Pallavi Prashanth: లక్షలు మోసపోయాడు, ఇంట్లోకే రానన్నాడు, పెళ్లెప్పుడంటే.. పల్లవి ప్రశాంత్‌ పేరెంట్స్‌

15 Sep, 2023 13:30 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోలో తన ఆటతో రాణిస్తున్నాడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌. బిగ్‌బాస్‌ షోకి వెళ్లాలని ఐదు సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు. తన మాటతీరుతో, ఆటతో అందరినీ అట్రాక్ట్‌ చేస్తున్నాడు. తాజాగా అతడి గురించి పల్లవి ప్రశాంత్‌ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

చస్తానని పొలం దగ్గరకు వెళ్లి..
'నా కొడుకు బిగ్‌బాస్‌ షోకి వెళ్లినందుకు సంతోషంగా ఉంది. కానీ అమర్‌దీప్‌ నా కొడుకును ఏందిరా.. అన్నందుకు బాధేసింది. నా కొడుకును రైతు అని హేళన చేస్తున్నారు. నాకు అదుంది, ఇదుందని విర్రవీగొద్దు. హౌస్‌లో అందరూ సమానమే. నా కొడుకు ఒకసారి లవ్‌ సాంగ్‌ తీస్తే రూ.7 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులను నా కొడుకు స్నేహితులు తీసుకుని మోసం చేశారు. అప్పుడు నా కొడుకు చాలా ఏడ్చాడు. ఒకరోజైతే చస్తానని పొలం దగ్గరకు వెళ్లిండు. నీకే కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పిన. అప్పుడు ఫోన్‌ కొనిస్తే రీల్స్‌ చేసుకుంటానన్నాడు.

అదే సంతోషం
ఫోన్‌ కొనిచ్చిన, రీల్స్‌ చేసుకుంటూ ఫేమస్‌ అయిండు. కానీ ఏదో ఒకటి చేయాలని తిండీతిప్పలు లేకుండా తిరిగిండు. బిగ్‌బాస్‌కు వెళ్లిండు, నాగార్జున సార్‌ను కలిశిండు, అదే సంతోషం. ప్రశాంత్‌కు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది. కానీ, తనకు ముందు సెటిలవ్వాలని ఉంది. సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకుంటా, మళ్లీ ఆ ప్రస్తావన తెస్తే ఇంట్లోకే రానని అన్నాడు. అందుకే ఊరుకున్నాం. బిగ్‌బాస్‌ నుంచి వచ్చాక పెళ్లి చేస్తాం. రతిక మా కొడుకుని వాడుకుంది. ప్రశాంత్‌తో ఉంటే అతడికొచ్చే ఓట్లు తనకు కూడా వస్తాయని అనుకుంది, వాడుకుంది. అంతే! ప్రశాంత్‌ అందరినీ అక్కాచెల్లె అనుకుంటూనే మాట్లాడతాడు. తను ఎటువంటి దురాలోచన చేయడు' అని చెప్పుకొచ్చారు.

చదవండి: మార్క్‌ ఆంటోని మూవీ ట్విటర్‌ రివ్యూ.. విశాల్‌ హిట్‌ కొట్టాడా?

మరిన్ని వార్తలు