Prince Yawar: బిగ్‌బాస్‌కు వచ్చేముందు జీరో బ్యాలెన్స్‌.. ఆఖరికి దుస్తులు కూడా లేవా? ప్రిన్స్‌ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

23 Sep, 2023 15:12 IST|Sakshi

పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు ప్రిన్స్‌ యావర్‌కు అడుగడుగునా అపజయాలే ఎదురవుతున్నాయి. బిగ్‌బాస్‌ 7 షోలో అడుగుపెట్టిన ఈ మోడల్‌ టాస్కుల్లో విజృంభించి ఆడుతున్నాడు. కానీ ఎంత ఆడినా ఫలితం మాత్రం దక్కడం లేదు. పవరాస్త్ర టాస్క్‌ కంటెండర్‌ వరకు వచ్చిన ప్రిన్స్‌.. చివరి రౌండ్‌లో ఇద్దరమ్మాయిలు అతడిని గేమ్‌లో నుంచి ఎలిమినేట్‌ చేశారు. దీంతో అంత కష్టపడి ఇక్కడిదాకా వస్తే ఇంత ఈజీగా తనను గేమ్‌లో నుంచి తీసేస్తారేంటని ఫ్రస్టేట్‌ అయ్యాడు. అక్కడున్న ఓ వస్తువును సైతం సుత్తితో పగలగొట్టాడు.

ఆకలి బాధలు..
ఇంత వయొలెంట్‌గా ఉన్నాడేంట్రా బాబూ అనుకునే సమయానికి ఇంట్లో ఏడుస్తూ కనిపించాడు. తన కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు. 'నేను లోన్‌ తీసుకుని ఈ షోకి వచ్చాను. నా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ జీరో. నా సోదరుడి షూలు తీసుకుని వచ్చాను. అది కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నాను. ఇది అగ్రెషన్‌ కాదు, ఆకలి బాధ. నాకు ఉద్యోగం లేదు. వంద రూపాయలు కూడా నా చేతిలో లేవు. నా దగ్గర రెండు, మూడు ప్యాంట్స్‌ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వాటినే ఉతికి వేసుకుంటున్నాను. ఎంత మంచిగా ఆడినా నాకు సరైన న్యాయం జరగడం లేదు' అని వెక్కి వెక్కి ఏడ్చాడు.

నిరుద్యోగి.. లోన్‌ కష్టాలు
అమీర్‌పేటలో రూ.7 లక్షలు పెట్టి కోర్స్‌ నేర్చుకున్నానని, ఉద్యోగం కోసం వెతుకుతున్నానని బిగ్‌బాస్‌ 7 లాంచ్‌ రోజే చెప్పాడు ప్రిన్స్‌. కష్టాల్లో ఉన్న సమయంలో బిగ్‌బాస్‌ 7 ఆఫర్‌ వచ్చిందని పేర్కొన్నాడు. అంటే ప్రిన్స్‌కు ఆర్థిక కష్టాలు ఉన్నమాట వాస్తవమే! అయితే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని తాజా ఎపిసోడ్‌లో వాపోయాడు ప్రిన్స్‌. సోషల్‌ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఐఫోన్‌ వాడుతున్నావ్‌, రూ.20 వేల హెడ్‌సెట్‌ ఉంది.. డబ్బులిచ్చి మరీ జిమ్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటున్నావ్‌.. నీ దగ్గర చిల్లిగవ్వ లేదంటే నమ్మాలా? సందు దొరికితే పేదవాడినని సింపతీ కొట్టేద్దామనుకుంటున్నావా? అని కొందరు ట్రోల్‌ చేస్తున్నారు.

పేడ టాస్కులోనూ..
దీనిని ప్రిన్స్‌ ఫ్యాన్స్‌ తిప్పికొడుతున్నారు. మోడల్‌గా అవకాశాలు రావాలంటే ఆమాత్రం మెయింటెన్‌ చేయాలని, లేదంటే ఒక్క అవకాశం కూడా ఇవ్వరని చెప్పుకొస్తున్నారు. ప్రిన్స్‌ మాటల్లో నిజాయితీ ఉందని వాదిస్తున్నారు. పేడ టాస్కులో కూడా ప్రశాంత్‌ దగ్గర ఇ‍న్నర్‌, తేజది షర్ట్‌ అడిగి మరీ తీసుకున్నాడని.. ఇక్కడే తన పరిస్థితేంటో అర్థమైపోతుందన్నారు. అతడిని విమర్శించడం మాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండని కామెంట్లు చేస్తున్నారు.

ప్రిన్స్‌ యావర్‌ కుటుంబ నేపథ్యం..
ప్రిన్స్‌ తల్లిది హైదరాబాద్‌ కాగా తండ్రిది కోల్‌కతా. యావర్‌కు నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ప్రిన్స్‌కు 6 ఏళ్ల వయసున్నప్పుడు అతడి తల్లికి ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. తనకు చేసిన చికిత్స వికటించడంతో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. అది తీవ్రం కావడంతో ఆమె మరణించింది. ప్రస్తుతం యావర్‌ మోడల్‌గా, నటుడిగా రాణిస్తున్నాడు.

చదవండి: చంద్రబాబుకు పీడకలలా మిగిలిన ఎన్టీఆర్‌! 58 ఏళ్ల కింద సరిగ్గా ఇదే రోజు..

మరిన్ని వార్తలు