Bigg Boss Telugu 7: రతిక శాడిజం వల్ల సీరియల్‌ బ్యాచ్‌ అవుట్‌.. పచ్చిబూతులు మాట్లాడిన అమర్‌

15 Sep, 2023 09:31 IST|Sakshi

Day 11 Highlights

బిగ్‌బాస్‌ 7లో ఉన్నవారంతా కంటెస్టెంట్లే.. హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్‌ పొందాలంటే తను పెట్టే టాస్కులు గెలవాలి, తనను ఇంప్రెస్‌ చేయాలి.. అప్పుడే ఇంటిసభ్యులవుతారని బిగ్‌బాస్‌ మెలిక పెట్టిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం ఉన్న 14 మందిలో ఆట సందీప్‌ తొలి ఇంటిసభ్యుడిగా పేరు తెచ్చుకోగా మిగతావారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం హౌస్‌లో మాయాస్త్ర టాస్క్‌ నడుస్తోంది. మరి ఈ టాస్కులో ఏం జరిగాయి? హౌస్‌లో ఏం జరిగింది అనేది తాజా ఎపిసోడ్‌ (సెప్టెంబర్‌ 9)లో చదివేద్దాం.

దొరికేసిన పవరాస్త్ర
శుభశ్రీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎలాగో మాయాస్త్రలో ఏ పవర్‌ అస్త్రను గెలవలేకపోయాం కదా అని సందీప్‌ మాస్టర్‌ దగ్గరున్న పవర్‌ అస్త్రను కొట్టేసింది. పోనీ.. అదైనా జాగ్రత్తగా దాచిందా అంటే అదీ లేదు. కిచెన్‌లో దాయడం, అప్పటికే సందీప్‌ మాస్టర్‌ సహా పలువురు దానికోసం వెతుకులాట మొదలుపెట్టడం, అమర్‌దీప్‌ దాన్ని వెతికి మాస్టర్‌ చేతికివ్వడం జరిగిపోయింది. దీంతో శుభశ్రీ అంత ఈజీగా దొరికిపోయిందేంటి అని బిత్తరముఖం వేసుకుంది.

బిగ్‌బాస్‌ బంపర్‌ ఆఫర్‌
తెల్లారిన తర్వాత బిగ్‌బాస్‌ మాయాస్త్ర టాస్క్‌ను తిరిగి కంటిన్యూ చేశాడు. ఈ మాయాస్త్ర ద్వారా నాలులుగు వారాల ఇమ్యూనిటీతో పాటు ఈ వారం కూడా ఎలిమినేషన్‌ గండం నుంచి గట్టెక్కవచ్చని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. మహాబలి టీం సభ్యులు.. రణధీర సమూహంలో ఎవరైతే పవరాస్త్ర పొందేందుకు అనర్హులో కారణం చెప్పి వారి దగ్గరున్న మాయాస్త్ర భాగాన్ని అదే గ్రూప్‌లోని మరో సభ్యుడికి ఇవ్వాల్సి ఉంటుంది. చివర్లో ఏ ఇద్దరి దగ్గర ఎక్కువ మాయాస్త్ర భాగాలు ఉంటే వారు పవరాస్త్ర కోసం పోటీ పడతారు. మొదటగా శుభశ్రీ వెళ్లి.. శోభా శెట్టి దగ్గరున్న మాయాస్త్ర భాగాన్ని ప్రిన్స్‌ యావర్‌కు ఇచ్చింది.

మూడు చెరువుల నీళ్లు తాగించిన రతిక
పల్లవి ప్రశాంత్‌.. అమర్‌ దగ్గరున్నది తీసి శివాజీకి ఇచ్చాడు. తర్వాత మొదలైంది అసలు రచ్చ.. నెక్స్ట్‌ రతిక వెళ్లాలని మహాబలి టీం ఫిక్స్‌ చేసింది. లేదు, నేను చివర్లోనే వెళ్తానని తెగేసి చెప్పింది రతిక. లేదు, నేనే చివర్లో వెళ్తానని టేస్టీ తేజ, గౌతమ్‌లు వాదించారు. తనకు ఎంత సర్ది చెప్పాలని చూసినా వినిపించుకోలేదు. శివాజీని గెలిపించాలని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్‌ అయిన రతిక అందుకోసం తన టీమ్‌మేట్స్‌ మీద అరిచి గోల చేసింది. దామినితో అయితే మాటల పోట్లాటకు దిగింది. మనకంటే ఆ టీమ్‌ బెస్ట్‌ అని రతిక అనడంతో ఆ టీమ్‌లోకే వెళ్లు అని చెప్పింది దామిని. అసలు నువ్వు ఎవరు? ఆ టీమ్‌లోకి వెళ్లు, ఈ టీమ్‌లోకి వెళ్లు అని చెప్పడానికి అని మరింత రెచ్చిపోయింది రతిక.

ఛీఛీ.. వీళ్లంతా జోకర్స్‌.. బఫూన్స్‌
టీఆర్పీ కోసమే కదా రెచ్చిపోతున్నావ్‌ అని ఉన్నమాట అనేసింది సింగర్‌. కానీ తర్వాత మాత్రం తన కన్నీళ్లను కంట్రోల్‌ చేసుకోలేకపోయింది. దీనికి బుర్ర లేదు, బుద్ధి లేదు, రెస్పెక్ట్‌ లేదు.. ప్రతీది టీఆర్పీ కోసమే చేస్తుంది అని ఏడ్చేసింది. ఏదేమైనా రతిక మాత్రం వెనక్కు తగ్గలేదు. చివర్లోనే వెళ్తానని డిసైడ్‌ అయింది. ఈ సమస్యను తేల్చేందుకు మూడో స్థానంలో ఎవరు వెళ్లాలని ఓటింగ్‌ పెట్టారు. అందరూ రతిక వెళ్లాలని చేతులు ఎత్తారు. దీంతో ఆమె ఛీఛీ.. వీళ్లంతా జోకర్స్‌లా ఉన్నారు, ఈ టీమ్‌లో ఉండటానికే చెండాలంగా ఉంది. వీళ్లంతా బఫూన్స్‌ అంటూ నోటికొచ్చింది వాగింది. ఒకసారి ఫస్ట్‌ వెళ్తానంటది, సెకండ్‌ అంటది, ఫోర్త్‌, లాస్ట్‌.. అంటుంది. ఈమెకే క్లారిటీ లేదు. మళ్లీ నోరు జారుతుంది అని సీరియస్‌ అయ్యాడు డాక్టర్‌ బాబు గౌతమ్‌.

సందీప్‌ మాస్టర్‌కు బీపీ తెప్పించిన రతిక
మధ్యలో కలగజేసుకున్న సంచాలక్‌ సందీప్‌.. రెండు రోజులుగా ఆ టీమ్‌లో ఉన్నావ్‌.. ఇప్పుడు వాళ్లను బఫూన్స్‌ అంటున్నావ్‌.. కరెక్ట్‌ కాదు అని చెప్పాడు. రతిక పాప వింటే కదా.. వాళ్లు అలాగే ప్రవర్తిస్తున్నారు.. ఏమనాలి మరి? అని తిరిగి ప్రశ్నించింది. టీమ్‌ మెంబర్స్‌ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో సంచాలకుడైన సందీప్‌ మాస్టర్‌ మూడో స్థానంలో రతికను రమ్మని ఆదేశించాడు. అబ్బే.. నేను మోనార్క్‌ను, ఎవరి మాటా వినను అన్న స్టైల్‌లో తను రానని తెగేసి చెప్పింది. దీంతో సందీప్‌ మాస్టర్‌కు సైతం బీపీ వచ్చి ఆవేశపడ్డాడు. ఎవరేమనుకున్నా, ఎన్ని గంటలు సాగదీసినా సరే ఐ డోంట్‌ కేర్‌ అని లైట్‌ తీసుకుంది రతిక పాప.

ఇచ్చిపడేసిన బిగ్‌బాస్‌
ఇదంతా చూసిన షకీల అమ్మ.. రేయ్‌, ఆమె కంటెంట్‌ ఇవ్వడానికి ట్రై చేస్తుంది.. ఇవ్వనివ్వండి అని అనుభవంతో మాట్లాడింది. ఇలాగైతే టాస్క్‌ ముందుకు వెళ్లేలా లేదని దామిని మూడో స్థానంలో వెళ్లింది. ప్రియాంక దగ్గరున్న మాయాస్త్రను షకీలాకు ఇచ్చింది. కనీసం నాలుగో స్థానంలో అయినా వెళ్లమని బతిమాలినా రతిక వినలేదు. దీంతో బిగ్‌బాస్‌ కలుగజేసుకున్నాడు. మహాబలి టీమ్‌కు సరిపడ సమయం ఇచ్చినా టాస్క్‌ పూర్తి చేయనందున ఎవరు నాలుగు, ఐదారు స్థానాల్లో రావాలో రణధీర టీమ్‌ నిర్ణయించాలని మెలిక పెట్టాడు. అంతేకాదు, అప్పటివరకు మాయాస్త్ర భాగాలను పొందినవారికి మాత్రమే మిగిలిన భాగాలు ఇవ్వాలని కండీషన్‌ పెట్టాడు.

ఆటలో అరటిపండుగా మారిన సీరియల్‌ బ్యాచ్‌
ఈ నిర్ణయంతో ఆట సందీప్‌.. రతికను చూస్తూ చప్పట్లు కొట్టాడు. కానీ ఈ నిర్ణయంతో మాయాస్త్ర భాగాలు కోల్పోయిన అమర్‌, ప్రియాంక, శోభా శెట్టి ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మూడు రోజుల కష్టమంతా వృథా అయిందని ఆవేదన చెందాడు అమర్‌దీప్‌. వాష్‌రూమ్‌లోకి వెళ్లి.. మీ ఈగో వల్ల మా గేమ్‌ పోయింది అంటూ పచ్చి బూతులు మాట్లాడుతూ ఏడ్చేశాడు. దీంతో ప్రియాంక, శోభా అతడిని కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నించారు. మొత్తానికి రతి పాప పంతం వల్ల సీరియల్‌ బ్యాచ్‌ ఆటలోనే లేకుండా పోయింది.

చదవండి: సంచలనాలకు కేరాఫ్‌గా బిగ్ బాస్ సీజన్‌-7..!

మరిన్ని వార్తలు