Damini Bhatla On Her Marriage: నాకు లవ్‌ మ్యారేజ్‌ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా!

30 Sep, 2023 14:32 IST|Sakshi

సింగర్‌ దామినికి బాగా పాడటమే కాదు మంచిగా వంట చేయడం కూడా వచ్చు. బిగ్‌బాస్‌ హౌస్‌లో తను ఈ టాలెంటే చూపించింది. టాస్కుల్లో ఆడటానికంటే కూడా వంట చేయడం, అది అందరికీ సరిపోతుందా? లేదా లెక్కలేసుకోవడం? ఇలా కిచెన్‌ వ్యవహారాల్లోనే ఎక్కువగా తలమునకలు కావడంతో వంటలక్కగా పేరు తెచ్చుకుంది. కానీ ప్రేక్షకులు కోరుకుంది ఇది కాదు కదా! గేమ్‌ ఆడుతూ మనసులు మెప్పించేవాళ్లు కావాలే కానీ వంట చేసి పెట్టేవాళ్లు మాకెందుకు? అనుకున్న ఆడియన్స్‌ ఆమెను హౌస్‌ నుంచి పంపించేశారు.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను వెజిటేరియన్‌.. కాకపోతే గుడ్డు తింటాను. సినిమాలో పచ్చబొట్టేసినా.. అని పాట పాడాను కానీ ఇంతవరకు నా ఒంటిపై ఒక్క పచ్చబొట్టు కూడా లేదు. నాకిష్టమైన ప్రదేశానికి వెళ్లి టాటూ వేయించుకోవాలని చూస్తున్నాను. ఏదైనా స్పెషల్‌ మూమెంట్‌ వచ్చినప్పుడే ఆ పని చేస్తాను. నాకు లవ్‌ మ్యారేజ్‌ అంటే ఇష్టం. కొన్నాళ్లు సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈరోజుల్లో సహజీవనం చేస్తే తప్పేం లేదు. అలాంటి పరిస్థితి వస్తే ఇంట్లో వాళ్ల అనుమతి తీసుకున్నాకే లీవ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉంటాను. అమ్మానాన్న నన్ను చాలా అర్థం చేసుకుంటారు. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు' అని చెప్పుకొచ్చింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన ముచ్చట్ల గురించి చెప్తూ.. 'మా ఇంట్లో చికెన్‌ కూడా తీసుకురారు. అలాంటిది నేను తొలిసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో చికెన్‌ కూర వండాను. అది చూపించలేదు. అలాగే ఓ టాస్క్‌లో ప్రిన్స్‌ యావర్‌ ముఖాన పేడ కొట్టాను. టాస్క్‌ పూర్తవగానే సారీ చెప్పి తనకు తలంటు పోశాను, అది కూడా టెలికాస్ట్‌ చేయలేదు. వినాయక చవితి సమయంలో ప్రిన్స్‌.. షేర్వాణీ వేసుకుని వచ్చి అక్షింతలు వేసి ప్రసాదం తిన్నాడు. అది చూసి నేను ఆయన భుజం తట్టి నిన్ను చూస్తే గర్వంగా ఉందని మెచ్చుకున్నాను. అది వేయకపోగా.. తర్వాత నేను సందీప్‌ మాస్టర్‌తో యావర్‌ వయొలెంట్‌గా ఉంటాడు కానీ కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. మొన్న వినాయక చవితికి అక్షింతలు వేశాడు అని పొగిడాను. ఇందులో నేను మాట్లాడిందంతా లేపేసి కేవలం అక్షింతలు వేశాడు అని చెప్పింది మాత్రమే చూపించారు. దానివల్ల నేనేదో అతడి గురించి చెడుగా మాట్లాడినట్లుగా అర్థం చేసుకున్నారు. అలా నామీద చాలా వ్యతిరేకత వచ్చింది' అని పేర్కొంది దామిని.

చదవండి: నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన ఆమె కామెంట్‌

మరిన్ని వార్తలు