‌బాస్‌ హోటల్‌లో పని చేయాలి. మరికొందరు గ్లామ్‌ ప్యారడైజ్‌ హోటల్‌ని రన్‌ చేయాలి. బీబీ హోట‌ల్ స్టాఫ్‌గా  సుదీప‌, బాలాదిత్య‌, మెరీనా, గీతు, రేవంత్‌, చంటి ఉంటే.. గ్లామ్ ప్యార‌డైజ్ హోట‌ల్ స్టాఫ్ గా వాసంతి, ఫైమా, కీర్తి, శ్రీస‌త్య , ఆరోహి ఉన్నారు. ఇక గెస్టులుగా  శ్రీహాన్‌, ఇన‌యా, ఆదిరెడ్డి, రాజ్ ,అర్జున్‌ లను నియమించాడు.

బిబీ హోటలకు మేనేజర్‌ సుదీప అయితే గ్లామ్‌ ప్యారడైజ్‌కు ఫైమా మేనేజర్‌. ఇక రిచ్‌ గాళ్‌ ఇనయా, గతం మర్చిపోయి ప్రతిసారీ కొత్తగా ప్రవర్తించే వ్యక్తిగా సూర్య, తమ ఫ్రెండ్ పెళ్లికి లొకేషన్ ఫిక్స్ చేయడానికి వచ్చిన వ్యక్తులుగా రాజ్, అర్జున్, ఒకే ఒక్క హిట్టు సినిమా చేసి సూపర్‌‌ స్టార్‌‌లా ఫీలైపోయే హీరోగా  శ్రీహాన్‌ ఉన్నారు. వీరి నుంచి రెండు హోటళ్ల సభ్యులు ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి. ఆట ముగిసే సమయానికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే.. ఆ హోటల్‌ వాళ్లు గెలిచి కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. అయితే ఈ గేమ్‌లో చిన్న ట్విస్ట్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. బీబీ హౌటల్‌లో ఉన్న చంటికీ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. అదేంటంటే..బీబీ హోటల్‌కి వచ్చే అతిథులను ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి పారిపోయేలా చేసి, వారందరిని గ్లామ్‌ ప్యారడైజ్‌కు తరలించారు. వీలైనంత ఎక్కువమందిని గ్లామ్‌ ప్యారడైజ్‌ హోటల్‌కి తరలించాలి, వారు విజయం సాధించేలా చేస్తే.. చంటి నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అవుతాడు. అయితే ఈ టాస్క్‌ అంత రసవత్తరంగా సాగలేదు. 

ప్రతి సీజన్‌లో ఇచ్చిన టాస్కే.. మళ్లీ ఇవ్వడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్సయింది. అంతేకాదు కంటెస్టెంట్స్‌ కూడా తమకు ఇచ్చిన పాత్రల పరిధి దాటి ప్రవర్తించారు. హోటల్‌ మేనేజర్‌గా ఉండాల్సిన ఫైమా.. హౌస్‌ కీపింగ్‌ మెంబర్‌లా ప్రవర్తించింది. ఇక శ్రీసత్య మాత్రం తెలివిగా అర్జున్‌ వీక్‌నెస్‌తో ఆడుకుంటుంది. అర్జున్‌ కూడా దొరికిందే చాన్స్‌ అని..ఆమెతో అన్ని పనులు చేయించుకుంటున్నాడు.డబ్బులిచ్చి  భుజమ్మీద చేయి వేసి ఫొటో తీయించుకోవడం, అన్నం తినిపించడం లాంటి పనులను శ్రీసత్యతో చేయించుకుంటూ అర్జున్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు . ఇక సూర్యకి మసాజ్ చేయమని చెప్పడంతో ఆరోహి సిగ్గులు ఒలకబోస్తూనే బాడీ మసాజ్‌ చేసింది. మొత్తానికి మంగళవారం ఎపిసోడ్‌ అయితే అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈ రోజు ఏదో గొడపడినట్లు ప్రోమోలో చూపించారు. కనీసం ఆ గొడవతోనైనా బిగ్‌బాస్‌కి హైప్‌ వస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు