Bigg Boss Telugu: ప్రైజ్‌మనీకి భారీగా ఎసరు, కెప్టెన్‌ ఎవరంటే?

16 Nov, 2022 23:15 IST|Sakshi

Bigg Boss 6 Telugu, Episode 74: వీలైనంత ప్రైజ్‌మనీని తగ్గించాలని బిగ్‌బాస్‌ కంకణం కట్టుకున్నట్లున్నాడు. కంటెస్టెంట్లు నో చెప్పడానికి వీలు లేని కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌కు ఓ రేటు ఫిక్స్‌ చేశాడు. అలా ప్రైజ్‌మనీలో నుంచి కావాల్సినంత దండుకుంటున్నాడు. ఇంతకీ ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలు తగ్గింది? నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ ఏంటో చదివేద్దాం..

రివ్యూలు వద్దని స్వయంగా నాగార్జునే చెప్పినా పట్టించుకోని ఆదిరెడ్డి ఈవారం ఎవరు వెళ్తారని సత్యతో డిస్కషన్‌ పెట్టాడు. దీనికామె క్షణం ఆలోచించకుండా కీర్తి అని చెప్పింది. అటు ఆదిరెడ్డి కూడా నాకూ అలాగే అనిపిస్తోందని వంత పాడాడు. అనంతరం బిగ్‌బాస్‌.. బీబీ ట్రాన్స్‌పోర్ట్‌ అనే కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా బీబీ ట్రక్కు సమయానుసారం ఒక్కో స్టాప్‌ దగ్గర ఆగిపోతుంది. అలా ఆగిన ప్రతిసారి ఎవరైతే ముందు వచ్చి ఎక్కుతారో వారే కెప్టెన్సీ పోటీదారులవుతారు. అయితే ప్రతి స్టాప్‌లో ఆ వాహనం ఎక్కేందుకు ఓ ధర ఉంటుందని, దాన్ని విన్నింగ్‌ ప్రైజ్‌మనీలో నుంచి తీసేస్తామని చెప్పాడు. దీనితోపాటు ఆ ట్రక్కు ఎక్కలేకపోయిన మిగతా ఇంటి సభ్యులు తమలో కెప్టెన్సీకి అనర్హులుగా భావించే ఇద్దరి పేర్లను చెప్తే వారిలో ఎవరు పోటీలో పాల్గొంటారు? ఎవరు రేస్‌ నుంచి తప్పుకుంటారనేది పోటీదారులు నిర్ణయిస్తారు.

మొదటి రౌండ్‌లో ఆదిరెడ్డి గెలవగా అతడు తన కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ కోసం లక్ష రూపాయలు వాడతానన్నాడు. ఇక ఇంటిసభ్యులు పోటీలో నుంచి ఎవరిని తప్పిద్దామని చర్చలు మొదలుపెట్టారు. శ్రీహాన్‌.. రోహిత్‌ కెప్టెన్‌గా ఇంటిని చూసుకోగలడన్న నమ్మకం లేదన్నాడు. దీనికి రోహిత్‌ ఆన్సరిస్తూ.. నువ్వు నన్ను కాంపిటీషన్‌గా చూస్తున్నావేమో, అందుకే పక్కన పెడుతున్నావని కౌంటరిచ్చాడు. దీనికి శ్రీహాన్‌.. అసలు నువ్వు నాకు కాంపిటీషనే కాదని బిల్డప్‌ ఇవ్వడం గమనార్హం. ఇక కీర్తి.. శ్రీసత్య, శ్రీహాన్‌ పేరు చెప్పడంతో శ్రీహాన్‌ వెటకారం మొదలుపెట్టాడు. అలా వీళ్లిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. చివరగా రోహిత్‌, ఫైమాలను నిల్చోబెట్టగా వీళ్లలో రోహిత్‌కు ఛాన్స్‌ ఇచ్చి ఫైమాను తొలగించాడు ఆదిరెడ్డి.

రెండోసారి రేవంత్‌ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఈ రౌండ్‌లో ప్రైజ్‌మనీలో నుంచి రూ.25 వేలు తగ్గించాడు బిగ్‌బాస్‌. హౌస్‌మేట్స్‌ ఏకాభిప్రాయంతో శ్రీహాన్‌, రాజ్‌లను ఎన్నుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్లయిన రేవంత్‌, ఆది.. శ్రీహాన్‌ను గేమ్‌లో ఉంచాలనుకుని రాజ్‌ను సైడ్‌ చేశారు. మూడో రౌండ్‌లో రోహిత్‌ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఇందుకుగానూ రూ.45,000 కట్‌ చేశాడు. హౌస్‌మేట్స్‌ ఏకాభిప్రాయంతో శ్రీహాన్‌, శ్రీసత్యలను నిలబెట్టగా కెప్టెన్సీ కంటెండర్లు శ్రీహాన్‌ను గేమ్‌లో కంటిన్యూ చేయనున్నట్లు ప్రకటించారు.

నాలుగో రౌండ్‌లో శ్రీహాన్‌ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలవగా ఇందుకోసం రూ.30,000 కోత పెట్టాడు బిగ్‌బాస్‌. కంటెండర్లు మెరీనాను ఆటలో కంటిన్యూ చేసి కీర్తిని సైడ్‌ చేశారు. ఐదో రౌండ్‌లో కంటెండర్‌షిప్‌ కోసం పోటీపడేందుకు రూ.70 వేలు పెట్టాడు బిగ్‌బాస్‌. ఈసారి ఇనయ ముందుగా ట్రక్‌ ఎక్కి కంటెండర్‌గా నిలిచింది. మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ ద్వారా రూ.3 లక్షలు కోత పెట్టడంతో ప్రైజ్‌మనీ రూ. 41,00,300 చేరింది.

తర్వాత శ్రీహాన్‌, శ్రీసత్య, రేవంత్‌ సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీహాన్‌, శ్రీసత్య మాట్లాడుకున్నప్పుడు నేను ఆటలో అరటిపండు అయ్యాననే టైంలో రాజ్‌ క్లోజ్‌ అయ్యాడన్నాడు రేవంత్‌. ఆ మాటతో మండిపడ్డ శ్రీహాన్‌.. మేము మాట్లాడుకునేటప్పుడు నిన్ను రావద్దని అనలేదు కదా? అని ప్రశ్నించాడు. నేనేదో చాలా సాధారణంగా అన్నానని రేవంత్‌ అన్నా సరే శ్రీహాన్‌ వినిపించుకోలేదు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తున్నామన్నట్లుగా చెప్తున్నావని సీరియస్‌ అయ్యాడు.

అటు శ్రీసత్య కూడా మధ్యలో అందుకుంటూ.. ఇప్పుడేంటి, నేను శ్రీహాన్‌తో ఎక్కువగా మాట్లాడొద్దు, అంతే కదా అని సూటిగా అడిగేసింది. చిన్నమాటను ఎక్కడికో తీసుకువెళ్తున్నారని భావించిన రేవంత్‌ గొడవ చేయడం ఎందుకని సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం రోహిత్‌, ఆదిరెడ్డి, రేవంత్‌, శ్రీహాన్‌, ఇనయ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో రేవంత్‌ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది!

చదవండి: కాంతార హీరోకు గోల్డెన్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రజనీకాంత్‌
ఓటీటీలో ప్రిన్స్‌, ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌ అంటే?

మరిన్ని వార్తలు