Bigg Boss 7 Telugu: చిల్లర మాటలు.. అతి చేష్టలు.. ‘ఛీ’వాజీ

16 Sep, 2023 14:41 IST|Sakshi

న‌రంలేని నాలుక ఏమైనా మాట్లాడుతుంద‌న‌డానికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ శివాజీ అని చెప్పొచ్చు. ఇన్నాళ్లు బయట నేను తోపు, తురుమ్‌ ఖాన్‌ అంటూ గప్పాలు కొట్టుకుంటూ గలీజ్‌ పురాణాలు చెప్పిన ఈ నటుడు.. ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోనూ అలానే వ్యవహరిస్తున్నాడు. అందరికి నీతులు చెబుతూ.. తాను మాత్రం పాటించడం లేదు. పైగా బిగ్‌బాస్‌కే బాస్‌లా వ్యవహరిస్తూ.. తన అతి చేష్టలతో అందరిముందు నవ్వులపాలవుతున్నాడు

చివరి అస్త్రంగా బిగ్‌బాస్‌
వాస్తవానికి బిగ్‌బాస్‌లోకి ఎవరైనా మనీ కోసమే లేదా ఫేమ్‌ కోసమో వస్తారు. శివాజీ కూడా అందుకోసమే వచ్చాడు. ఆయన ఒక హీరో అనే విషయాన్ని జనాలు మర్చిపోయారు. సినిమా అవకాశాలు ఎప్పుడో రావడం మానేశాయి. దీంతో రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడ తగిన గుర్తింపు రాలేదు. దీంతో చంద్రబాబు మెప్పు పొందేందుకు 2019 ఎన్నికల ముందు గరుడ పురాణమంటూ ఓ కట్టుకథ అల్లాడు.

ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని తేలడంతో తెలుగు ప్రజల ముందు నవ్వుల పాలయ్యాడు. ఎన్నికల తర్వాత టీడీపీ కూడా అతన్ని దూరం పెట్టింది. దీంతో బీజేపీలో చేరాడు. ఆ విషయం బహుశా పార్టీ వాళ్లు కూడా మర్చిపోయారేమో. అలా రాజకీయాల్లో రాణించలేక.. ఇటు సినిమా అవకాశాలు కోల్పోయి రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది శివాజీ పరిస్థితి. ఇప్పుడు చివరి అవకాశంగా బిగ్ బాస్ ని ఎంచుకున్నాడు.

పైన పటారం..లోన లొటారం
తనను జనాలు మర్చిపోయారనే విషయం శివాజీకి తెలుసు. బిగ్‌బాస్‌ షోకి వెళ్తే కనీసం కొంతమంది అయినా తనను గుర్తిస్తారని భావించి ఈ షోకి వచ్చాడు. ఈ విషయం బిగ్‌బాస్‌ స్టేజీపైనే చెప్పాడు. కానీ హౌస్‌లో మాత్రం ఏదో టైంపాస్‌గా వచ్చినట్లు బిల్డప్‌ ఇస్తున్నాడు. శుక్రవారం ఎపిసోడ్‌లో తేజతో మాట్లాడుతూ.. ఏదో సరదాగా బిగ్‌బాస్‌లోకి వచ్చానని, ఇప్పుడు వెళ్లిపో అంటే వెళ్లిపోతానని చెప్పాడు. వేరే వాళ్ల తరపున బయటకు పోవడానికి కూడా తాను సిద్ధమేనని త్యాగమూర్తి లాంటి కబుర్లు చెప్పాడు.

(చదవండి: ప్రియుడి వల్ల ప్రెగ్నెన్సీ.. అమ్మ అబార్షన్‌ చేయించింది: షకీల)

అయితే అంతకు ముందు మాత్రం ‘నేను హౌస్‌లోనే ఉంటా.. 15 వారాల వరకు ఇక్కడే ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాను’ అని శివాజీ చెప్పుకొచ్చాడు. గేమ్‌ విషయంలోనూ శివాజీ అలానే వ్యవహరిస్తున్నాడు. పవరాస్త్ర కోసం శివాజీ, షకీలతో పాటు అమర్‌దీప్‌ని పోటీలో నిలిచాడు. బిగ్‌బాస్‌ ఆదేశం మేరకు అమర్‌దీప్‌ని సందీప్‌ ఎంచుకున్నాడు. దీంతో శివాజీకి భయం పుట్టుకుంది. షకీలా అయితే గేమ్‌ ఈజీగా ఆడొచ్చని, అమర్‌తో కష్టమని భావించాడు. అందుకే బిగ్‌బాస్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ‘తలుపు తీయరాసామి వెళ్లిపోతా.. నాకొద్దురా ఈ గోల’ అంటూ తన భయాన్ని బాగా కవర్‌ చేశాడు.

ఆ విషయం ముందు తెలియదా?
బిగ్‌బాస్‌ షో తన స్థాయికి తగ్గది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు శివాజీ. ప్రతిసారి ‘తొక్కల షో’, ‘పనికిమాలిన ఆటలు’ అంటూ షోని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. బయట ఉండి ఇలా మాట్లాడితే ఓకే. కానీ షోలోకి వెళ్లి ఆ షోనే తప్పుపట్టడం ఏంటి? ఈ షో ఎలా ఉంటుందో శివాజీకి ముందు తెలియదా? అన్నీ తెలిసి.. అవకాశాలు లేక వచ్చి.. మళ్లీ పైకి ఈ బిల్డప్‌ మాటలు ఎందుకు? తన భార్య వద్దని ముందే చెప్పినా.. ఈయన టైంపాస్‌గా ఈ షోకి వచ్చాడట. అది జనాలు నమ్మాలట. హౌస్‌లో ఉండడం ఇష్టం లేదనే వ్యక్తికి నామినేషన్స్‌ అంటే ఎందుకంత భయం?

ఓటమి భయం
బిగ్‌బాస్‌ అరిచే పోటీ ఇస్తే.. ఎలాగో గెలవనని ముందే ఫిక్స్‌ అయ్యాడు. దాన్ని కవర్‌ చేసేందుకు ఇదేం టాస్క్‌. నేను అసలు అరవనే అరవను అని అందరికి చెప్పాడు. బిగ్‌బాస్‌ పిలవగానే వెళ్లి గట్టిగా అరిచాడు. ఇదే విషయాన్ని అమర్‌ దీప్‌, సందీప్‌ చెప్పుకొని నవ్వుకున్నారు. గేమ్‌లో ఓడిపోతే.. నేను ముందే చెప్పా కదా.. నేను ఆడనని.. అందుకే ఓడిపోయా? నేను ఫిక్స్‌ అయితే ఈ గేమ్‌ ఎంత? అని గప్పాలు కొట్టుకోవడానికి ముందు అలా చెప్పుకొస్తున్నాడు. అయితే ఇలాంటి కవరింగ్‌ ముచ్చట్లు ఒకసారి చెబితే బాగుంటుంది.. ప్రతిసారి అలానే అంటే అసలు మ్యాటర్‌ బయటకు తెలిసిపోతుంది. ఇప్పుడు శివాజీ పరిస్థితి అలానే అయింది. చెప్పేది ఒకటి చేసేదొకటి అని హౌస్‌మేట్సే అనుకుంటున్నారు.

'ఛీ’వాజీ
బిగ్‌బాస్‌ షో మొదలైన వారం రోజులకే శివాజీ అసలు క్యారెక్టర్‌ బయటపడింది. మాయమాటలు.. సూక్తులు చెప్తూ పైకి మంచివాడిలా నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ హౌస్‌మేట్స్‌ అది ఎప్పుడో ఇది పసిగట్టేశారు. అందుకే ఈ వారం అతన్ని ఎక్కువమంది నామినేట్‌ చేశారు. ఇక అమర్‌దీప్‌ అయితే శివాజీకి ఇచ్చిపడేశాడు. సానుభూతి కోసమే ప్రశాంత్‌కి సపోర్ట్‌ చేస్తున్నాడనే విషయాన్ని అందరికి తెలిసేలా చేశాడు.

ప్రియాంక జైన్‌ కూడా శివాజీకి బాగానే గడ్డిపెట్టింది. వేలు ఎత్తి చూపిస్తే.. ‘దించండి సార్‌.. ఇది మంచి ప్రవర్తన కాదు’ అని సీరియస్‌ అయింది. ఆట సందీప్‌, అమర్‌దీప్‌ నిన్న కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు. ఒక్క పల్లవి ప్రశాంత్‌ తప్ప మిగతా వారంతా శివాజీని చాటుగా తిట్టుకుంటునే ఉన్నారు.

మరిన్ని వార్తలు