Bigg Boss Telugu 6: విన్నరైపోతానన్న గీతూ.. అంతొద్దు, టాప్‌ 5లో ఉంటావన్న తండ్రి

12 Oct, 2022 23:42 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోలో ప్రస్తుతం బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌ నడుస్తోంది. ఈ టాస్క్‌తో ఇంటిసభ్యులకు మంచి బూస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్‌. ఇప్పటికే ఈ టాస్క్‌లో భాగంగా శ్రీహాన్‌, ఆది రెడ్డి, సుదీపలు బ్యాటరీలో 95 శాతం వాడుకోవడంతో 5 శాతమే మిగిలింది. తిరిగి బ్యాటరీ రీచార్జ్‌ చేయాలంటే ఇంట్లోని చక్కెర మొత్తాన్ని త్యాగం చేయాలని లేదంటే బాలాదిత్యను స్మోకింగ్‌ మానేయమని ఒప్పించాలని ఆదేశించాడు బిగ్‌బాస్‌. దీంతో గీతూ దొరికిందే ఛాన్సని ఆదిత్యతో పొగ తాగడం మానేలా చేద్దామనుకుంది.

వెంటనే ఇంటిసభ్యుల దగ్గరికి వెళ్లి బిగ్‌బాస్‌ చెప్పింది కాకుండా తనకు నచ్చిన పాయింట్‌ను యాడ్‌ చేసింది. అందరూ తిండి మానేస్తే 70 శాతం చార్జ్‌ అవుతుందని, ఒకవేళ బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేస్తే 90 శాతం చార్జ్‌ అవుతుందని చెప్పింది. దీంతో అతడు మారుమాట్లాడకుండా తన వ్యసనమైన సిగరెట్లను త్యాగం చేశాడు. అనంతరం కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లిన గీతూ ఆడియో కాల్‌(15) ఎంచుకుంది. తర్వాత అర్జున్‌.. తనకోసం కాకుండా సత్యకు వీడియో కాల్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయండన్నాడు. అది కుదరదని బిగ్‌బాస్‌ చెప్పడంతో వీడియో మెసేజ్‌ (35) సెలక్ట్‌ చేసుకున్నాడు.

ఇక గీతూకు తన తండ్రి ఫోన్‌ చేసి చాలానే మాట్లాడాడు. ఇప్పుడే విన్నర్‌ అని ఊహించుకోకు. కానీ ప్రస్తుతానికైతే టాప్‌ 5లో ఉంటావు. కొంచెం యాటిట్యూడ్‌ మార్చుకో. ప్రతి ఆడపిల్ల కూడా గీతూలా ఉండాలి అనిపించేలా చేయు. కానీ కొన్ని మార్చుకుంటేనే అందరికీ రోల్‌ మోడల్‌ అవుతావు అని సూచనలిచ్చాడు ఆమె తండ్రి. తర్వాత అర్జున్‌ తండ్రి వీడియో మెసేజ్‌ చూసి ఇంటిసభ్యులంతా ఎమోషనలయ్యారు. మరోపక్క ఇనయ.. తనకు ఫైమాతో ఉంటే అమ్మతో, సూర్యతో ఉంటే నాన్నతో, రాజ్‌తో ఉంటే ఫ్రెండ్స్‌తో ఉన్నట్లు ఉందని చెప్తూ ఎమోషనలైంది. అంతలోనే ఆమెను బిగ్‌బాస్‌ కన్ఫెషన్‌ రూమ్‌కు పిలవడంతో ఉన్నదాంట్లో తక్కువైన ఫొటో ఫ్రేమ్‌(25)ను సెలక్ట్‌ చేసుకుంది.

గీతూ, ఇనయ, అర్జున్‌ వాడుకోగా మిగిలిన బ్యాటరీ 5 శాతమే ఉండటంతో దాన్ని మళ్లీ రీచార్జ్‌ చేయడానికి బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా ఫైమా ఇంగ్లీష్‌లో సినిమాల గురించి చెప్తుంటే అదేం సినిమానో ఇంటిసభ్యులు గెస్‌ చేయాలి. ఆ టాస్క్‌ విజయవంతంగా పూర్తి కావడంతో బ్యాటరీ మళ్లీ రీచార్జ్‌ అయింది. తర్వాత శ్రీసత్య 35 శాతం ఉన్న వీడియో కాల్‌ సెలక్ట్‌ చేసుకుంది. వీడియో కాల్‌లో తల్లిదండ్రులను చూడగానే సత్య భావోద్వేగానికి లోనైంది. తర్వాత బాలాదిత్య 50 శాతం ఉన్న ఆడియోకాల్‌ ఎంచుకుని భార్య, కుమార్తెతో తనివితీరా మాట్లాడాడు.

అయితే అందరికీ ఛాన్స్‌ రావాలని తక్కువ రీచార్జ్‌ ఉన్న ఫుడ్‌ ఆప్షన్‌ ఎంచుకుని పేరెంట్స్‌తో మాట్లాడలేకపోయాడు శ్రీహాన్‌. ఇలా బ్యాటరీ రీచార్జ్‌ చేసే ఆప్షన్‌ ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదంటూ ఓ మూలకెళ్లి కూర్చుని ఒక్కడే ఏడ్చేశాడు. ఇదిలా ఉంటే మెరీనా మైక్‌ ధరించనప్పుడు, రేవంత్‌ పడుకున్నప్పుడు కలిపి పది శాతం వరకు చార్జ్‌ తగ్గిపోయింది. ఈ లెక్కన వీళ్లకు నామినేషన్స్‌లో ఇదే కారణం చెప్పి ఓట్లు గుద్దడం ఖాయంగా కనిపిస్తోంది.

చదవండి: బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలి
మహేశ్‌బాబును అలా చూడటం ఇదే మొదటిసారి

మరిన్ని వార్తలు