Urfi Javed: నటి లగేజీతో ఉడాయించిన ‍డ్రైవర్‌.. పూటుగా తాగి ఫోన్‌కాల్స్‌..

22 Feb, 2023 15:19 IST|Sakshi

చిత్రవిచిత్ర డ్రెస్సులతో సోషల్‌ మీడియాను ఆగం చేసే బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఢిల్లీలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ట్విటర్‌లో రాసుకొచ్చింది. 'ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి ఓ క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాను. దాదాపు ఆరు గంటల కోసం దాన్ని బుక్‌ చేసుకున్నా. మధ్యలో లంచ్‌ చేద్దామని ఆగాను. ఇంతలో ఆ కారు డ్రైవర్‌ నా లగేజీతో ఉడాయించాడు. నేను వెంటనే నాకు తెలిసిన ఫ్రెండ్‌ సాయం కోరాను. అతడు కల్పించుకోవడంతో ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ఓ గంట తర్వాత పూటుగా తాగి వచ్చాడు.

నిజానికి అతడు పార్కింగ్‌ ఏరియాలోనే ఉన్నాడు. కానీ తన లొకేషన్‌ మాత్రం నేనున్న చోటుకు దూరంగా ఉన్నట్లు చూపించింది. పైగా ఆ డ్రైవర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తలేదు. అతడు తిరిగి వచ్చాక ఎందుకిలా చేశావంటే సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా మాట్లాడాడు' అని రాసుకొచ్చింది. దీనిపై ఉబర్‌ యాజమాన్యం స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఇక్కడే మరో సమస్య మొదలైంది. ఉర్ఫీకి సదరు డ్రైవర్‌ తాగి ఫోన్లు చేస్తున్నాడట. ఈ విషయాన్ని సైతం ఉర్ఫీ ట్విటర్‌లో తెలియజేసింది. 'ఉబర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ డ్రైవర్‌ తాగి మరీ ఫోన్లు చేస్తున్నాడు. ఇప్పటివరకు 17 మిస్‌డ్‌ కాల్స్‌ వచ్చాయి. ఇంకా ఫోన్‌ చేస్తూ నన్ను వేధిస్తూనే ఉన్నాడు. ఇంత ఫిర్యాదు చేసినా మళ్లీ ఇలా జరుగుతోందంటే మీరసలు ఏమాత్రం పట్టించుకోలేదని అర్థమవుతోంది' అంటూ ఉబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది నటి.

చదవండి: నన్ను కిందకు లాగుతున్నారు, డబ్బులిచ్చి మరీ... కిరణ్‌

మరిన్ని వార్తలు